నాటి చర్చిల్, నేటి సీమ బాబులు

అబద్ధానికి గొంతుపెద్దది.
ఆధిపత్యవాదికి బుకాయింపులెక్కువ.
అన్యాయానికి నిలువెత్తురూపం, న్యాయం గురించి మాట్లాడుతున్నాడు.
అడ్డదారికి అసలైన నిర్వచనం, పద్ధతులను గురించి ప్రసంగిస్తున్నాడు.
వెన్నుపోటు సాధనం చేసుకున్నవాడు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా అని ప్రశ్నిస్తున్నాడు.
ఏమాటకూ నిలబడనివాడు, మాటల్లేకుండా ఎలా చేస్తారని నిలదీస్తున్నాడు.
ఏ ప్రతిపాదనలూ సూచించనివాడు, ఏమీ చెప్పకుండా ఎలా చేస్తారని వాపోతున్నాడు.
అంకెకు రాడు బొంకడం మానడు.
ఆధిపత్యశక్తుల స్వభావమే ఇలా ఉంటుందేమో!

భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం మౌంట్‌బాటెన్ ప్రణాళికను ప్రకటించినప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అచ్చం చంద్రబాబులాగే మాట్లాడాడు. ‘అంత తొందరెందుకు. ఇంత తక్కువ సమయంలో ఇది ఎలా సాధ్యం?’ అని ప్రశ్నించాడు. ‘ఇది తొందరపాటు చర్య’ అని కూడా బెదిరించాడు. ‘భారతీయులంటే నాకు ద్వేషం. వాళ్లు జంతు ప్రవృత్తి కలిగినవారు. అమానుషమైన మతం వారిది’ అని అంతకుముందే ఒక ఇంటర్వ్యూలో ప్రకటించి ఉన్నాడు. ‘వాళ్లకు అధికారం ఇస్తే రాస్కెల్స్, రోగ్స్, ఫ్రీబూటర్స్ చేతుల్లోకి వెళుతుంది….వాళ్లలో వాళ్లు తన్నుకు చస్తారు’ అని హెచ్చరించినవాడు. గురువారంనాడు చంద్రబాబునాయుడు పాత్రికేయుల సమావేశం చూసిన వారికి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఆయన అంతగా ఎందుకు ఆవేశపడుతున్నారో, ఎందుకు దుఃఖపడుతున్నారో తెలంగాణలో చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతుంది, ఒక్క టీటీడీపీ నాయకులకు తప్ప. ఇంత తక్కువ కాలంలో ఇన్ని మాటలు మార్చిన నేతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. ఆయన ‘శంభుని శిరంబు నుండి….పవనాంధోలోకం’ దిశగా జారిపోతున్నాడు. ఇప్పుడు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్‌రెడ్డిల అవసరం లేదు. ఆయనే వారి స్థానంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. జూలై 30న సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానం చేసినరోజు ‘విభజనకు సహకరిస్తానని, నాలుగైదు లక్షలకోట్లు రాజధానికి ఇవ్వాలని’ డిమాండు చేసిన చంద్రబాబు గత మూడు మాసాల్లో ఎన్ని వంకరలుపోయారో? ఆ తర్వాత అఖిలపక్షం కావాలన్నారు. తీరా ఢిల్లీకి పిలిస్తే వెళ్లడానికి నిరాకరించారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌కు మీమీ అభిప్రాయాలు పంపండి అంటే ఒక్క ముక్కా రాయలేదు. పార్లమెంటులో చర్చకు సహకరించరు. మళ్లీ ఇప్పుడు అఖిలపక్షం అంటాడు. అవిశ్వాసం అంటాడు. ఆర్టికల్ 3 బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టంలోనిది, చెల్లదంటాడు. ముసాయిదా బిల్లు విమానంలో ఎలా తెస్తారంటారు. ఆయన ఆగమాగమై మాట్లాడుతున్నాడు. అల్లకల్లోమవుతున్నాడు.

ఆయన ఇంత పరేషాన్ కావడానికి కారణం హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ఇంకా మమకారం చావలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌బాబు కూడా దాదాపు ఇలాగే వ్యవహరిస్తున్నాడు. ఇలాగే మాట్లాడుతున్నాడు. ఆవేశపడుతున్నాడు. ఇంకా తెలంగాణను ఆపగలమని, ఆపకపోయినా తెలంగాణలో చెంచాగుంపును రాజకీయంగా నిలబెట్టగలమని వీరు కలలుగంటున్నారు. అందుకే ఈ నరకయాతన. జగన్‌బాబు తెలంగాణపై ఆశలు వదిలేసుకుని సమైక్యాంధ్ర అన్నాడు కాబట్టి ఆయన ఆవేశపడడం లేదు. కూల్‌గా తనపని తాను చేసుకుపోతున్నాడు. అక్కసు, ఆక్రోశం ప్రదర్శించడం లేదు. ముఖంలో దుఃఖాన్ని, దుగ్ధను కనిపించనివ్వడం లేదు. కానీ చంద్రబాబు, కిరణ్‌బాబు బయటపడిపోతున్నారు. తెలంగాణ జారిపోతున్నదన్న బాధ, తెలంగాణ నేతలపై కోపం, అక్కసు అన్నీ బయటపడుతున్నాయి. ఆధిపత్య కోటలు కూలిపోతున్నవేళ ఇంతకాలం వాటిని అనుభవించిన వారిలో సహజంగా వ్యక్తమయ్యే విపరీత మానసిక ప్రవర్తన ఇది. అడుగు అడుగున తెలంగాణకు అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘తెలంగాణది కేవలం రాష్ట్రాల పునర్విభజన ఉద్యమం కాదు. డీ కాలనైజేషన్‌కోసంపాంత విముక్తికోసం) జరుగుతున్న ఉద్యమం. బ్రిటిష్‌వాళ్లు లండన్‌లో ఉండి మన దేశాన్ని కాలనీగా మార్చుకుని పాలించారు. వీళ్లు మన ఊళ్లో ఉండి, మన ప్రాంతాన్ని కాలనీగా మార్చి మనపై స్వారీ చేస్తున్నారు. వీళ్ల నుంచి స్వేచ్ఛకోసం ఆఖరు నిమిషం దాకా అడుగుఅడుగునా కొట్లాడాల్సిందే’ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇటీవల ఒక సభలో అన్నారు. వీళ్ల తీరు, మాట, చేష్టలు నూటికి నూరుపాళ్లు వలసపాలకులను తలదన్నేలా ఉన్నాయి.

నిజానికి చంద్రబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబులకు తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు చెప్పాలి. తెలంగాణపై వీరి దాష్టీకాన్ని, వీరి అప్రజాస్వామిక ప్రవర్తనను, వీరి దుర్మార్గపు రాజకీయాలను ఇప్పుడు ఢిల్లీ కూడా చూసింది. జాతీయ మీడియా కూడా గమనించింది. అవిశ్వాస తీర్మానాలు వీరి బాగోతాన్ని మరింత బట్టబయలు చేశాయి. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న క్షోభ ఇప్పుడు జాతికంతటికీ తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా గత మూడు మాసాలుగా చాలా చాలా చారిత్రక నిర్ణయాలు జరిగాయి. కేంద్రమంత్రివర్గం నిర్ణయం జరిగింది. బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి బిల్లును అసెంబ్లీకి పంపారు. అయినా తెలంగాణ ప్రజల్లో సంబరాలు లేవు. హర్షధ్వానాలు లేవు. ఎందుకంటే సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియా, ముఖ్యంగా చంద్రబాబుకు వంతపాడుతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెళ్లు ఎప్పటికప్పుడు తెలంగాణ రాదన్న భావనను కొనసాగిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. బిల్లు వస్తేనేం. ‘ప్రతి సభ్యుడు, ప్రతి పాయింటు మీద మాట్లాడి, అసెంబ్లీ అభిప్రాయం పంపాలి’ అని రాష్ట్రపతి కోరాడట. అందుకు 40రోజుల సమయం సరిపోదట. ఈలోపు పుణ్యకాలం ముగిసిపోతుందట. గురువారం రాత్రి ఇది ఒక చానెల్ రాక్షసానందం. భారత రాజ్యాంగ చరిత్రలో ఏ బిల్లు మీదా ప్రతి సభ్యుడూ మాట్లాడడం జరగలేదు. అణుబిల్లు, ఆహారభద్రత బిల్లు, విదేశీ పెట్టుబడుల బిల్లు…..ఆయా పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. ప్రతిపార్టీకి కొంత సమయం కేటాయిస్తారు. ఆ సమయాన్ని ఆయా పార్టీలు తమ నేతలకు కేటాయిస్తాయి. సాధారణంగా బిల్లులపై చర్చ జరిగే పద్ధతి ఇది.

కానీ ఉన్మాదం జర్నలిజం అయినచోట ఏ తర్కాలూ పనిచేయవు. ఏ సంప్రదాయాలూ గుర్తుకురావు. ఈ పత్రికలు, చానెళ్లు ప్రతి సందర్భంలో ఏదో ఒక మెలిక పెడుతూనే వచ్చాయి. ఇదిగో అడ్డం, అదిగో అడ్డం అని వాగుతూనే, రాస్తూనే వచ్చాయి. కానీ ఏదీ ఆగలేదు. రేపు అసెంబ్లీలో కూడా ఏదీ ఆగదు. ఆగితే కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమూ కాదు. మనది ప్రజాస్వామ్యమూ కాదు. తెలంగాణ ప్రజలకు మరోసారి పరీక్ష. మరోసారి నిరీక్షణ. రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇవ్వడం అసాధారణం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమానించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన బిల్లును ఈ పార్లమెంటు ఆఖరు ఘట్టానికి నెట్టడాన్ని సందేహించాల్సి వస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం కోసమే ఇదంతా చేస్తోందా లేక ఇచ్చినట్టు నమ్మించి మరేదైనా చేస్తోందా అన్న ఆందోళన కలుగుతోంది. ‘విమానంలో బిల్లు ప్రతులను పంపడం కేంద్రం కృతనిశ్చయాన్ని స్పష్టం చేయడానికే. దిగ్విజయ్ వచ్చిన రోజే బిల్లూ రావడం గమనించాలి’ అని ఒక రాజకీయ పండితుడు వ్యాఖ్యానించారు. అయినా కీడెంచి మేలెంచాలి. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఐక్యంగా నిలబడాలి. ఆఖరి అడుగుదాకా పోరాడాలి.