మొగులు మీద మన్నుపోసే

మొగులు మీద మన్నుపోస్తే మొగం మీద పడ్తది. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాలు, చెబుతున్న అబద్ధాలు అరవయ్యేళ్ల వారి చరిత్రను దాచిపెట్టలేవు. వారి పాపాలు కడిగితే పోవు. కాలానికి కొట్టుకుపోవు. ఎందుకంటే అవి మరచిపోయేవి కాదు. శాసనసభ సమావేశాల మొదటి రోజు నుంచి వారు చేస్తున్న అల్లరి వారి గయ్యాళి తనాన్ని, అక్కసును, అజ్ఞానాన్ని బయటపెట్టిందే తప్ప, ఏ ఒక్క అంశాన్నీ చర్చకు పెట్టలేదు. శాసనసభలో గవర్నరు ప్రసంగం ఇంకా పూర్తి కాకముందే కాంగ్రెస్ నాయకులు గలభాకు దిగారు. అది ఏ సమస్య మీదనో తెలియదు. ఎందుకు గలభా చేస్తున్నారో తెలియదు. సమస్య మీద వారికి ఎంత నిబద్ధత ఉందో ఆ క్షణంలో వారి ముఖాల్లో వికవికలు, మైకులతో వారి వికృత చేష్టలు చూస్తే అర్థమవుతుంది. చిన్న పిల్లల్లా, చిల్లర వేషాలు వేసేందుకు వెనుకాడలేదు. పైగా గవర్నరుకోసం విసిరితే అది మండలి చైర్మనుకు తగిలిందని వివరణ ఇచ్చుకోవడం. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఏ గంగలో కలిసిందో, ఇంతకాలం ఏమి నేర్చుకున్నారో ఆ క్షణాన వారిని చూసినప్పుడు చాలామందికి సందేహం కలిగింది. కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత, మేము వేరు, అల్లరి చేసినవారు వేరు అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వాస్తవం వేరు. శాసనసభా పక్షం సమావేశంలో వారంతా కూడబలుక్కుని శాసనసభలో గలభా సృష్టించారు. ఒక వేళ అలా కాకపోయినా గలభా చేసేవారిని వారించాల్సిన నాయకత్వ బాధ్యతలో ఉండి, సభనుంచి తప్పించుకుపోయినా అదేమీ పెద్దరికం కాదు. తమ పార్టీ సభ్యులు చేసిన దోషఫలం నుంచి నాయకుడూ తప్పించుకోలేడు. శాసనసభలో ఇలా గొడవ జరగడం ఇదే మొదటిసారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హరీశ్‌రావు బల్లలు ఎక్కలేదా అని మాట్లాడుతున్నారు. ఆ రోజున్న పరిస్థితులు ఎలాంటివి? నిన్నటి పరిస్థితులు ఎలాంటివి? అప్పట్లో సభలో గొడవ జరుగడానికి ముందు తెలంగాణలో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా వాతావరణం భావోద్వేగంతో నిండిఉంది. తెలంగాణ ఇస్తమని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేస్తూవస్తున్నది. గవర్నరు ప్రసంగంలో తెలంగాణ గురించి ఎటువంటి హామీ లేదు. ఈ మోసపూరితమైన వైఖరిపై తెలంగాణ అంతా భగ్గుమంటున్న కాలం. అటువంటి పరిస్థితుల్లో హరీశ్‌రావు చాలా ఆవేశంగా ఆరోజు గవర్నరును నిలువరించే ప్రయత్నం చేసినమాట వాస్తవం. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు పోలిక ఉందా. కాంగ్రెస్ నాయకుల్లో ఏ సమస్యపైనైనా అంతటి సీరియస్‌నెస్ ఉందా. ఉంటే ఆ పకపకలు, వికవికలు, ఆ కామెడీ వేషాలు వేసేవారా?

నువ్వు మంచిపేరు సంపాదించుకోలేకపోతే ప్రత్యర్థికి చెడ్డపేరు ఆపాదించు. గౌరవంగా యుద్ధం గెలవలేకపోతే, ఎంత నీచానికైనా పాల్పడు. మన బురదను కడుక్కోలేకపోతే పక్కవాడికీ కొంత పూసి ఇద్దరూ సమానమేనని రుజువు చెయ్యి….ఇవన్నీ కాంగ్రెస్ ఇంతకాలం అమలు చేస్తూ వచ్చిన రాజకీయ వికృత విన్యాసాలు. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వారికి సమస్యలు దొరకడం లేదు. కాంగ్రెస్ కలలో కూడా ఆలోచించని, చేయని పనులు చాలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రజాకేంద్రక విధానాలతో పనిచేసుకుంటూ పోతున్నది. తెలంగాణను ఆరు దశాబ్దాలపాటు అరిగోసకు గురిచేసిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలది. సరిపడా కరెంటు ఇవ్వలేదు. విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ చేయలేదు. అన్నింటికోసం ధర్నాలు, రాస్తారోకోలే. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటికి కటకట. సాగునీరు తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఒక సమస్యే కాదు. రైతులకు సాగునీరు, పల్లెలకు తాగు నీరు హామీ ఇవ్వాలన్న ఆలోచనే వారికి ఏ రోజూ రాలేదు. అడిగినవారికి అడగనివారికి అందరికీ పింఛన్లు ఇస్తున్నది. అనేకానేక సామాజిక భద్రతా పథకాలను ప్రవేశపెట్టింది. రైతురుణాన్ని మాఫీ చేయడమే కాకుండా, రైతుల్లో భరోసా నింపేందుకు ఎకరాకు నాలుగువేల రూపాయల పెట్టుబడిని ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టి దేశం అంతా తెలంగాణవైపు చూసేట్టు చేసింది. మరో అడుగు ముందుకు వేసి రైతులందరికీ ప్రమాద బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆలోచన చేయని విధంగా పేదల పిల్లలకు అత్యంత నాణ్యమైన గురుకుల విద్యను అందిస్తున్నది. ముస్లింలకు లౌకికవాదం గురించి కోతలు కోసే ఏ పార్టీ చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇవ్వాళ ముస్లింల పిల్లలకు ప్రధాన స్రవంతి విద్యావకాశాలను కల్పించేందుకు, మత విద్య నుంచి విముక్తి చేసి, బతుకుతెరువునిచ్చే విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ గురుకుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇటువంటి విప్లవాత్మకమైన ఆలోచన ఇటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ, టీడీపీలు కానీ ఏనాడైనా చేశాయా? ఒక్క సామాజిక వర్గం ఏమిటి సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకునే అనేక ఆర్థిక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. సంక్షేమ, సామాజిక భద్రత పథకాల విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా వెలుగొందుతూ ఉన్నది.

నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో గత నాలుగేళ్లలో మన రాష్ట్రంలో మన ప్రభుత్వం చూపెడుతున్న శ్రద్ధ మూడు నాలుగు దశాబ్దాల క్రితం మన నాయకులు చూపించి ఉంటే తెలంగాణ ఎంత బాగుండేది. ఇవ్వాళ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో అందరికీ తెలుసు. ప్రాజెక్టులు, కాలువలు పూర్తి చేసి ప్రజలకు నీరివ్వడం లక్ష్యంగా పనిచేయ లేదు. తలా ఒక కాంట్రాక్టు తీసుకుని, కాలువలు తవ్వి, ప్రాజెక్టుల పని వదిలేశారు. ఇవ్వాళ వీరావేశాలు ప్రదర్శిస్తున్న నల్లగొండ కాంగ్రెస్ నాయకుడు పక్కా కాంట్రాక్టరుగానే రాజకీయాల్లో ప్రవేశించారు. ఉదయసముద్రం పూర్తయి ఒకటిన్నర దశాబ్దాలవుతున్నది. ఇప్పటికీ ఆ రిజర్వాయరు నుంచి డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి కాలేదు. చాలా డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వెళ్లడం లేదు. భూసేకరణ పూర్తి చేయలేదు. ఎక్కడికక్కడ వివాదాలు సృష్టించి జనాన్ని మాయలో ఉంచుతూ వచ్చారు. కమ్యూనిస్టుల ప్రభావంలో ఉన్నాయన్న పేరుతో తిప్పర్తి మండలంలో ఏడు గ్రామాలను మంచినీటి పథకం నుంచి కూడా తొలగించిన సంకుచిత నాయకత్వం వారిది. నిజమైన అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేయలేదు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు కాంగ్రెస్ నాయకులు వేసిపోయిన ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు సాగుతున్నది తెలంగాణ ప్రభుత్వం. గరిష్ఠస్థాయిలో నదీజల వినియోగం, గరిష్ఠస్థాయిలో భూమి సాగు లక్ష్యంగా ఒక్కొక్క కాలువను పూర్తిచేస్తూ వస్తున్నది. ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేల వరకు అందరూ ప్రాజెక్టుల వద్ద కాపలా కాస్తూ, నిద్రలు చేస్తూ పనులు చేయించుకుంటున్నారు. తమ ఊళ్లకు నీళ్లను తెచ్చుకుంటున్నారు. ప్రజలతో కలిసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నీళ్లను చూసి కొన్ని పల్లెలు చిన్నపిల్లల్లా పండుగ చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ నాయకత్వానికి జీర్ణం కానిది ఇదే. వాళ్లు ఇంకా 80లలో, 90లలో మాదిరిగానే రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ వారిని దాటి చాలా దూరం వెళ్లిపోయారు. ఆయన ఆలోచనల కార్ఖానా కాంగ్రెస్ నాయకత్వానికి అంతుబట్టడం లేదు. కొత్త ఆలోచనలు కానీ, కొత్త ఎజెండాలు కానీ వారికి తట్టడం లేదు. మూస గొడవలు, బురద చల్లడాలు, ఏదో ఒకటిచేసి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడాలు వంటి నేలబారు ఆలోచనలపైనే వారు ఆధారపడుతున్నారు. అందుకే శాసనసభలో అడ్డంగా, ఆలోచనారహితంగా అల్లరిచేసి అభాసుపాలయ్యారు. గట్టిగా అరిచి చెబితే అబద్ధం నిజం కాదు. తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అభివృద్ధి నిరోధక ఆలోచనలకు కేంద్రం కాంగ్రెస్. హత్యా రాజకీయాలను పెంచి పోషించింది కాంగ్రెస్. అర్థబలాన్ని, అంగబలాన్ని ఉపయోగించి దశాబ్దాలపాటు ప్రజల మూపులపై స్వారీ చేసింది కాంగ్రెస్. ఇవ్వాళ ఆ పార్టీ నాయకులు బట్టకాల్చి టీఆర్‌ఎస్ నాయకుల మీద వేయాలని చూస్తున్నారు. అధికారం కోల్పోయిన విభ్రమలో వారు అవన్నీ మరచిపోవచ్చు. కానీ జనం మరచిపోరు. రాష్ట్రంలో, జిల్లాల్లో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నదీ అందరూ గమనిస్తున్నారు. ఎన్ని విన్యాసాలు, డ్రామాలు వేసినా కాంగ్రెస్‌ను ఇప్పుడప్పుడే ప్రజలు క్షమించరు.