బిజెపి నిలబడితే 371(డి) కూడా ఉఫ్!

రాష్ట్ర విభజనను ఆపడానికి కిరణ్‌బాబు, చంద్రబాబు, జగన్‌బాబులు చేయని ప్రయత్నం లేదు. వారు వేస్తున్న కేసులు, చేస్తున్న పనులు, చెబుతున్న మాటలు వింటుంటే వీళ్ల పీడ తెలంగాణకు ఎంత తొందరగా వదలిపోతుందా అన్నంత ఆతృత వ్యక్తమవుతున్నది. లక్షలు కోట్లు పోసి పేరు మోసిన లాయర్లను పెట్టి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారూ అంటే వీళ్లు తెలంగాణను ఎంత కొల్లగొట్టారో అనిపిస్తుంది. వీళ్లనా ఇంతకాలం మన నాయకులుగా మనం మోసింది అన్న ఖేదం మిగులుతుంది.

‘బాబు ఒక్కడే దీనిని ఆపగలడు’ అని బెజవాడ మిత్రుడొకరు అన్నారు. ‘తెలంగాణను ఆపే మొనగాడు జగన్ ఒక్కడే’ అని వాకింగ్ మిత్రుడొకరు చెప్పుకొచ్చారు. ‘పదవి పోయినా పర్వాలేదు. తెలంగాణను అడ్డుకుని తీరతాడు’ అని కిరణ్ గురించి ఒకాయన మాట్లాడాడు. వీళ్లంతా ఇప్పుడు తమ శక్తి సామర్థ్యాలను బిజెపిపై పెట్టారు. విలువల్లేవు. విధానాల్లేవు. తెలంగాణను అడ్డుకోవడం ఒక్కటే వారి అందరి ఆకాంక్ష. బిజెపి వీరి వలలో చిక్కకపోవచ్చని నమ్మకం. చిక్కితే ఆ పార్టీకి ఎవరూ పాడె కట్టాల్సిన పనిలేదు.

371(డి) ఎత్తేయకుండా తెలంగాణ బిల్లు రాదట. 371(డి) ఎత్తేయాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలట. సవరణ చేయాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలట. నిజానికి రాష్ట్ర ఏర్పాటుకు 371(డి) సవరణకు సంబంధం లేదు. దేని దారి దానిదే. కానీ ఒక వేళ వాళ్ల లెక్కలే ఒప్పుకున్నా బిజెపి మద్దతు ఇస్తే రాజ్యాంగ సవరణ జరుగదా? పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ రాదా? ఈ పది రోజులు చాలా భారంగా గడుస్తున్న ఫీలింగ్.