రాయల తెలంగాణ కాదు రెడ్ల తెలంగాణ?

కాంగ్రెస్ మెడకు రాయల ఉరి

రాయల తెలంగాణ దేనికోసం? ఎవరి ఆధిపత్యాన్ని కాపాడడంకోసం? ఎవరిని బుజ్జగించడంకోసం? ఈ ప్రశ్నలకు ఎటునుంచి సమాధానం వెదకినా రెడ్లకోసమనే సమాధానం వస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక వర్గం, రాయలసీమ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పథకం ప్రకారమే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

రాయల తెలంగాణ ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టింది కాదని చాలా కాలం ముందు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పుడు అర్థం అవుతున్నది. గ్రామ పంచాయతీలతో తీర్మానాలు చేయించడం, ఎమ్మెల్యేల సంతకాలు సేకరించడం, వీటిని కేంద్రానికి సమర్పించడం అంతా ఈ పథకంలో భాగమేనంటున్నారు. జగన్, చంద్రబాబు, కేసీఆర్‌లను కట్టడి చయాలంటే రాయల తెలంగాణ ఉత్తమమని దానిని సమర్థిస్తున్నవారు కేంద్రానికి నూరిపోశారట.

image

కానీ కాంగ్రెస్ తన మెడకు తానే ఉరి బిగించుకుంటున్నదన్న సంగతి గుర్తించలేదు. కేసీఆర్ రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అదనుగా ఆయన తెలంగాణలో మరింత బలపడడానికి, రాజకీయ శక్తులను సమీకరించుకోవడానికి ప్రయత్నిస్తారు. జేయేసీలు కూడా కేసీఆర్‌తోపాటే ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. బిజెపి లేక వామపక్షాలతో పొత్తుపెట్టుకోవడానికి కేసీఆర్‌కు మార్గం సుగమమవుతుంది.

సీమాంధ్ర పెత్తనం నామరూపాలు లేకుండా పోవాలంటే టీఆరెస్‌నే గెలిపించాలని ఆయన తెలంగాణ అంతటా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి అవకాశం చిక్కుతుంది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి కూడా దోషిగా నిలబడవలసి ఉంటుంది. రాయల తెలంగాణను సమర్థించుకోగల కారణాలు కానీ, సమర్థ నాయకత్వం గానీ కాంగ్రెస్‌లో లేదు.

మరోవైపు టీడీపీ, వైఎస్సార్‌సీపీలు మనుగడ కొనసాగించడానికి రాయల జిల్లాలు దోహదం చేస్తాయి. రాయల జిల్లాల్లో ఆ పార్టీల బలాన్ని ఆసరాగా చేసుకుని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ దాకా పోరాడవచ్చునని తెలంగాణ జిల్లాల్లోని వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు కూడా ఆశలు పెంచుకునే అవకాశం ఉంది. బహుముఖ పోటీలో 119 స్థానాలు ఉన్న తెలంగాణలో ఎవరికి మేలు జరుగుతుందో సులువుగానే ఊహించవచ్చు. అతి తెలివి కాంగ్రెస్‌కు, రెడ్లకు ఇద్దరికీ మేలు చేయదు.