ఖమ్మంలో నారాయణను నిలపాలని సిపిఐ తీర్మానం

cpi

ఖమ్మం: ఖమ్మం లోక్సభ స్థానానికి సిపిఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేరును ఖరారు చేశారు. ఈ రోజు ఇక్కడ జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

సిపిఐ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా సిపిఐ రెండు లోక్సభ, 17 శాసనసభ స్థానాలను కోరుతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఒక లోక్సభ, 12 శాసనసభ స్థానాలను కేటాయించడానికి సుముఖంగా ఉంది. సిపిఐ ఖమ్మం, నల్లగొండ లోక్సభ స్థానాలను కోరుతోంది. ఖమ్మం నుంచి నారాయణను పోటీకి నిలపాలని తీర్మానించారు. నల్గొండ స్థానం కూడా కేటాయించితే సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డిని పోటీకి నిలిపే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, పొత్తులో భాగంగా ఖమ్మం లోక్సభ స్థానాన్ని సీపీఐకి కేటాయించకుండా ఉండేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రేణుకా చౌదరి, రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఖమ్మం లోక్సభ స్థానాన్ని సిపిఐకి కేటాయించవద్దని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే అధిష్టానం వారి విజ్ఞప్తిని పట్టించుకున్నట్లు లేదు. ఖమ్మం ఎంపి స్థానాన్ని ఖచ్చితంగా సీపీఐకే కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.