ఒక విలీనం-వంద ప్రశ్నలు

‘తెలంగాణ వచ్చిన తర్వాతనే టీఆరెస్ అవసరం ఎక్కువ’

నిన్నటిదాకా ఎవరు కలిసినా తెలంగాణా వస్తుందా రాదా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు ఎవరిని కదిపినా టీఆరెస్ విలీనం అవుతుందా, విడిగా పోరాడుతుందా అని ప్రశ్నిస్తున్నారు. టీఆరెస్ విడిగా ఉంటే తాము రాజకీయంగా చచ్చిపోతామని భావిస్తున్న కొన్ని పార్టీలు, కొందరు నాయకులు ‘టీఆరెస్ కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం కావడం లేదని’ మొత్తుకుంటున్నారు. ‘అయ్యో…సోనియాగాంధీ ఇంత కష్టపడి తెలంగాణ ఇచ్చింది కదా! ఆమెకు అండగా నిలవకపోతే ఎలా?’ అని ఆలోచించే మేధావులూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన చాలా మంది మేధావులు, సంఘాలు టీఆరెస్ విలీనం కాకూడదని కోరుతున్నారు. మొన్నొక పెళ్లిలో ఒక పెద్దాయన ‘ఈనగాచి నక్కలపాలు చేస్తారా?’ అని అడిగారు. ‘తెలంగాణ ఎజెండాను అమలు చేయడానికి ఒక సొంత రాజకీయ అస్తిత్వం అక్కరలేదా?’ అని కూడా ప్రశ్నించారు.

‘రాష్ట్రం ఏర్పడినంతనే తెలంగాణ విముక్తి కాదు. సీమాంధ్ర ఆధిపత్య అవశేషాలను నిర్మూలించనంతవరకు తెలంగాణపై వారి పెత్తనం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. ఈ కాంగ్రెస్ నాయకత్వం, ఈ టీడీపీ నాయకత్వం సీమాంధ్ర ఆధిపత్య శక్తుల ప్రభావంలో పనిచేసినవారే. ఇప్పటికీ వారు సీమాంధ్ర ఎజెండానే మోస్తున్నారు. నవ తెలంగాణ నిర్మాణానికి సంబంధించి వీరికి ఎటువంటి దృక్పథమూ లేదు. తెలంగాణ పునర్నిర్మాణం లేక పునరుజ్జీవంకోసం అంకితభావంతో పనిచేసే నాయకత్వం కావాలి. తెలంగాణ రాష్ట్ర డిమాండుకు మూలమైన సమస్యలను పరిష్కరించాలంటే వీళ్ల వల్ల కాదు. కేసీఆర్ వంటి బలమైన నాయకుడు, మొండిగా కొట్లాడే నాయకుడు కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే టీఆరెస్ అవసరం ఎక్కువ’ అని ఇటీవలే పదవీ విరమణ చేసిన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఒకరు చెప్పారు.

నిజానికి ఇప్పుడున్నది ఒక అనిశ్చిత వాతావరణం. ఇదమిద్ధంగా ఇలాగే జరుగుతుందని అంచనా వేయలేని పరిస్థితి. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. బిల్లు ఆమోదం పొంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంది. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుంది. కొన్ని పార్టీలు దెబ్బతింటాయి. కొన్ని పార్టీలు మరింత బలపడతాయి. మరికొన్ని పార్టీలు కొత్త శక్తితో విజృంభిస్తాయి. అప్పటికి ఎన్నికలు కూడా సమీపిస్తాయి. మార్చి మొదటివారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది. మార్చి చివరివారంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది.

తెలంగాణ బిల్లు ముందుకు సాగే కొద్దీ టీఆరెస్ విలీనంపై చర్చ కూడా తీవ్రమవుతుంది. కాంగ్రెస్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తుంది. చర్చల ద్వారాలు ఇప్పటికే తెరిచినట్టు సమాచారం. అందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారా లేదా, కాంగ్రెస్ పెద్దల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుని నిలబడతారా లేదా అన్నది ముందుముందు తెలుస్తుంది. కానీ ఆయన సన్నిహితులు చేస్తున్న వాదనలు వింటే విలీనానికి టీఆరెస్ సిద్ధంగా లేదని సూచనప్రాయంగా తెలుస్తుంది. ‘తెలంగాణ ఇవ్వండి మేము విలీనం చేస్తాం అని ఢిల్లీ చుట్టూ తిరిగినప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం మా నాయకత్వాన్ని అవమానించింది. ఎప్పుడో తేల్చాల్సిన ఈ సమస్యను ఎన్నికల ముందు దాకా తీసుకువచ్చింది. వందలాది మంది పిల్లలు బలికావడానికి కారణమైంది. ఇప్పుడు కూడా మేము ఆశించిన తెలంగాణ ఇవ్వడం లేదు. మాకు ప్రధానంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.

1. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో పెట్టడం తెలంగాణ ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని అవమానించడమే. మాకు పరిపాలించడం రాదని ఎక్కిరించడమే.

2. పెన్షనర్ల పంపిణీ, ఉద్యోగుల పంపిణీ ‘జనాభా ప్రాతిపదికన’ కాకుండా ‘స్థానికత’ ఆధారంగా జరగాలి. ఉద్యోగాల్లో, పెన్షనర్లలో అక్రమంగా చేరిపోయిన సీమాంధ్రవారిని పంపకుండా తెలంగాణ వచ్చి కూడా ప్రయోజనం లేదు. అక్రమంగా ఉద్యోగాల్లో చేరిన పెన్షనర్ల జీతాలను ఆంధ్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉద్యోగులను సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అయినా ఆంధ్ర ప్రాంతానికి పంపాలి. వారి భారాన్ని తెలంగాణపై రుద్దడాన్ని ఎలా అంగీకరిస్తాం?

3. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలి. ఉమ్మడి హైకోర్టును కొనసాగించడం కూడా తెలంగాణ వ్యతిరేక కుట్రలో భాగమే. తెలంగాణపై పెత్తనాన్ని కొనసాగించే ఆలోచనలో భాగంగానే ఉమ్మడి హైకోర్టును ప్రతిపాదించారు.

4. విద్యుత్ పంపిణీ, విడిగా కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా బిల్లులో స్పష్టత లేదు.

5. గోదావరిపై ప్రత్యేక బోర్డు అవసరం లేదు. కృష్జా జలాల వినియోగంలో ఇప్పటిదాకా తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దే ప్రతిపాదనలు కూడా బిల్లులో లేవు.

ఈ అభ్యంతరాలను సరిదిద్దాలని ప్రధానికి లేఖ రాశాం. జీవోఎంకు విన్నవించాం. బిల్లు పార్లమెంటుకు వెళ్లినప్పుడు కూడా మా అభ్యంతరాలు చెబుతాం. సరిదిద్దితే మంచిది. లేకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాం’ అని సీనియర్ టీఆరెస్ నాయకుడొకరు చెప్పారు. టీఆరెస్ నేతల వాదనను బట్టి విలీనం అంత సులభ సాధ్యం కాదు.

‘టీఆరెస్‌ను ఎలా విలీనం చేయమంటారు? పన్నెండేళ్లుగా టీఆరెస్ నాయకులు, తెలంగాణవాదులు సర్వశక్తులూ ఒడ్డి, అష్టకష్టాలు పడి, అరెస్టులపాలయి, దెబ్బలు తిని తెలంగాణవాదాన్ని బతికించారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణను ఏ త్యాగాలూ చేయని కాంగ్రెస్ వారికి అప్పగించి మేమేమి చేయాలి?’ అని మరో టీఆరెస్ నాయకుడు వాదించారు. ‘తెలంగాణకు కొత్త రాజకీయాలు అవసరం లేదా? మళ్లీ పాత ముతక రాజకీయాలే కావాలా? టీఆరెస్ ఉంటేనే కొత్త రాజకీయాలకు అవకాశం. టీఆరెస్ ఉంటేనే తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యం’ అని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అభిప్రాయపడ్డారు. టీఆరెస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే తమకు రాజకీయ మనుగడ ఉంటుందని టీడీపీ భావిస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకుని గండం గట్టెక్కవచ్చునని ఆ పార్టీ ఆశిస్తోంది. అందుకే కాంగ్రెస్ వారికంటే టీడీపీ నాయకులు టీఆరెస్ విలీనం గురించి ఎక్కువగా ఆరాటపడుతున్నారు. టీఆరెస్ విలీనం కాకపోతే పోటీ టీఆరెస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య ఉంటుంది.

టీడీపీ, వైసీపీ తెలంగాణలో సంబద్ధతను కోల్పోతాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యానికి అవశేషాలుగా ఉండే ఈ పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశం లేదు. టీఆరెస్ ఆ అంశాన్నే ఎన్నికల ఎజెండాగా మార్చుకుంటుంది. టీడీపీకి ఆధారంగా ఉన్న పునాది కులాలను టీఆరెస్ ఆకర్షించే అవకాశం ఉంది. పునర్విభజన తర్వాత వలసలు తీవ్రమై కొత్త రాజకీయాలు ఊపందుకుంటాయి. విభజన తర్వాత కూడా తెలంగాణలో కేసీఆరే కేంద్ర బిందువు అవుతారు. ‘తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడి ప్రజలకు గొప్ప మేలు జరుగుతుందని ఇంతకాలం చెబుతూ వచ్చాం. ఆ మేలేదో ఆచరణలో చూపించకపోతే జనం చీత్కరిస్తారు. అది కేసీఆర్ ఒక్కరే చేయగలరు’ అని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. విభజనానంతర రాజకీయ సవాళ్లను కేసీఆర్ ఎలా నిభాయిస్తారన్నది ముఖ్యం. కాంగ్రెస్ రాజకీయ వ్యూహానికి తలొగ్గుతారా, తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కొత్త ఎజెండాతో నిలబడతారా అన్నది చాలా కీలకం.