అమరావతి నిర్మాణం ఒక మహాప్రయత్నం

andhra

రాజధాని ఇక్కడే ఎందుకు మరోచోట నిర్మించవచ్చు కదా అని కొందరు వాదిస్తున్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర విడివడినప్పుడే విజయవాడ రాజధాని కావలసింది. అప్పుడు కొందరు నాయకుల కుట్రపూరితమైన ప్రయత్నాలవల్ల విజయవాడ అటువంటి అవకాశాన్ని కోల్పోయింది.ఇప్పుడయినా విజయవాడ-గుంటూరులను ఎంచుకుని చంద్రబాబు మంచి పనిచేశారు. వ్యూహాత్మకంగా మంచి ప్రాంతం. రాజధానికి అవసరమైన తాగు నీరు పుష్కలంగా అభించే ప్రాంతం. ఉత్తర, దక్షిణాలకు జీవనాడి వంటి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతం. ఒక మహాప్రయత్నం జరుగుతున్నప్పుడు ఫిర్యాదులు చిన్నవయిపోతాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఎప్పుడయినా వినిర్మాణం, నిర్మాణం పక్కపక్కనే సాగుతాయి. ఎవరికీ ఏ ఇబ్బందీ కలుగకుండా కొత్త నిర్మాణాలు సాగవు. అందునా రాజధాని నిర్మాణం ఒక మహాప్రయత్నం. శంషాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ జరిగినప్పుడు విన్న విమర్శలు, వాదనలే ఇప్పుడు కూడా వింటున్నాం. కానీ ఇప్పుడు విమనాశ్రయం అవతరించిన తర్వాత దాని అవసరం తెలిసివస్తున్నది. భూములు విలువైనవా, సాగుకు పనికొచ్చేవా అన్నదానితో నిమిత్తం లేకుండా ఏ రైతైనా తాను అప్పటిదాకా సాగు చేసుకుంటున్న భూమిని వదిలేసుకోవలసి వస్తే బాధపడతాడు. మథనపడతాడు. గొడవపడతాడు. అటువంటి రైతులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎక్కడయినా తప్పనిసరి. అది ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నారనే రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు మిత్రులు చెబుతున్నారు. ఇంకా కొంతమందికి అభ్యంతరాలు ఉండవచ్చు. పక్షపాతాలు, ఇష్టాయిష్టాలు, రోడ్లు వంకరలు తిరగడాలు, కొందరి భూములు రక్షించడాలు….ఎక్కడయినా ఎప్పుడయినా చూశాం. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు నిర్మాణం సందర్భంగా ఇవే ఆరోపణలు చంద్రబాబుపైనా, రాజశేఖర్‌రెడ్డిపైనా వచ్చాయి. అధికారంలో ఉన్నవారు ఇలా పక్షపాతంతో వ్యవహరించకూడదన్నది నిజమే. జగన్ ముఖ్యమంత్రి అయినా ఇటువంటి విమర్శలు వచ్చి ఉండేవే.

రాజధాని ఇక్కడే ఎందుకు మరోచోట నిర్మించవచ్చు కదా అని కొందరు వాదిస్తున్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర విడివడినప్పుడే విజయవాడ రాజధాని కావలసింది. అప్పుడు కొందరు నాయకుల కుట్రపూరితమైన ప్రయత్నాలవల్ల విజయవాడ అటువంటి అవకాశాన్ని కోల్పోయింది. ఒక్క ఓటు తేడాతో విజయవాడ కావాలన్న వాదన వీగిపోయింది. ఇతర ప్రాంతాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో తెలుగు ఎమ్మెల్యేలని చెప్పి ఓటు చేయించి కర్నూలు వాదాన్ని నెగ్గించుకున్నారు. అప్పుడే విజయవాడ రాజధాని అయిఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. ఇప్పుడయినా విజయవాడ-గుంటూరులను ఎంచుకుని చంద్రబాబు మంచి పనిచేశారు. వ్యూహాత్మకంగా మంచి ప్రాంతం. రాజధానికి అవసరమైన తాగు నీరు పుష్కలంగా అభించే ప్రాంతం. ఉత్తర, దక్షిణాలకు జీవనాడి వంటి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతం. ఒక మహాప్రయత్నం జరుగుతున్నప్పుడు ఫిర్యాదులు చిన్నవయిపోతాయి.

ఒక కొత్త రాష్ట్రం తన కాళ్లపై తాను నిలదొక్కుకోవాలంటే ప్రయాస తప్పనిసరి. ప్రతిపక్షం విమర్శలు చేయవచ్చు. బాధితుల పక్షాన కొట్లాడవచ్చు. కానీ ఇంత పెద్ద ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ సన్నాహాలతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం ఉచితం కాదు. ఎప్పుడయినా రాజకీయాల్లో ఒక మీటింగ్ పాయింట్ ఉండాలి. అధికార పక్షం కూడా అందరినీ కలుపుకునిపోయే ధోరణిని ప్రదర్శించాలి. రాజధాని ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన వ్యవహారంగా జరుగుతున్న ప్రచారాన్ని వమ్ముచేయాలి. రాయలసీమవాసుల్లో తలెత్తుతున్న భయాలను నివృత్తి చేయాలి. అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తికావాలి. ఆంధ్రప్రదేశ్ ఒక శక్తివంతమైన రాష్ట్రంగా ఎదగాలి.

(నమస్తే తెలంగాణ సంపాదకునిగా నాకు కూడా ఆహ్వానం అందింది. ఆ సందర్భంగా ఈ నాలుగు మాటలు.)