నాలుగేళ్లలో ఎనిమిది స్థానాలు కోల్పోయిన బీజేపీ

బీజేపీకి గడ్డుకాలం

బీజేపీకి గడ్డురోజులు మొదలయ్యాయా? గరువారం వెలువడిన అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీ వ్యతిరేక పవనాలను సూచిస్తున్నాయి. నరేంద్రమోడీ నాయకత్వంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం సాధించింది. ఒంటరిగానే 282 లోక్‌సభ స్థానాలు సాధించి పార్టీ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. అటువంటి పార్టీ క్రమంగా ఆ వైభవాన్ని కోల్పోతున్నది. గత నాలుగేళ్లలో 27 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా బీజేపీ ఐదు మాత్రమే గెలిచింది. ఉప ఎన్నికలు జరిగిన స్థానాల్లో బీజేపీ 2014 ఎన్నికల్లో గెలిచినవి 13 స్థానాలు. అందులో ఐదు స్థానాలను మాత్రమే ఆ పార్టీ నిలబెట్టుకుంది. ఎనిమిది స్థానాలను కోల్పోయింది. మహారాష్ట్రలో బీడ్, పాల్ఘార్, గోండియా, గుజరాత్‌లో వడోదర, ఉత్తరప్రదేశ్‌లో లఖింపూర్, గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, కైరానా, మధ్యప్రదేశ్‌లో షాధోల్, రత్లాం, రాజస్థాన్‌లో అల్వార్, అజ్మీర్, పంజాబ్‌లో గురుదాస్‌పూర్ నియోజకవర్గాలను 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో బీడ్, వడోదర, లఖింపూర్, పాల్ఘార్, షాధోల్ స్థానాలను మాత్రమే నిలబెట్టుకుంది. మిగిలిన ఎనిమిది స్థానాల్లోనూ ఓడిపోయింది. బీజేపీ కోల్పోయిన ఎనిమిది స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్, రెండింటిని ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ, ఎన్‌సీపీ ఒక్కొక్కటి చొప్పున గెలిచాయి. 2017 తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ఒక్క పాల్ఘార్‌లో మాత్రమే బీజేపీ గెలిచింది. మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది.