సమస్యంతా ఈగోనే

IMG_2721

వీళ్ల సమస్య ఏమిటి? తెలంగాణ ప్రభుత్వంపై ఎందుకింత కక్షగట్టారు? ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్లు రాష్ర్టాన్ని పరిపాలించిన పార్టీలు, ఇప్పుడు పదిహేను మాసాల్లోనే సర్వం నాశనం అయిపోయిందని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కేంద్రంలో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌లలో అధికారంలో ఉండి రైతు ఆత్మహత్యలపై చేతులెత్తేసిన బీజేపీ కూడా ఎందుకు తెలంగాణలో మాత్రమే వీరంగం వేస్తున్నది? వీళ్ల బాధ ప్రజల గురించేనా లేక మరేదైనా ఉందా? అని రెండు రోజుల క్రితం విశ్రాంత ఆచార్యుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరేదైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానాలు వెదకడం కష్టమేమీ కాలేదు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని అడిగాను- నిన్నగాక మొన్న వచ్చిన రాష్ట్రంలో, తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ఎందుకు ఇలా ఒంటికాలుపై లేస్తున్నారు? అని. ఎందుకు మాట్లాడం? ముఖ్యమంత్రి మమ్మల్ని ఏమన్నా లెక్క చేస్తున్నారా? మాతో ఏమన్నా మాట్లాడుతున్నారా? మమ్మల్ని కనీసం పలకరించారా? ఏ కారణం చేత మేము మౌనంగా ఉండాలి? ఎందుకు ఓపిక పట్టాలి? మా పార్టీ మాకుంటది. మా రాజకీయాలు మాకుంటాయి. మేము మనుగడ సాగించాలి కదా? అని ఆ నాయకుడు సమాధానమిచ్చాడు. ఏమండీ. పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి విదేశీ ప్రయాణాలేవీ తమరికి కనిపించలేదు. ఆయన పాత్రికేయులను కూడా విదేశాలకు తీసుకుపోయాడు. కేసీఆర్ చైనా యాత్రకు వెళితే ఆత్మహత్యలకు చైనా యాత్రకు ముడిపెట్టి నానా యాగీ చేస్తున్నారు? ఎందుకింత కక్ష తెలంగాణపై? అని మరో సీనియర్ జర్నలిస్టును అడిగాను. ఎందుకు రాయం? మీ ప్రభుత్వానికి మాకూ ఏమిటి సంబంధం? మేము మీ ప్రభుత్వంలో పెద్దలను కలవడానికి ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నాం. ఎవరూ కలవరు. ఏమీ చెప్పరు. మీరు చెప్పనప్పుడు మాకు తెలిసింది రాసుకుంటాం. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ఇలా కబురుపెడితే అలా స్వాగతం చెబుతారు. మీరేమో స్పందించరు. ఏమి చేయాలి? అని ఆయన సమాధానం ఇచ్చారు. ఇటీవల ఒక మిత్రుడు ఒక సలహా ఇచ్చాడు. ఆ కక్ష పత్రిక అధిపతితో ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటే పోతుందిగా… ఇన్ని మంచి పనులు చేస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడూ జరగనంత గుణాత్మకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కరువు వల్ల ఆత్మహత్యలు జరుగుతున్న మాటవాస్తవమే కానీ, పాలన విషయంలో ప్రజలకు పెద్దగా ఫిర్యాదులు లేవు. ఎటొచ్చీ కొన్ని పత్రికలు, కొంత మంది నాయకులే నిద్రపోవడం లేదు. ఒక్కసారి కేసీఆర్ మాట్లాడితే సెటిల్ అయిపోతుంది. వారు కూడా కేసీఆర్ పిలుపు కోసమే ఈ ఆరాటమంతా చేస్తున్నారు అని ఆ మిత్రుడు సలహా ఇచ్చాడు. ఆయన పత్రికాధిపతికి, తెలంగాణ ప్రభుత్వానికి ఉభయులకూ శ్రేయోభిలాషి. అందుకే తాపత్రయం కొద్దీ చొరవ తీసుకుని మరీ ఈ విషయం చెప్పారు. మొత్తం అభిప్రాయాల సారాంశం ఏమంటే ప్రతిపక్షాలు, పత్రికాపక్షాలు-అందరి బాధ ఈగోనే. వీరి ఈగోను తృప్తి పర్చేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వంలోని పెద్దలు నడుచుకోకపోవడం. వీరి కనుసైగలకు అడుగులు వేయకపోవడం. వీరి గొంతెమ్మ కోరికలు తీర్చకపోవడం. సమస్యలు అన్నవి వారి చేతిలో పావులు మాత్రమే. రైతు ఆత్మహత్యలు అన్నవి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవీ కాదు, ఛూప్ మహంకాళీ అంటే ఆగిపోయేవీ కాదు. ఈ విషయం ప్రతిపక్షాలకు, పత్రికాపక్షాలకు రెంటికీ తెలుసు. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని లొంగదీయడానికి వారికి ఒక అదను.

ఎవరితో సెటిల్ చేసుకోవాలి? సెటిల్ చేసుకోవడం అంటే ఏమిటి? ఒక్కసారితో సెటిల్ అయ్యేవారా వీరు? ఆయన కోరికలకు అంతులేకుండా పోతున్నది. ఒకటి చేస్తే వెంటనే ఇంకోటి అడుగుతాడు. అదీ తనకేదో హక్కున్నట్టు అజమాయిషీ చేస్తాడు. భరించడం కష్టంగా ఉంది అని ఆయనతో సెటిల్ చేసుకుని సంసారం చేస్తున్న పొరుగు రాష్ట్రం ముఖ్యనేత ఒకరు ఇటీవల సన్నిహితుల వద్ద చెప్పారట. ఈ సెటిల్‌మెంట్ గ్యాంగు అంతా కలసి తాను హైదరాబాద్‌లో ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారని కూడా ఆయన వాపోయారట. నిజం. పొరుగు రాష్ట్రం అధినేతలు ఇంత తొందరగా తమ కార్యరంగాన్ని విజయవాడకు మార్చుతారని ఎవరూ ఊహించలేదు. ఆ క్రెడిట్ అంతా సెటిల్‌మెంట్ గ్యాంగుదేనని అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఓటుకు నోటు కేసు చంద్రబాబునాయుడును అనివార్యంగా హైదరాబాద్‌లో తలెత్తుకోలేని స్థితికి తీసుకువచ్చింది. తెలంగాణలో తమ పార్టీకి ఇక భవిష్యత్తు ఉండబోదనే విషయమూ ఆయనకు బోధపడింది. చంద్రబాబు రాజకీయాలకు ఇన్వెస్టర్లుగా పనిచేసే కాంట్రాక్టర్ రాజకీయవేత్తలు కొద్దికాలం క్రితం చంద్రబాబునాయుడుకు ఆ విషయం స్పష్టంగా చెప్పారట. తెలంగాణలో మళ్లీ మనం గెలుస్తామనుకుంటున్నారా సార్ అని వారు చంద్రబాబును అడిగారట. ఆయన అనుకూలంగా స్పందించలేదు. మరెందుకు సార్ అక్కడ డబ్బులు దండగ చేయడం. మీకోసం ఎంత కష్టమయినా పడతాం. కానీ గెలవని చోట, ఎవరికోసమో ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలి సార్. పైగా వారి డిమాండ్లకు అంతులేకుండా పోతున్నది. నిరంతరం బెదిరించుడే. పార్టీ మారతామని బ్లాక్‌మెయిల్ చేస్తారు. అడ్డగోలుగా నిధులు అడుతున్నారు. ఎందుకుసార్ ఈ తలనొప్పి అంతా? అని వారు చంద్రబాబును అడిగినట్టు ఒక కాంట్రాక్టర్ తన సన్నిహితుల వద్ద చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాలేమని చంద్రబాబుకు తెలుసు. ఇప్పుడు తెలంగాణలో వీరావేశాలు ప్రదర్శిస్తున్నవాళ్లలో సగం మంది కూడా వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో మిగలరనీ తెలుసు. రేవంత్‌రెడ్డి తెరవెనుక ఏమి మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఆయనతో ప్రమాదం ఏమిటో, ప్రమోదం ఏమిటో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే రేవంత్‌రెడ్డి ఎంత బెదిరించినా ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేయలేదు. కనీసం పొలిట్ బ్యూరోలోకి తీసుకోలేదు. ఆరోవేలు వంటి వర్కింగ్ కమిటీ అధ్యక్షపదవి కట్టబెట్టి అయనకు తమ పార్టీలో ఉన్న ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే చెప్పారు. చంద్రబాబుకు ఒక స్పష్టత ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రశాంతంగా పనిచేసుకోకూడదు. నిత్యం కెలికే బ్యాచ్ ఒకటి తెలంగాణలో ఉండాలి. అధికారంలోకి రావడం రాకపోవడం అన్నదానితో నిమిత్తం లేదు. వాళ్లు తమ మిత్రులైన పత్రికాపక్షాలతో కలిసి వీలైనంత అల్లరి చేస్తూ ఉండాలి. కేసీఆర్‌పైన, తెలంగాణ ప్రభుత్వంపైన వీలైనంత బురద చల్లుతూ ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పనులు మానేసి, ఆ బురదను కడుక్కోవడంవైపు దృష్టి మళ్లించాలి. చంద్రబాబుకు ఇప్పుడు మరో లక్ష్యం కూడా ఉంది. తనది జాతీయ పార్టీ అని, తాను జాతీయ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. జాతీయ పార్టీ గుర్తింపు రావాలంటే అధికారంలోకి వచ్చినా రాకపోయినా కనీసం నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో లోక్‌సభ లేక శాసనసభ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు, కనీసం నాలుగు సీట్లు సంపాదించి ఉండాలి. లేక మూడు రాష్ర్టాల్లో కనీసం 11 లోక్‌సభ స్థానాలు గెలిచి ఉండాలి. ఇది ఆయన దీర్ఘకాలిక దృష్టిలో భాగం. అందుకే రాబడిలేని దుకాణంలో పెట్టుబడులు పెట్టబోమని ఇన్వెస్టర్లు మొత్తుకుంటున్నా చంద్రబాబునాయుడు పండ్ల బిగువుమీద నెట్టుకొస్తున్నారు.

కేసీఆర్ అనుకుని చేశారో, అనుకోకుండా జరిగిందో కానీ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం వంటి పార్టీలన్నీ కలసి మాట్లాడుకోవలసిన పరిస్థితి కల్పించారు. ఓటుకు నోటుతో కళంకితమైన పార్టీ, ఆంధ్ర ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుదికంటా వ్యతిరేకించిన పార్టీ, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నపార్టీ….ఇలా అందరితో కాంగ్రెస్ చేరవలసిన దుస్థితి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పడింది. కాంగ్రెస్‌కు నిజానికి అంతపెద్ద ఎజెండా లేదు. కానీ ఎవరో నిర్ణయించిన ఎజెండాను కాంగ్రెస్ నెత్తికెత్తుకుంది. టీఆరెస్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ముందుగా ఏ పార్టీఅయినా తెలంగాణ ప్రజల్లో ప్రతిష్ఠను పెంచుకోవాలి. పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందగలగాలి. టీడీపీ, సీపీఎం, బీజేపీలతో కలసి చేసే కార్యాలు మేలు చేయవు సరికదా ఆ పార్టీని మరింత పల్చన చేస్తాయి. కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది తెలంగాణలో టీఆరెస్ అధికారంలోకి రావడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చింది అంతా కొత్త నాయకత్వం. అసెంబ్లీలో నలభై శాతానికిపైగా కొత్తవారు. మంత్రుల్లో కూడా చాలా మంది కొత్తవారు. రాజకీయాల్లో వటవృక్షాల్లా పాతుకుపోయిన మహామహా నాయకులను అలా పక్కకు తోసేసి కొత్తతరం తెలంగాణను శాసించే స్థానంలోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వం ఇంతకాలం చేయలేని పనులు, మాట్లాడని అంశాలు ఇప్పుడు కొత్త నాయకత్వం మాట్లాడుతున్నది. ఏ ఒక్క అంశంపైనా వారు తమను తాము సమర్థించుకోలేని పరిస్థితి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేని దుస్థితి. అందుకే వారు విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు. కడుపుమంటతో, కక్షతో ఏదో ఒక పత్రిక రాసే వార్తలు తప్ప సొంతంగా హోంవర్కు చేసే నాయకుడు, సొంతంగా ఎజెండాను నిర్ణయించుకుని, నిలబడి కొట్లాడే సంఘటిత శక్తి ఆ పార్టీలో లేకుండా పోయింది. అందుకే పూటకో రకంగా ఆ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. జానారెడ్డి పెద్దరికం వహించబోతారు. తెలంగాణ నిత్యం తన్నుకుంటూ ఉంటే, తగలబడుతూ ఉంటే సంబరపడాలని ఉబలాటపడే కక్షపత్రిక ఒకటి జానాబెత్తెడు పెత్తనం అని విరుచుకుపడుతుంది. జీవన్‌రెడ్డి, ఉత్తంకుమార్‌రెడ్డి ఎక్కడ వెనుకబడిపోతామో అని ఆవేశపడతారు. మల్లు భట్టివిక్రమార్క విప్లవసినిమాల్లో నారాయణమూర్తిలాగా గర్జిస్తారు. ఇంకొంతమంది మాజీలు ఉన్నారు. ఉన్మాదంతో ఊగిపోతున్నారు. కాంగ్రెస్‌కు మేలు చేస్తున్నామో కీడు చేస్తున్నామో అన్న సోయిలేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ను డామేజీ చేయడానికి వేరేవాళ్లు అక్కరలేదు. నలభై ఏళ్లు పాలించినవాళ్లం… పదిహేను మాసాలకే పగబట్టినట్టు వ్యవహరిస్తే జనం ఎలా నమ్ముతారు? అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడే గొణిగాడు. జనానికి ధర్మాగ్రహంలాగా అనిపించాలి. అక్కసు, ఆక్రోశాలతో కూడిన అరుపులు అనిపించకూడదు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించే అవకాశాన్ని వదిలేసి, ఇతరులు విసిరే ఎజెండాల వెంట పరుగు పెడుతున్నది.

నేను కళ్లు మూసుకుంటే ప్రపంచమంతా నిద్రపోయినట్టే, నాకు మంట పుడితే ప్రపంచమంతా మండిపోవాల్సిందే అనుకునేవాళ్లను ఏమీ చేయలేం. వీలైనంత కెలకడం, అల్లరి చేయడం, బురదపోయడం వాళ్లకు చేతనైన పని. వాళ్లను ఈగోను తృప్తిపర్చడం అన్నది మానవమాత్రులకు సాధ్యం కాదు. కానీ ప్రధాన స్రవంతిలోని రాజకీయ శక్తులను, ప్రసార సాధనాలను ఎంగేజ్ చేయడం ప్రజాస్వామిక రాజకీయాల్లో భాగం. ఎంత గొప్ప ఆలోచనలయినా చేయవచ్చు. ఎన్ని గొప్ప పనులయినా చేయవచ్చు. తెలంగాణలో కరెంటు కోతలు లేవు. ఎరువుల కొరత లేదు. విత్తనాలకోసం క్యూలు లేవు. పెన్షన్లకోసం ఎదురు చూపులు లేవు. పెన్షన్లపై మునుపెన్నడూ లేని రీతిలో ఐదు రెట్లు అదనంగా ఖర్చు చేస్తున్నది. ఒక్క పెట్టున ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. చేనేత కార్మికుల పాత రుణాలను మాఫీ చేసింది. ఇన్‌పుట్ సబ్సిడీలు చెల్లించింది. సమైక్యరాష్ట్రంలో పెండింగులో పెట్టిపోయిన అనేక చెల్లింపులను ఈ ప్రభుత్వం క్లియర్ చేసింది. సుమారు ఆరు వేల చెరువుల్లో పూడికలు తీయించి ఊళ్లకు తిరిగి జలకళను తీసుకొచ్చింది. నీటిపారుదల ప్రాజెక్టులకింద ఉన్నమేరకు ఇప్పుడు ఉపయోగించుకున్నంత నీరు మునుపెన్నడూ ఉపయోగించుకోలేదు. జూరాల కింద ఈసారి అన్ని చెరువులూ నిండాయి. చివరి భూములకూ నీరందాయి. బడి, హాస్టలు విద్యార్థులకు కడుపునిండా సన్నబియ్యం అన్నం పెడుతున్నది. పేద కుటుంబాలకు సరిపోను బియ్యం ఇస్తున్నది. అయినా కరువు కాటేసింది. ప్రకృతి సహకరించలేదు. రైతులను సంక్షోభంలోకి నెట్టింది. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మెదక్, నల్లగొండతో సహా అన్ని జిల్లాల్లో రైతులకు భరోసా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తిరిగి కొత్త జీవితం ప్రారంభించడానికి అవసరమైన దన్ను ప్రభుత్వం కల్పిస్తున్నది. కానీ ప్రతిపక్షాలను, మీడియాను దూరంగా పెట్టడం అన్న ఒకే ఒక్క కారణంగా ప్రభుత్వానికి రావలసిన మంచి పేరు రావడం లేదు. నోరు కలిగిన ఈ వర్గం ఏదో కొంపలు మునిగిపోయాయన్న ప్రచారాన్ని అదేపనిగా చేస్తున్నది. అవకాశం దొరికితే చాలు తెలంగాణ ప్రభుత్వంపై బండలు వేయడానికి ప్రయత్నిస్తున్నది. తెలంగాణ సాధనకోసం ఎంతో మంది ఈగోలను జయించి, ఎన్నో స్రవంతులను కూడగట్టి స్వరాష్ర్టాన్ని, స్వరాష్ట్రంలో అధికారాన్ని సాధించిన కేసీఆర్ ఇప్పుడు అదే పని ఎందుకు చేయడం లేదని ఈ ప్రభుత్వం మేలు కోరుకుంటున్న విశ్రాంత ఆచార్యుడు ప్రశ్నించాడు. నీటిపారుదల ప్రాజెక్టులపై జరిగే అఖిల పక్ష సమావేశంతో ఈ దిశగా మరిన్ని అడుగులు పడాలి.