రామోజీరావు కిరణ్‌ను ఎందుకు ముద్దు చేస్తున్నారు?

ఇటీవల ఈనాడు దినపత్రిక, సీమాంధ్ర ఛానెళ్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అమాంతంగా పైకి లేపుతున్నాయి. విపరీతంగా ముద్దు చేస్తున్నాయి. ఆయనలో ఒక వీరుడిని, ధీరుడిని చూస్తున్నాయి. ఆయన ప్రసంగాలను పతాక శీర్షికలకెక్కిస్తున్నాయి. ఆయన నివేదికలను పేజీలకు పేజీలు నింపుతున్నాయి. ఇదంతా కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా కిక్కెక్కిస్తున్నది. తనకు తెలియకుండా జగన్‌ను విడుదల చేయిస్తారా అని కారాలు మిరియాలు నూరుతున్న కిరణ్ విభజనపై కేంద్రంతో దాగుడుమూతలు ఆడుతున్నారు. సమైక్య ఛాంపియన్‌గా పేరు కొట్టేయాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే పత్రికలు, చానెళ్లు కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రేమిస్తున్నారని, ఆయన ముఖ్యమంత్రి కావడానికి బాటలు వేస్తున్నారని ఎవరయినా భ్రమపడితే తొక్కమీద కాలేసినట్టే. ఇదంతా ఒక వ్యూహం. శత్రువుకు శత్రువు మిత్రుడు కదా.

eenadu

వీరంతా జగన్‌మోహన్‌రెడ్డిని తమకు ఆగర్భ శత్రువుగా పరిగణిస్తున్న విషయం, సందుదొరికినప్పుడల్లా ఆయనపైకి ఏ రాయి దొరికితే ఆ రాయితో దాడులు చేస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. ఎన్ని రాళ్లు వేసినా అలవికాకుండా జగన్‌మోహన్‌రెడ్డి ఎదుగుతూనే ఉన్నాడు. ఆయన సమైక్య ఛాంపియన్‌గా ఎదిగి ఎక్కడ ఆంధ్రాను దున్నేస్తారోనన్న భయం వీరిని వేధిస్తున్నది. జగన్ ఎంచక్కా కోర్టు పర్మిషన్లు తీసుకుని దేశాటన చేస్తున్నారు. సమైక్య నినాదానికి మద్దతు కూడగట్టే పేరుతో దేశంలోని వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఇంకోపక్క రాష్ట్ర విభజన ప్రక్రియ నిరాఘాటంగా జరిగిపోతున్నది. విభజన ఆగదని కిరణ్‌కూ తెలుసు. జగన్‌కూ తెలుసు. పత్రికలకు, చానెళ్లకూ తెలుసు. చంద్రబాబుకు కూడా ముందే జ్ఞానోదయమై, తన రాష్ట్రంలో పర్యటనలు చేసుకుంటున్నారు.

అక్కడ హీరోగా ఎవరిని నిలబెట్టాలన్నదే మీడియా పెద్దమనుషుల గోల. వాళ్ల ఛాయిస్ చంద్రబాబునాయుడే. కానీ ఆయన తిరుమల ఏడుకొండల దారి ఎన్ని వంకరలు తిరిగిందో విభజన విషయంలో అన్ని వంకరలు తిరిగి, అటు ఛాంపియనూ కాలేదు, ఇటు ఉదారవాదీ కాలేదు. నా ఘర్‌కా, నా ఘాట్‌కా బన్‌గయా. ఆయనను ఇప్పుడు ఎత్తుకోవడానికి, ముద్దు చేయడానికి ఏమీ కనిపించడం లేదు. వారికి ఇప్పుడు కిరణ్‌లో ముద్దు చేసే లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి. కిరణ్‌ను మొనగాడిగా నిలబెడితే జగన్ బలపడకుండా ఉంటాడు. రెడ్డి సామాజిక వర్గం చీలిపోయి కొట్టుకుంటారు. ఓట్లు చీలిపోతాయి. సందులో చంద్రబాబును లేపొచ్చన్నది వారి వ్యూహం. కానీ అన్నీ అనుకున్నట్టే జరగవు. మీడియా కోరుకున్నట్టు ఎన్నికల ఫలితాలు ఉండడం లేదన్నది గత నాలుగైదు ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి.

నిజానికి ఈ పత్రికలు, ఛానెళ్లు సీమాంధ్ర బాగుకోసమయినా ఒక నిర్మాణాత్మక ఎజెండాను ముందుకు తేవాల్సింది. ఆ ఎజెండాను అమలు చేసే మొనగాడుగా చంద్రబాబునో మరొకరినో నిలబెట్టాల్సింది. ‘హైదరాబాద్‌ను మేమే ఉద్ధరించామ’ని ఇక్కడ అస్తమానం గొంతు చించుకోవడానికి బదులు, నవ్యాంధ్రనో, ఆధునికాంధ్రనో ఎలా నిర్మిస్తామో చూడండి అని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రజలపై కక్షగట్టినట్టు ఈనాడు, ఇతర మీడియా ఉన్నవీ లేనివీ కల్పించి రాస్తున్నాయి. ప్రశాంతంగా ముగుస్తుందనుకున్న విభజన ప్రక్రియను హింసతో ముగించే దిశగా పరిస్థితులను నెడుతున్నాయి.