అప్పుడెన్నిరోజులు చర్చించారు?

వీళ్లది రాజకీయ తీవ్రవాదం

దేశంలో 1956 నుంచి ఇప్పటివరకు కొత్తగా 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగంలోని అధికరణం 3 ప్రకారం కేంద్రం ఇప్పటివరకు ఇరవై చట్టాలు చేసింది. నాడు 14 రాష్ట్రాలుంటే ఇప్పుడు 28 రాష్ట్రాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయితే 29వది అవుతుంది. రాష్ట్రాల విభజలో దేశానికి బోలెడంత అనుభవం ఉంది. అనేక వివాదాలు, వాటిపై కోర్టు తీర్పులు కూడా వచ్చాయి. అన్ని రాష్ట్రాల విభజన జరిగిన పద్ధతిలోనే తెలంగాణ విభజన జరుగుతోంది. ఏ రాష్ట్ర విభజనకోసమూ జరుగనన్ని ఉద్యమాలు, చర్చలు తెలంగాణకోసం జరిగాయి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించని పార్టీ లేదు. ప్రణబ్, రోశయ్య, శ్రీకృష్ణ, ఆంటోనీ… ఇలా రకరకాల కమిటీలు వేశారు. నివేదికలూ ఇప్పించారు. ఒక సమస్య పరిష్కారానికి ప్రజాస్వామ్యంలో అనుసరించాల్సిన పద్ధతులన్నీ అనుసరించారు. రాజ్యాంగ ప్రక్రియ కూడా కొత్తగా, అసహజంగా ఏమీ జరగడంలేదు. కేంద్రం అనుసరిస్తున్న విభజన ప్రక్రియ కూడా కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. అసెంబ్లీకి పంపడం, చర్చలు జరుపడం, అభ్యంతరాలు, అభిప్రాయాలు వ్యక్తీకరించి పంపడం కూడా ఎప్పుడూ జరిగేదే. ఎటొచ్చీ కొత్తగా అనిపిస్తున్నది సీమాంధ్ర నాయకత్వం విపరీత ప్రవర్తనే. దేశంలో ఎప్పుడూ ఏ నాయకులూ మాట్లాడని మాటలు వారు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ చెప్పని అభ్యంతరాలు, ఎవరికీ అర్థం కాని లా పాయింట్లు, ఏ ప్రజాస్వామిక పరీక్షకు నిలబడని వాదనలు వారు చెబుతున్నారు. రాజ్యాంగ నియమాల గురించి, చట్టాలు చేయడం గురించి ఆంటోనీ మొదలు రాష్ట్రపతి దాకా ఎవరికీ ఏమీ తెలియనట్టు, అంతా తమకే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. సీమాంధ్ర మీడియా సైతం తామే సిసలైన రాజ్యాంగ వ్యాఖ్యాతలైనట్టు అడ్డగోలు వాదనలు చేస్తున్నది. రాజ్యాంగంలోని 3వ అధికరణాన్ని రద్దు చేయాలని డిమాండు చేసిన నాయకత్వం ఈ దేశంలో ఇప్పటివరకు మరొకటి లేదేమో! ఇంకా అబద్ధాలు, అడ్డగోలు వాదనలు, బుకాయింపులు, దబాయింపులతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఉంచుతామని మాట్లాడుతున్నారు. ఇటువంటి అప్రజాస్వామిక, అనాగరిక, అనైతిక రాజకీయ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఇంతకాలం ఎలా మోశారా అనిపిస్తోంది.

సీమాంధ్ర నాయకులు దేశంకంటే, పార్లమెంటుకంటే, రాజ్యాంగం కంటే, ప్రజాస్వామ్యం కంటే, చివరికి అసెంబ్లీ కంటే కూడా పెద్దవాళ్లమనుకుంటున్నారు.ఒక రకంగా భారత గణతంత్ర వ్యవస్థను అవమానిస్తున్నారు కూడా. ఇంకాచెప్పాలంటే వీళ్లది రాజకీయ తీవ్రవాదం.

కేంద్రం రెండు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి చర్చించదా అని సీమాంధ్ర నాయకులు ప్రశ్నిస్తున్నారు. చర్చలకు పిలిచినప్పుడు వెళ్లరు. వెళ్లినా ఎడ్డెమంటే తెడ్డెమని నీల్గుతారు. ఇక్కడికొచ్చి కేంద్రంపై విరుచుకుపడతారు. తెచ్చిపెట్టుకున్న ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు శాసనసభలో కిరణ్, చంద్రబాబు, జగన్‌బాబు చర్చలు చేయవచ్చు కదా. రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధులను మాట్లాడించవచ్చు కదా. అభ్యంతరాలేమిటో, డిమాండ్లేమిటో రికార్డు చేయవచ్చు కదా. బిల్లు మాకు ఆమోదయోగ్యం కాదు అని రాసి పంపవచ్చు కూడా. ఇప్పుడు చర్చించరట. వాయిదాలమీద వాయిదాలు వేయిస్తారట. మళ్లీ జనవరిలో చర్చమొదలు పెడతారట. జనవరి 23దాకా చర్చను సాగదీసి, సమయం చాలలేదని ఇంకా సమయం కావాలని అడుగుతారట. రాష్ట్రపతి, రాజ్యాంగం, ప్రజలు ఎడ్డివాళ్లలాగా కనిపిస్తున్నారా? ఇచ్చిన 42రోజుల సమయాన్ని వినియోగించుకోకుండా కొత్తగా సమయం అడిగే నైతిక హక్కు ఎవడికయినా ఉంటుందా? ఇంకా ఎందుకీ నాటకాలు? ఎందుకీ నయవంచనలు? ఎవరిని మోసం చేయడానికి? సీమాంధ్ర నాయకులు దేశంకంటే, పార్లమెంటుకంటే, రాజ్యాంగం కంటే, ప్రజాస్వామ్యం కంటే, చివరికి అసెంబ్లీ కంటే కూడా పెద్దవాళ్లమనుకుంటున్నారు.ఒక రకంగా భారత గణతంత్ర వ్యవస్థను అవమానిస్తున్నారు కూడా. ఇంకాచెప్పాలంటే వీళ్లది రాజకీయ తీవ్రవాదం. తాము ఏమయినా చేయగలమన్న దుర్మార్గపు అతివిశ్వాసంతోనే అందరినీ వంచిస్తున్నారు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో ప్రజల బాధలగాధలకు మూలకారణం సీమాంధ్ర నాయకత్వమే. వారి అరాచక, అనైతిక ధోరణులే. 2009 డిసెంబరులోనే వచ్చిన తెలంగాణను అడ్డుకుని ఇక్కడ 1100 మంది పిల్లల ప్రాణాలను బలిగొన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రవిభజన తప్పదని తెలిసీ అక్కడి ప్రజలను, ఇక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారు. వేధిస్తున్నారు. రాచిరంపాన పెడుతున్నారు. ‘ఇటువంటి రాకాసి నాయకులను ఎప్పుడూ చూడలేదు. నేను బతికుండగా రాష్ట్ర విభజన జరగనివ్వను అని చెప్పిన లాలూప్రసాద్ యాదవే చివరికి విభజనకు ఒప్పుకున్నారు. వీళ్లెంత? బహుశా ఇటువంటి విపరీత మనుషులు ఉంటారని తెలిసే రాజ్యాంగంలో 3వ అధికరణాన్ని చేర్చి ఉంటారు. బలవంతుల చేతిలో బలహీనులు బలికాకుండా చూడాలని రాజ్యాంగ నిర్మాతలు ముందుచూపుతోనే ఈ ఏర్పాటు చేసి ఉంటారు’ అని చరిత్ర ఆచార్యుడొకరు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన బిల్లులపై చరిత్రలో ఏం జరిగిందో వీళ్లు ఎప్పుడయినా తెలుసుకున్నారా?

1. 1953లో ముసాయిదా ఆంధ్ర రాష్ట్ర బిల్లుపై మద్రాసు శాసనసభలో మూడు రోజులు మాత్రమే చర్చ జరిగింది. అన్ని పార్టీల నుంచి 53 మంది సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బిల్లుకు 20 సవరణలు ప్రతిపాదించారు. ఒక్కొక్క క్లాజు వారీగా పదిరోజులపాటు పరిశీలన, ఓటింగ్ జరిగింది. చాలావరకు వీగిపోయాయి. 1953 జూలై 14న సభలో బిల్లును ప్రతిపాదిస్తే జూలై 27న చర్చను పూర్తి చేసి కేంద్రానికి పంపారు.

2. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆంధ్ర శాసనసభలో చర్చ జరిగింది కేవలం 5 రోజులు(ఆంధ్రపత్రిక మొదటి పేజీ, 1956 ఏప్రిల్ 6). హైదరాబాద్ శాసనసభలో కూడా కేవలం ఆరు రోజులు మాత్రమే చర్చ జరిగింది. ఎనిమిది సవరణలు మాత్రమే వచ్చాయి(ఆంధ్రపత్రిక మొదటి పేజీ, 1956 ఏప్రిల్ 14). ‘ఈ సభ తన అభిప్రాయాన్ని మాత్రమే ప్రకటిస్తున్నది. తుది నిర్ణయాలు చేసే అధికారం పార్లమెంటుదే’ అని ఆరోజే శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రకటించారు.

3. బీహారు రాష్ట్ర విభజన బిల్లుపై సభలో ఒక్కరోజు మాత్రమే చర్చ జరిగింది.

4. బొంబాయి రాష్ట్ర పునర్విభజన బిల్లుపై మహారాష్ట్రలో పదిరోజులు మాత్రమే- 1960 మార్చి8 నుంచి మార్చి 18వరకు చర్చ జరిగింది. ఏరాష్ట్ర విభజన బిల్లునయినా తీసుకోండి. కానీ ఇంత తొండి, మొండి, అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ఏ నాయకత్వమూ ప్రదర్శించలేదు.

5. నిన్నగాక మొన్న లోక్‌పాల్ బిల్లుపై రాజ్యసభలో మూడు గంటలు చర్చించి ఆమోదిస్తే, లోక్‌సభలో నాలుగు గంటలపాటు చర్చించి ఆమోదించారు.

6. ఆహారభద్రత బిల్లుపై పార్లమెంటులో తొమ్మిది గంటలు మాత్రమే చర్చ జరిగింది.

7. అత్యంత వివాదాస్పదమైన అణు హామీల బిల్లుపై కూడా పార్లమెంటులో నికరంగా చర్చ జరిగింది 4 గంటలలోపే.

8. కోట్లాది మంది చిల్లర వ్యాపారుల జీవితాలను ప్రభావితం చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుపై పార్లమెంటు 2012 డిసెంబరు 4న చర్చను ప్రారంభించి డిసెంబరు ఐదున ఆమోదించింది. టీడీపీ సభ్యులు జ్వరాల వంకతో ఓటింగుకు కూడా హాజరు కాలేదు.

కానీ వారు ఇప్పుడేం చేస్తున్నారు? ఏమి చెబుతున్నారు?

సీమాంధ్ర నాయకులు గొంతెమ్మలను మించిపోయారు. ఎక్కడలేని కోరికలు, ఎక్కడలేని డిమాండ్లతో సమస్యను సాగదీయాలని చూస్తున్నారు. కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు సామరస్యంగా విడిపోవడానికి దోహదం చేయవు. నిజానికి వీరి చేష్టలన్నీ రాష్ట్ర విభజనను ఆపడంకోసం కాదు, సీమాంధ్ర ప్రజలను మోసం చేయడంకోసం జరుగుతున్నవే. అక్కడ రాజకీయాధిపత్యాన్ని సాధించే పోటీలో వాస్తవాలను బలిచేస్తున్నారు. జనాన్ని వంచిస్తున్నారు. నిజాలు చెప్పి జనాన్ని ఒప్పించడానికి ప్రయత్నించకుండా అబద్ధాలతో మాయలు చేసే కుట్రలకు పూనుకుంటున్నారు. నిజంగా చర్చజరగాల్సిన అంశాలపై చర్చించకుండాఅడ్డుపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలలో నెలకొన్న భయాలను నివృత్తిచేయడానికి ఏమి చెప్పాలో, ఏమి చేయాలో, ఎటువంటి సవరణలు ప్రతిపాదించాలో సూచించకుండా ప్రతిబంధక శక్తులుగా వ్యవహరిస్తున్నారు. చెప్పగా విననివాడు చెడగా చూడాలి అంటారు పెద్దలు. సీమాంధ్ర నాయకత్వం ప్రవర్తన వారికే చెరుపు చేస్తుంది. అక్కడి ప్రజలకు అన్యాయం చేస్తుంది. విభజనను ఒక భూతంగా, సీమాంధ్ర ప్రజల పాలిట భస్మాసురునిగా చిత్రీకరించి అక్కడి ప్రజలను సమీకరించాలని చూస్తున్నారు. చివరికి ఆ భూతమే వారిని బలిగొనడం తథ్యం. వాళ్లు ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ మాత్రం గెలిచి తీరుతుంది. న్యాయం, రాజ్యాంగ సూత్రాలు తెలంగాణ పక్షాన ఉన్నాయి. ఇంతదూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా తెలంగాణ ఆగిపోతే ఓటమి తెలంగాణ ప్రజలది కాదు, ప్రజాస్వామ్యానిది, పార్లమెంటుది.