తెరాస ఎందుకు తత్తరపడుతోంది?

telangana_state
వొత్తిడిలో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగించడానికే అవకాశాలు ఎక్కువ. తెరాస తన బలాన్ని తనే తక్కువ అంచనా వేసుకుంటున్నది. తెలంగాణా ప్రజల్లో పాదుకొని ఉన్న సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకోలేక పోతున్నది. జగన్, ఆయన కుటుంబ సభ్యులంతా కాలికి బలపం కట్టుకుని ఊరూ వాడా తిరుగుతుంటే తెరాస విలువైన సమయాన్ని మీన మేషాలు లెక్కించడంలో వృధా చేస్తున్నది.

భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకోదల్చుకుంటే ఇంకా ముందుగా ఆ ప్రయత్నం చేసి ఉండాల్సింది.. ఆఖరు క్షణం పొత్తులు 2009లొ ఎటువంటి అనుభవాన్ని మిగిల్చాయో తెలుసు. తెరాసకు ఒక అవకాశం ఇవ్వాలన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ఆ భావనను ఓట్లుగా మల్చుకోవాలంటే జగన్ కంటే ఎక్కువగా కెసిఆర్, హరీష్, రాజేందర్, కేటి రామారావు తెలంగాణా అంతటా పర్యటించాల్సి ఉంటుంది.

తెదేపాను వదలి భాజపా ఇప్పుడు వెనుకకు వచ్చే అవకాశాలు తక్కువ. భాజపాకు రెండు రాష్ట్రాల్లోనూ తెదేపా అవసరం ఉంది. సమయం వృధా చేసుకోకపోవడమే ఇప్పుడు తెలివైన ఆలోచన.