రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోవద్దు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను చింపడం, కాల్చడం రెచ్చగొట్టడం కోసమే. రెచ్చగొట్టి, ఘర్షణ వాతావరణం సృష్టించి, ఉద్రిక్తతల నడుమ సభను నిర్వహించలేని పరిస్థితి తీసుకురావాలని సీమాంధ్ర పార్టీలు, నాయకుల కుట్ర. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సంయమనం పాటించాలి. సభలో వెంటనే చర్చ జరగడానికి అసవరమైన వాతావరణం పునరుద్ధరించడానికి కృషి చేయాలి. సీమాంధ్ర నాయకులు చేసే రెచ్చగొట్టే చర్యలు చూసి ఆవేశపడవద్దు.

చదువురాని చానెళ్లు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో చాలచోట్ల తప్పులు దొర్లాయని, తెలంగాణకు బదులుగా తమిళనాడు అని పడిందని కొన్ని చానెళ్లు పనిగట్టుకుని ప్రచారం చేశాయి. వారికి బిల్లు చదవడం కూడా రాలేదని అర్థమయింది. నాలుగవ షెడ్యూలులో రాష్ట్రాల పేర్ల జాబితాలో తమిళనాడు తర్వాత తెలంగాణ చేర్చాలని బిల్లులో ఉంది. మరో చోట లీగల్ అండ్ మిసీలీనియస్ ప్రొవిజన్స్‌లో కూడా తమిళనాడు బదులు, తమిళనాడు, తెలంగాణ అని చేర్చాలని మాత్రమే ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ‘త’ తర్వాత ‘తె’ వస్తుంది కాబట్టి బిల్లును అలా రూపొందించారు. రాజ్యాంగంలో ఆయా మార్పులు ఎక్కడ చేయాలో సూచించడంకోసమే తమిళనాడును ఉపయోగించారు తప్ప అది పొరపాటుగా కాదు. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా తప్పులు దొర్లాయని, ఆగమేఘాలమీద తయారు చేశారని వాగడం విడ్డూరం.

రాజకుమారిని ఎవరు త్రోసేశారు?

టీఆరెస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ టీడీపీ ఎమ్మెల్సీ రాజకుమారిని కింద పడదోశారని చానెళ్లు ఊదరగొడుతున్నాయి. ఆమె కూడా ఆరోపణలు చేస్తున్నది. కానీ వాస్తవానికి జరిగింది వేరు. పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి బిల్లు ప్రతిని చించుతుండగా స్వామిగౌడ్ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా తోపులాట జరిగింది. సతీష్‌రెడ్డి వెళ్లి రాజకుమారిని డీకొన్నారు. ఆమె కింద పడిపోయింది. ప్రజాప్రతినిధులపైనే దాడులు జరిగితే ఇక మాకు భద్రతేమున్నది అని ఆంధ్ర నాయకులు వాదిస్తున్నారు. రాష్ట్రపతి పంపిన బిల్లు ప్రతినే చింపేసిన వారు ఎటువంటి ప్రజాప్రతినిధులో అర్థం చేసుకోవాలి. వారికి రాజ్యాంగస్ఫూర్తి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఎంత ఉందో ఈ సంఘటనలతో తెలిసిపోతున్నది.