ఎవరు తెలంగాణవాదులు? ఎవరు తెలంగాణ ద్రోహులు ?

ప్రచారాన్ని కొనుక్కోవచ్చు కానీ ప్రతిష్ఠను, విశ్వసనీయతను కొనలేమని నాయకులు గుర్తించాలి. కొత్తగా జెండాలు, ఎజెండాలు ఎన్ని పులుముకున్నా ప్రజలు అసలు మనిషిని గుర్తుపట్టి తీర్పుచెబుతారని మరవద్దు. మీడియా కూడా రాజకీయాలను అంతే దూరం నుంచి చూడాలి. మీడియా ఏదైనా చేయగలదని, ఏమైనా చెప్పగలదని, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని ఎవరూ భ్రమించవద్దు. మీడియా ఏదైనా చేయగలిగే శక్తి ఉంటే ఈనాడు అధిపతి రామోజీరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండాలి. ప్రజలు పిచ్చివాళ్లని, ప్రజలకు ఏమీ తెలియదని, డబ్బులకు, మోసపూరిత వాగ్దానాలకు పడిపోతారని కొందరు మీడియా పెద్దలకు ఒక దురభిప్రాయం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరి అంకానికి చేరేకొద్దీ తెలంగాణవాదంపై హక్కులకోసం పోరాటం పెరుగుతోంది. ఎవరు తెలంగాణవాదులు? ఎవరు తెలంగాణ ద్రోహులు ? అన్న చర్చ మొదలైంది. ఎవరు ఎవరి పక్షాన నిలబడాలి అన్న మీమాంస పెరుగుతున్నది. పెట్టు తెలంగాణవాదులెవరు? పుట్టు తెలంగాణవాదులెవరు? కొట్లాడి తెలంగాణ వాదులయినవారెవరు? ప్రచారంలో తెలంగాణవాదులుగా ముద్ర పొందాలని చూస్తున్నదెవరు? తెలంగాణకోసం వీధిపోరాటాలు చేసిందెవరు? అధికార పీఠాల్లో అన్ని దర్జాలు అనుభవించినదెవరు? లాఠీలు, తూటాలు, అరెస్టులు, అష్ట కష్టాలు పడ్డదెవరు? అధికార చేలాంచలాల మధ్య అన్ని దందాలూ నడిపించుకున్నదెవరు? అమరవీరుల ఆశయాల కోసం అకుంఠిత దీక్షతో పోరాడిందెవరు? అమరుల శవాలపై ప్రమాణాలు చేసి పదవుల చుట్టూ, ముఖ్యమంత్రి దర్బారు చుట్టూ పచార్లు చేసిందెవరు? బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి పోరాడిందెవరు? అంతఃపుర నివాసాల్లో అన్ని రకాల సెటిల్‌మెంట్లు చేస్తూ కూర్చున్నదెవరు? ‘అయ్యా… కాంగ్రెసోళ్లకెందుకు అంత ప్రచారం కల్పిస్తున్నారు? ఆళ్లు గట్టిగా నిలబడితే, ఆళ్లుకొట్లాడితే ఈ తెలంగాణ ఇంకా రెండేళ్లు ముందుగనే వచ్చేది కాదా? మన పోరగాళ్లు ఇంతమంది సచ్చెటోళ్లా? వాళ్ల రాజీలు, రాజకీయాలవల్లనే కదా మనం ఇంతగోసపడ్డం?’ అని ఒక పెద్దాయన ఫోను చేసి నిలదీశారు, అవును ప్రజలు ఇప్పుడు లెక్కలు చూసుకుంటారు, ఎవరి పేరిట ఎంత బ్యాలెన్సు ఉందో తేల్చుకుంటారు. మనం ఏం చెబితే అది వింటారని పొరబడతారు. కానీ తెలంగాణ విషయంలో అటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఇట్లా కొట్లాడితే అట్ల వచ్చింది కాదు. ఐదున్నర దశాబ్దాల ఆరాటం, ఒకటిన్నర దశాబ్దాల పోరాటాల ఫలితం. ఈ పోరాటంలోని ప్రతిమలుపూ ప్రజల మననంలో ఉన్నాయి. కష్టాలు, కన్నీళ్లు, బలిదానాలు అంత తేలికగా మరచిపోయేవి కాదు. ఆశ నిరాశలు గత మూడేళ్లుగా తెలంగాణ ప్రజల ఉచ్చాసనిశ్వాసలయ్యాయి. ఈ ఉద్యమం ప్రజలపై ఒక బలమైన ముద్రను వేసింది. ఎవరు మనవాడు? ఎవరు మందివాడో అనేక సందర్భాల్లో రుజువు చేసింది.

అయినా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ప్రచారంతో యుద్ధాలు గెలవగలమని నమ్మే కొత్త తరం ఒకటి ముందుకు వస్తున్నది. వీర తెలంగాణవాదులుగా సభలు రభసలు చేసి జనాన్ని బురిడీ కొట్టించవచ్చునని భావించే నాయకులు కొందరు తయారవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యుద్ధం ఇంకా పతాకస్థాయికి చేరుతుంది. చానెళ్లలో, పత్రికల్లో ప్రచారం చూసి చలించిపోనవసరం లేదు. మీడియా ప్రచారాలే ఎన్నికల యుద్ధాలను గెలిపించే పనయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండిపోవాలి. మీడియా ఓడించగలిగితే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏ ఎన్నికల్లో గెలిచి ఉండకూడదు. మీడియా ప్రచారాలే నిజమయితే తెలంగాణ వచ్చి ఉండకూడదు. మీడియా ప్రచారాలను అధిగమించి మంచి చెడులను నిర్ణయించుకునే పరిణితి మన సమాజానికి అలవడుతున్నది. పాలను నీటిని వేరు చేయగలిగిన విచక్షణ మన ప్రజలు చూపుతున్నారు. ఇప్పటివరకు జరిగిన చాలా ఎన్నికల్లో ప్రజలు అటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించే ఆయా పార్టీలను గెలిపించారు. మీడియా ఒకవైపు, ప్రజలు మరోవైపు నిలబడిన సందర్భాలు అనేకం. మీడియా ఒక ప్రేరక శక్తి మాత్రమే, మౌలిక శక్తి కాదు. మౌలిక శక్తి లేకుండా ప్రేరక శక్తి ఏ పార్టీనీ నిలబెట్టలేదు. చంద్రబాబు కొండంత ఉదాహరణ. పార్టీ నాయకుడిపైన, పార్టీ చెబుతున్న అంశాలపైన ప్రజల్లో విశ్వాసం ఉంటే మీడియా దానిని ద్విగుణీకృతం చేయగలదు. నాయకుడు బలహీనంగా ఉంటే మీడియా ఎన్ని ఎత్తులు పెట్టినా ఏ పార్టీ పెరిగి పెద్ద కాబోదు. మీడియా స్వతంత్రంగా ఉన్నంతసేపు ప్రజలు దాన్ని గౌరవిస్తారు. మీడియా కూడా ఎస్టాబ్లిష్‌మెంట్‌లో భాగమైతే ఎస్టాబ్లిష్‌మెంట్‌తోపాటు దాన్నీ తిరస్కరింస్తారు. మీడియాను ప్రజలు తిరస్కరించకపోతే ఒక పత్రిక పాఠకుల సంఖ్య 90 లక్షల నుంచి 60 లక్షలకు, మరో పత్రిక పాఠకుల సంఖ్య 40 లక్షల నుంచి 20 లక్షలకు ఎందుకు పడిపోతుంది? మీడియా ప్రచారంతో నిమిత్తంలేని రాజకీయ చైతన్యం సమాజానికి అవసరం.

మీడియాను దొడ్లో కట్టేసుకుంటే అది చెల్లని కాసు అవుతుంది. దూరంగా పెడితే అది తిరకాసు అవుతుంది. మీడియాతో రాజకీయ పార్టీలు, నేతలు ఒక మర్యాదపూర్వకమైన సమదూరం కొనసాగించాలి. ప్రచారాన్ని కొనుక్కోవచ్చు కానీ ప్రతిష్ఠను, విశ్వసనీయతను కొనలేమని నాయకులు గుర్తించాలి. కొత్తగా జెండాలు, ఎజెండాలు ఎన్ని పులుముకున్నా ప్రజలు అసలు మనిషిని గుర్తుపట్టి తీర్పుచెబుతారని మరవద్దు. మీడియా కూడా రాజకీయాలను అంతే దూరం నుంచి చూడాలి. మీడియా ఏదైనా చేయగలదని, ఏమైనా చెప్పగలదని, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని ఎవరూ భ్రమించవద్దు. మీడియా ఏదైనా చేయగలిగే శక్తి ఉంటే ఈనాడు అధిపతి రామోజీరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండాలి. ప్రజలు పిచ్చివాళ్లని, ప్రజలకు ఏమీ తెలియదని, డబ్బులకు, మోసపూరిత వాగ్దానాలకు పడిపోతారని కొందరు మీడియా పెద్దలకు ఒక దురభిప్రాయం ఉంది. తాము ఆశించినట్టు ప్రజలు తీర్పు ఇవ్వకపోతే ప్రజలను తప్పుబట్టిన నాయకులు, మీడియా పెద్దలనూ గతంలో చూశాము. ఇదంతా ఆత్మాశ్రయవాదం నుంచి, స్వాతిశయం నుంచి పుట్టిన పెడ ధోరణి. ప్రజలపై గౌరవం లేకపోవడం నుంచి ఉత్పన్నమయ్యే వికారపు ఆలోచన. ప్రజల సమష్టి విచక్షణ ఎప్పుడూ గొప్పదే. మనకు ఇష్టం లేనివారిని గెలిపించినా సరే. మన రాష్ట్రంలో గత రెండేళ్లలో జరిగిన 40 నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఇందుకు ఉదాహరణ. ఇక్కడ తెలంగాణవాదుల విజయాన్ని ఏ మీడియా ఆపలేకపోయింది. అక్కడ జగన్‌మోహన్‌రెడ్డి విజయాన్ని కూడా అడ్డుకోలేకపోయింది. జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించడం తప్పు కాదా? అవినీతి కాదా? అని ప్రశ్నించవచ్చు. కానీ ప్రజలను ఒప్పించలేకపోవడం, ప్రజలకు నచ్చేట్టు వ్యవహరించకపోవడం జగన్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలు, నాయకుల వైఫల్యం. ప్రజల మనసును అర్థం చేసుకోలేకపోవడం, అంచనా వేయలేకపోవడం మీడియా తప్పు. ముఖం బాగలేకపోతే అద్దం పగులగొట్టవద్దు. పార్టీలకు, ప్రజలకు, మీడియాకు మధ్యన ఉన్న ఈ సన్నని పొరను అర్థం చేసుకోకుండా వీరంగం వేయడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజల విచక్షణపై నమ్మకం ఉంచడం ఒక్కటే వీటన్నింటికీ పరిష్కారం. తెలంగాణకు కూడా అదే శ్రీరామ రక్ష. మంచిని చెడును, తనవాళ్లను పరాయివాళ్లను గుర్తు పట్టగలిగిన తెలివితేటలు తెలంగాణ సమాజానికి ఉన్నాయి.