తెలంగాణ సందిగ్ధం, సంవాదం

‘తెలంగాణ ఓటు చీలిపోకూడదు’

image

టీఆరెస్, బిజెపిల పొత్తు అవకాశాలపై తెలంగాణవాదుల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా బలంగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒక జర్నలిస్టుకు, ఒక టీఆరెస్ నాయకుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది. ‘తాటిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడొకడుంటాడ’ని రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ నాయకత్వం ఒకవైపు నుంచి నరుక్కొస్తూ ఉంటే, టీఆరెస్ ఇంకోవైపు నుంచి నరుక్కొస్తున్నది. చివరికి ఇవి ఎక్కడ ఎలా ముడిపడతాయో తెలియదు కానీ తెలంగాణలో ఒక తీవ్రమేధోమథనం జరుగుతున్నది.

కొండా సురేఖను టీఆరెస్‌లో ఎలా చేర్చుకుంటారు?

‘వారు కాంగ్రెస్‌లో చేరి పోటీచేస్తే పర్వాలేదా? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న జగ్గారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటే పర్వాలేదా? ఉస్మానియా విద్యార్థులపై దాడులు చేయించిన దానం నాగేందర్ మళ్లీ మంత్రి అయితే పర్వాలేదా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్టేషన్‌లో వేయించిన శ్రీధర్‌బాబు మళ్లీ గెలిస్తే తప్పు లేదా? తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్‌లో చేరవచ్చా? వారి గురించి లేని అభ్యంతరాలు కొండా సురేఖ గురించే ఎందుకు?’

మతోన్మాద బిజెపితో పొత్తు ఎలా పెట్టుకుంటారు?

‘తెలంగాణకోసం కొట్లాడేప్పుడు తెలియదా బిజెపి మతోన్మాద పార్టీ అని. అప్పుడు అందరం అలయ్ బలయ్ ఇచ్చుకోలేదా? కాంగ్రెస్ టీఆరెస్‌ను దెబ్బకొట్టడానికి కుట్రలు చేస్తున్నది. తెలంగాణ స్వీయరాజకీయ అస్తిత్వానికి ప్రతీకగా ఎదిగిన టీఆరెస్‌ను బలహీనపర్చడానికి డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కుయుక్తులను ఎదుర్కోవడానికి టీఆరెస్ తెలంగాణకోసం కలిసి పోరాడిన బిజెపితో చేతులు కలపాలనుకుంటే తప్పేముంది?’

ఒంటరిగానే గెలిచే అవకాశం ఉన్నప్పుడు పొత్తులతో పనేముంది?

‘తెలంగాణ ఓటు చీలిపోకూడదన్నదే మా తపన. బిజెపికి 10 నుంచి 12 శాతం ఓట్లు ఉన్నాయి. పట్టణ మధ్య తరగతిలో నరేంద్రమోడీ రావాలని కోరే ఒక తరం ఎదిగింది. పోయిన ఎన్నికల్లో పీఆర్పీ పోషించిన పాత్ర ఈసారి బిజెపి పోషించే అవకాశం ఉంది. ఆ ఓట్లు టీడీపీతో కలిస్తే తెలంగాణలో మళ్లీ ఆ పార్టీ ప్రాణం పోసుకుంటుంది. టీఆరెస్‌తో కలిస్తే తెలంగాణలో ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది. టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది. ఇక్కడ, కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉంటే అది మంచిదే కదా? ఈ సారి టీఆరెస్ గెలిచి తీరాలి. అందుకు కొన్ని రాజీలు తప్పవు’