ఒకరు సూటిగా, మరొకరు సుత్తిగా

ఒక పారిశ్రామిక వేత్త దృష్టిలో ఇద్దరు సీఎంలు

Telangana-seemandhra-map-e1395162279484

ఒక పారిశ్రామిక వేత్త ఒక పరిశ్రమ పెట్టదలిచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాడు. అది కూడా బాబు చెప్పిపంపితేనే వెళ్లాడట. బాబు ముప్పై నిమిషాల సమయం ఇచ్చాడట. ఆ 30 నిమిషాలలో ఆయన మాట్లాడింది ఇదీ అని ఆ పారిశ్రామిక వేత్త ఇటీవల సన్నిహితుల వద్ద చెప్పాడు: ఏంటీ మీరంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకరిస్తున్నారు. ఫార్మా పరిశ్రమ పెట్టడానికి ఆయన(వెళ్లిన పారిశ్రామిక వేత్త మిత్రుడిని ఉద్దేశించి)కు ఎంత సపోర్ట్ చేశాం. కానీ ఆయనేంటీ అక్కడే ఇంకా ఇంకా విస్తరించుకుంటున్నాడు. ఇక్కడికి రారా? నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను. నెక్లెస్ రోడ్డు వేశాను. హైటెక్‌సిటీ నిర్మించాను. బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చాను. హైదరాబాద్ అభివృద్ధి అంతా నా చలవే. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి?…..అని చంద్రబాబు సుమారు 20 నిమిషాలకుపైగా ఏకబిగిన మాట్లాడినట్టు ఆ పారిశ్రామిక వేత్త వివరించారు. తన సమయం అంతా ఆయన గొప్పలు వినడానికే పోయిందని ఆయన వాపోయాడట. పరిశ్రమ పెట్టడానికి గల అవకాశాలు ఏమిటి? నిలబడుతుందా లేదా? ఏవైనా ప్రోత్సాహకాలు ఇస్తున్నారా లేదా? ఇత్యాది అంశాలేవీ చంద్రబాబు నోటి నుంచి వెలువడలేదు.

ఆ తర్వాత రెండు రోజులకు ఇదే పారిశ్రామిక వేత్త తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు వెళ్లాడట. మా వద్ద పెట్టుబడి పెట్టడానికి రావడం సంతోషం. మా పారిశ్రామిక విధానం మీకు తెలుసు. మీకు ఏ ఇబ్బందీ రానివ్వం. కొత్త పరిశ్రమలకు ఇస్తున్న అన్ని రాయితీలు మీకూ వర్తిస్తాయి. మీకు ఏమి కావాలి? ఎంత భూమి కావాలి? ఎంత బిజినెస్ ఉంటుంది? ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు?…. అని సుత్తి లేకుండా సూటిగా మాట్లాడారు చంద్రశేఖర్‌రావు. వస్తూ వుంటే భోజనం చేసి వెళ్లమని కోరారు. సున్నితంగా వద్దని చెప్పేసి వచ్చేశాను. నాకు ఒకటే తేడా అనిపించింది. కేసీఆర్‌లో ఏదో చేయాలన్న తపన కనిపించింది. రాష్ర్టాన్ని మరింత విజయపథంలో నడిపించాలన్న ఆరాటం ఉంది. చంద్రబాబు ఒకప్పుడు బిజినెస్‌లైక్‌గా ఉండేవారు. ఇప్పుడు ఇంకా పాత విజయాలనే చెప్పుకుంటున్నాడు. పాత ఆలోచనల్లోనే కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన సోదికింద పడిపోయాడే అనిపించింది అని ఆ పారిశ్రామిక వేత్త సన్నిహితుల వద్ద అభివర్ణించారు.