గోదావరి మళ్లింపు చంద్రబాబు చేసిన మంచిపని

godavaribesin
ఒక రోజు ఒక సభలో వెనుకబాటు తనం గురించి గంపెడు ఉపన్యాసాలు ఇస్తుంటే నా పక్కన కూర్చున్న ఓ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. ‘ఇన్ని మాటలు అనవసరం. ఒక్కో రైతుకు ఒక్క ఎకరాకు ఖర్చు లేకుండా సాగు నీరివ్వండి. వెనుకబాటుతనం, మూఢ నమ్మకాలు, ఆత్మహత్యలు…. అన్నీ అవే కనుమరుగవుతాయి’ అన్నాడు. అది నిజమనిపించింది. కృష్ణ, గోదావరి జిల్లాలోని పరిస్తితులను, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలను పోల్చి చూస్తె తేడా అర్థమవుతుంది. గోదావరిలో నిన్నటి రోజు కూడా 83000 క్యుసెక్ల నీరు అంటే రోజుకు 7.5 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నది. గత రెండు మాసాలుగా ఇలాగే జరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటికే 1000 టీ ఎంసీ ల నీరు బంగాళా ఖాతంలో కలిసిపోయింది.

కృష్ణాలో పైనుంచి నీరు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. కృష్ణ నీటి నుంచి డెల్టాను పాక్షికంగా నైనా విముక్తి చేయగలిగితే తెలంగాణకు, రాయలసీమలకు మేలు జరుగుతుంది. నదీ జలాల వివాదం, పట్టిసీమ పంచాయతీ పక్కన పెడితే….గోదావరి నీటిని కృష్ణాకు తరలించుకు రావడం కచ్చితంగా చంద్రబాబు సాధించిన విజయమే. అందునా ఇప్పుడున్న కరువు పరిస్తితుల్లో ఇంత తొందరగా నీరు తీసుకు రావడం ఆయన చేసిన గొప్ప పనుల్లో ఒకటిగా మిగిలిపోతుంది.

గోదావరి కృష్ణ అనుసంధానం వల్ల ఎగువ రాష్ట్రాలకు కృష్ణా నీటిలో అదనంగా 80 టీఎంసీల వాటా దక్కుతుంది. తెలంగాణా ప్రాజెక్టులకు ఈ నీటిని కేటాయిన్చుకోవచ్చు. చంద్రబాబు ఎవరి విమర్శలనూ లెక్క చేయకుండా పని పూర్తి చేసుకు పోయారు. తెలంగాణా ప్రభుత్వం కూడా త్వరితగతిన నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపైనే ద్రిష్టిని కేంద్రీకరించాలి.