ఇంటిపార్టీ సొంత టీమ్

Telangana-map

తెలంగాణ తొలి అసెంబ్లీ కొత్త నాయకత్వానికి, కొత్త రాజకీయాలకు, నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలంటే పాత పార్టీలకు, పాత నాయకత్వాలకు వీడ్కోలు పలకాలి. తెలంగాణకు సొంతదైన రాజకీయ నాయకత్వం ఎదిగిరావాలి. ఎవరో పెడితే పార్టీ అధ్యక్షుడు అయ్యేవాడు, ఎవడో కరుణిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. తమ రాతను, తమ చేతను, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే పార్టీలు కావాలి. ఒక్క టీఆరెస్సే కాదు, ఎన్ని పార్టీలు వచ్చినా పర్వాలేదు. తెలంగాణకు ఇంటి పార్టీలు కావాలి. ఇంటి నాయకులు కావాలి. పొరుగింటి పార్టీలు, పరాయి నాయకులు కాదు.

ఎన్నికల ముఖ చిత్రం స్పష్టపడింది. ఇక ఏ పార్టీతోనూ పొత్తులు, చిత్తులు ఉండవని తేలిపోయింది. ఇక జరగాల్సింది సమరమే. టీఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ తొలిజాబితాపై సర్వత్రా సానుకూలత వ్యక్తమయింది. వివాదాలకు తావులేని 69 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో అత్యధికులు ఆది నుంచి తెలంగాణ ఉద్యమంతో ఉన్నవారే. ఒకటి రెండు చోట్ల తప్ప తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన స్ఫూర్తిని ఎన్నికల్లో కూడా కొనసాగించాలన్న ప్రయత్నం అభ్యర్థుల ఎంపికలో వ్యక్తమయింది. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవి, సాంస్కృతిక ఉద్యమకారుడు రసమయి బాల్‌కిషన్, మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మలను అభ్యర్థులుగా ఎంపికచేసి తెలంగాణ శ్రేణులకు సరైన సంకేతాలను పంపారు. రెండవ జాబితా రూపకల్పనలో కూడా ఇంతే నిగ్రహం, విశాలదృష్టితో అభ్యర్థుల ఎంపిక జరగాలని తెలంగాణవాదులు ఆశిస్తున్నారు. తొలి జాబితా అభ్యర్థులు అత్యధిక మంది తెలంగాణవాదుల్లో జనాదరణ కలిగిన నాయకులే. తెలంగాణ తొలి అసెంబ్లీ కొత్త నాయకత్వానికి, కొత్త రాజకీయాలకు, నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయాలంటే పాత పార్టీలకు, పాత నాయకత్వాలకు వీడ్కోలు పలకాలి. తెలంగాణకు సొంతదైన రాజకీయ నాయకత్వం ఎదిగిరావాలి. ఎవరో పెడితే పార్టీ అధ్యక్షుడు అయ్యేవాడు, ఎవడో కరుణిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. తమ రాతను, తమ చేతను, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే పార్టీలు కావాలి. ఒక్క టీఆరెస్సే కాదు, ఎన్ని పార్టీలు వచ్చినా పర్వాలేదు. తెలంగాణకు ఇంటి పార్టీలు కావాలి. ఇంటి నాయకులు కావాలి. పొరుగింటి పార్టీలు, పరాయి నాయకులు కాదు. టీడీపీ ఎప్పటికీ ఇంటి పార్టీ కాలేదు. కాంగ్రెస్ సీమాంధ్ర భవబంధాలను ఇంకా తెంచుకోలేదు. కానీ ఇప్పటికీ టీడీపీ అబద్ధాలు ప్రచారం చేయడంలో బలమైన శక్తి. దానికి ఉన్న ప్రచార పటాటోపం చాలా పెద్దది. తాను గెలవలేకపోయినా, ఎదుటివారిని బద్నాం చేయడంలో దిట్ట. అందుకే అటువంటి శక్తులకు అవకాశం ఇవ్వకుండా టీఆరెస్ అడుగులు వేయాలి.

తెలుగుదేశం ఏమాటకూ నిలబడని పార్టీ. తెలంగాణకోసం ఏరోజూ కొట్లాడని పార్టీ. ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు సగం మంది తెలుగుదేశం నాయకులపేర్లు, కాంగ్రెస్ నాయకుల పేర్లే రాసిపెట్టి చనిపోయారు. చంద్రబాబు చేసిన కుట్రలవల్ల తెలుగుదేశం ఎన్నోసార్లు వెనుకకుపోయింది. తెలంగాణ ఉద్యమంపై చంద్రబాబు నాయుడు చేయించినంత దాడి మరే పార్టీ, మరే నాయకుడూ చేయించలేదు. పోలవరానికి, తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి, సకల జనుల సమ్మెను అమ్ముకున్నారని ఆరోపించి, ఉద్యమాన్ని నాశనం పట్టించాలని చూసిన ఆషాఢభూతి చంద్రబాబు. అమరవీరులకు సహాయంపేరిట కొందరు 420లను ప్రోత్సహించి, ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్‌కు పిలిపించి ఛీకొట్టించిన నికృష్ట చరిత్ర తెలుగుదేశం తెలంగాణ నాయకులది. వారు ఇప్పుడు శంకరమ్మ గురించి చాలా చాలా మాట్లాడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్, బిజెపి నాయకులకు నిజాయితీ ఉంటే శంకరమ్మపై ఎవరినీ పోటీ పెట్టవద్దు. తొలి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక అమరవీరుడి తల్లిని అడుగుపెట్టనిద్దాం. శంకరమ్మను ఏకపక్షంగా గెలిపించి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు పెట్టిన శాపాల నుంచి విముక్తిని పొందండి. ‘పాలకుర్తి నుంచి ఎందుకు పోటీకి పెట్టలేదు’ అని ప్రశ్నిస్తున్నావు కదా, నువ్వు కాకతీయ ముందు నిలువునా దహించుకున్న భోజ్యానాయక్ తండ్రికో తల్లికో పాలకుర్తి సీటు ఇవ్వకూడదా ఎర్రబెల్లీ!

తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ సాధన అంత ముఖ్యం. మన రాష్ట్రం మనకు వచ్చినా మనపై మరొకరెవరో పెత్తనం చేసే పరిస్థితి ఉంటే మనం సాధించుకోగలిగింది తక్కువ. తెలంగాణ తొలినాళ్లు రాజకీయ సుస్థిరత చాలా అవసరం. చంద్రబాబు ఆడిస్తే ఆడే మనుషులో, ఢిల్లీ పెద్దలు నడిపిస్తే నడిచే మనుషులోఅయితే తెలంగాణ గుణాత్మకమైన మార్పును సాధించలేదు. బహునాయకత్వం తెలంగాణకు అరిష్టం. తెలంగాణకు ఒక బలమైన సొంత రాజకీయ బలగం అవసరం. టీఆరెస్ ఆ పాత్రను నిర్వర్తించగలదన్న నమ్మకం తెలంగాణవాదుల్లో ఉంది. ఈ నమ్మకాన్ని దెబ్బతీయడానికి శత్రువులు కూడా గట్టిగానే కాచుకుని ఉన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని సహజవనరులను, భూములను ప్రపంచంలో ఎవరికయినా తాకట్టు పెట్టడానికి వెనుకాడని పెద్దమనుషులు టీఆరెస్ టిక్కెట్లు అమ్ముకుంటోందని ప్రచారం చేస్తున్నారు. టిక్కెట్లు, అమ్మడం కొనడంలో కాంగ్రెస్, టీడీపీలను మించిన పార్టీలు లేవు. యూరోలాటరీ మోసగాడు కోలా కృష్ణమోహన్, నాదర్‌గుల్ కబ్జాదారు సూర్యప్రకాశ్‌రావు, స్టాంపుల కుంభకోణం సూత్రధారులతో సహవాసం చేసిన ఘనత చంద్రబాబుది. ఎమ్మెల్యే టిక్కెట్ల సంగతి దేవుడెరుగు. పార్టీకి పెట్టుబడులు పెట్టినవారికి బార్టర్ సిస్టం కింద రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చిన పార్టీ ఏదో రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వంలో ఉండి ప్రతి చిన్నపనినీ పైసకూ పరకకూ అమ్ముకున్న చిల్లర నాయకులెవరో కూడా ప్రజలకు బాగా తెలుసు. అయినా వీరి దాడులను తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. వీరి ప్రచారంపై అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణవాదులపై ఉంది.