రాయల తెలంగాణ అంటే తెలంగాణను నిరాకరించడమే

మళ్లీ మొదటికి తెచ్చే ప్రయత్నమే

రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తేవడం అంటే తెలంగాణ ప్రక్రియను మళ్లీ మొదటికి తెచ్చే ప్రయత్నమే. రాయల తెలంగాణకు రాజకీయ ఆమోదం లేదు. బిజెపి, టీఆరెస్, సిపిఐ అందుకు అంగీకరించడంలేదు. ఇతర జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి తప్ప రాయల తెలంగాణకు కాదు. ఏదో ఒక మిషతో తెలంగాణ ఏర్పాటును నిలిపివేసేందుకే కాంగ్రెస్ ఇప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చిందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. రాయల తెలంగాణకు బిజెపి మద్దతు ఇవ్వదుకాబట్టి, ఆ పార్టీపై నెపం మోపి ప్రక్రియను మధ్యలో ఆపివేయవచ్చని కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉండవచ్చునని వారు విమర్శిస్తున్నారు.

image

అసలే సమయం తక్కువగా ఉందని, పార్లమెంటు శీతాకాల సమావేశాలలోపు ఈ బిల్లును ఆమోదించకపోతే ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పట్లో జరిగే అవకాశాలు తగ్గిపోతాయని తెలంగాణవాదులు అంచనావేస్తున్నారు. ఆఖరి నిమిషంలో ఇటువంటి ప్రతిపాదనను ముందుకు నెట్టడం అంటే బిల్లును ఆలస్యం చేయడం లేక వాయిదా వేయడంకోసమేనని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేస్తున్నది. కొత్త సమస్యలు సృష్టిస్తున్నది.

371(డి) సవరణ అనివార్యం

Zone 4. Chittoor, Cuddapah, Anantapur and Kurnool. (CTR, CDP, ATP, KNL)

http://website.apspsc.gov.in/listoffaqs.appsc

రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే 371(డి)ని కూడా తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. 371(డి) ప్రకారం రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు. రాయలసీమ జిల్లాలన్నీ నాలుగవ జోను పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపితే జోన్ల పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంటుంది. అందుకు 371(డి)ని తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. బహుశా కొత్త రాష్ట్రానికి ఆటంకం సృష్టించడంకోసమే కాంగ్రెస్ కొత్తగా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్టు కనిపిస్తున్నది.

కాంగ్రెస్ రెంటచెడ్డ రేవడి

రాయల తెలంగాణ అంటే టీఆరెస్ కాంగ్రెస్‌లో విలీనం కావలసిన అగత్యం ఉండదు. టీఆరెస్ తెలంగాణ ఆత్మగౌరవ రాజకీయ శక్తిగా మరింత బలపడుతుంది. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి, తెలంగాణను సంఘటితం చేసి బలమైన రాజకీయ పక్షంగా అవతరించడానికి అవకాశం చిక్కుతుంది. రాయలతెలంగాణలో వైఎస్సార్‌సిపి, టీడీపీలు కూడా మిగులుతాయి. వైఎస్సార్‌సిపి అనంతపురం నుంచి హైదరాబాద్ దాకా బలపడడానికి ప్రయత్నిస్తుంది. టీడీపీ కూడా అనంతపురం నుంచి హైదరాబాద్ దాకా బలంగా ఉంది. రాయల తెలంగాణలో ఈ పార్టీలు ఎంతగా మిగిలితే టీఆరెస్‌కు అంత ప్రయోజనం. మధ్యలో ఆగమయిపోయేది కాంగ్రెస్ పార్టీయే. సంపూర్ణ తెలంగాణ ఏర్పడితేనే తెలంగాణలో కాంగ్రెఎస్‌కు నూకలు మిగులుతాయి.