వినాశకాలే విపరీత బుద్ధి

కిరణ్ అప్రజాస్వామిక బుద్ధి

శాసనవ్యవహారాల మంత్రిని మార్చి, కొత్త చేలాతో సమైక్య తీర్మానం ప్రతిపాదింపజేసుకుని ఓటింగ్ జరిపించి పంపాలని కిరణ్ కుట్ర. చేసుకోనివ్వండి. ఇబ్బంది లేదు. వీరు చేసే వికృత విన్యాసాలతో తెలంగాణ ఆగదు. అసెంబ్లీ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కేంద్రం తన నిర్ణయం తాను తీసుకోవచ్చు.

కిరణ్‌కుమార్ రెడ్డి చేష్టలు తెలంగాణను ఆపలేవు, కానీ ఆయన కుట్ర మనస్తత్వాన్ని, మూర్ఖత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరిగితే నెగ్గదనే విషయం కాంగ్రెస్‌కు, కేంద్రానికి తెలుసు. రాష్ట్రపతికీ తెలుసు. ఈ బిల్లు నెగ్గుతుందని భావిస్తే ముందు తీర్మానమే చేయించేవారు. అది జరిగేపని కాదని తెలిసే బిల్లును అభిప్రాయాలకోసం పంపారు. రాష్ట్రపతి కోరిన విధంగా కాకుండా వీరు వీరికి ఇష్టం వచ్చిన విధంగా బిల్లుపై రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు.

చేస్తే బిల్లుపై తీర్మానం చేయాలి. కానీ సమైక్య తీర్మానం చేస్తారట. ఏది చేసినా ఇబ్బంది లేదు. శాసనవ్యవహారాల మంత్రిని మార్చి, కొత్త చేలాతో సమైక్య తీర్మానం ప్రతిపాదింపజేసుకుని ఓటింగ్ జరిపించి పంపాలని కిరణ్ కుట్ర. చేసుకోనివ్వండి. ఇబ్బంది లేదు. వీరు చేసే వికృత విన్యాసాలతో తెలంగాణ ఆగదు. అసెంబ్లీ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కేంద్రం తన నిర్ణయం తాను తీసుకోవచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీ చర్చించి పంపిన బిల్లును సంపూర్ణంగా మార్చి వేసి మూడు రాష్ట్రాలను కాస్తా రెండు రాష్ట్రాలకు మార్చి పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించింది నాటి ప్రభుత్వం.

మంత్రిత్వ శాఖల మార్పు కిరణ్ బుద్ధిని తెలియజేస్తున్నది. సీమాంధ్ర నాయకత్వం అప్రజాస్వామిక, దుర్మార్గ తంత్రాలను తెలియజేస్తున్నది. కిరణ్ ధోరణి హైదరాబాద్‌లో కనీసం ముఖం ముఖం చూసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నది. ఉద్రిక్తతలను పెంచుతున్నది. కనీస మర్యాదలను చెడగొడుతున్నది.

చెబితే విననివాడు చెడగా చూడాలంటారు. మంత్రంతో నయం కానిది కొరడాతో నయమవుతుందని కూడా సామెత. కిరణ్ పరిస్థితులను అందాకా తీసుకువస్తున్నారు. నిర్బంధంగా తెలంగాణను సీమాంధ్రతో కలిపి ఉంచాలని చూస్తున్నారు.