బెజవాడ ఎలా మోసపోయింది? : అప్పుడేం జరిగింది?-1

ఆంధ్ర అవతరణ చరిత్ర నోట్స్-1

బెజవాడపై ప్రకాశం ఎందుకు కత్తిగట్టారు?

ఆంధ్రపత్రిక 1953 జూలై 26 సంచిక బ్యానర్ పూర్తిపాఠం
*******************************************

రాజధాని విజయవాడేనని ఆంధ్రసభ్యుల నిర్ణయం

గోపాలకృష్ణయ్య గారి గుంటూరు- విజయవాడ ప్రతిపాదనకు అనుకూలంగా 62, ప్రతికూలంగా 5 వోట్లు

సవరణ ఓడించడంలో ఐదుగురు ఆంధ్రేతరుల తోడ్పాటుః కర్నూలు నిర్ణయంమారాలని సృష్టీకరణ

మద్రాసు, జులై 25: రాష్ట్ర అసెంబ్లీలోని ఆంధ్ర సభ్యులు నాలుగువోట్ల మెజారిటీతో ‘‘గుంటూరు- విజయవాడ లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు కావాలని’’ తీర్మానించారు. నేటి అసెంబ్లీ సమావేశంలో రాజధానికి సంబంధించిన సవరణలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

గుంటూరు- విజయవాడల మధ్య ఆంధ్రుల తాత్కాలిక రాజధాని ఉండాలని వావిలాల గోపాలకృష్ణయ్యగారు ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా ఆంధ్ర శాసన సభ్యులు 62 మంది, వ్యతిరేకంగా 5 మంది ఓటు చేశారు. వీరితో పాటు ఆంధ్రేతరులు ఇద్దరు కాంగ్రెసువారు, ఒక ముస్లింలీగు సభ్యుడు, ఒక్క సోషలిస్టు, ఒక కృషిక్ లోక్‌పార్టీ కూడా సవరణకు వ్యతిరేకంగా ఓటుచేశారు. అందువల్ల సవరణకు ప్రతికూలంగా 63 ఓట్లున్నూ అనుకూలంగా 62 న్నూ. తటస్థంగా 94 ఓట్లన్నూ వచ్చినవనీ, సవరణ ఒక్క ఓటుతో వీగిపోయినదనీ మద్రాసు అసెంబ్లీ స్పీకరు ప్రకటించారు.

మొత్తం 13 మంది ఆంధ్ర శాసనసభ్యులలో మంత్రి పట్టాభిరామరావు సహితంగా 17 గురు గైరుహాజరయ్యారు. కృషిక్‌లోక్‌పార్టీ నాయకులు లచ్చన్నగారు తటస్థంగా ఉన్నారు. కృషిక్‌లోక్‌పార్టీ నుంచి 9గురు సవరణకు అనుకూలంగాను 5గురు వ్యతిరేకంగాను ఓటువేశారు.

మొదట కర్నూలు బదులు తిరుపతి తాత్కాలిక రాజధాని కావాలన్న లచ్చన్నగారి సవరణకు అనుకూలంగా 1 ఓటువచ్చాయని, అది ఓడిపోయిందని స్పీకరు ప్రకటించారు. తర్వాత నాగిరెడ్డిగారు విజయవాడ సవరణను గూర్చి పట్టుబట్టడం లేదన్నారు. కూనిశెట్టి వెంకటనారాయణ దొరగారి ‘వాల్తేరు’ సవరణకు 16 ఓట్లు మాత్రమే వచ్చినాయనీ అది వీగిపోయిందనీ స్పీకరు ప్రకటించారు. తిరుపతికి కృషిక్ లోక్ వాళ్ళు మాత్రమే ఓటు చేశారు. వాల్తేరుకు కృషిక్ లోక్ పార్టీవారు కొందరు ఓటు చేయలేదు. అయిదుగురు కాంగ్రెసువారు ఓటుచేశారు.

ఆంధ్రేతరులు ఓటింగులో పాల్గొనడం సమంజసం కాదనీ, అందువల్ల వరిశిష్ట(మద్రాసు) రాష్ట్రసభ్యులు ఓటింగులో పాల్గొనరనీ ముఖ్యమంత్రి ప్రకటించారు. కమ్యునిస్టు కళ్యాణసుందరంగారు కూడా దాన్ని బలపరిచారు. ఓటింగు జరుగుతున్నప్పుడు అయిదుగురు ఆంధ్రేతరులు- కాంగ్రెస్, కృషిక్ లోక్, స్వతంత్ర, ప్రజాపార్టీ సభ్యులు ఓటు చేశారు. కమ్యూనిస్టులలో తమిళ సభ్యులు ఓట్లు తీసుకోవాలని కొంత యత్నం చేసినా అది ఆ పక్ష నాయకుని సూచనతో విరమించుకోబడింది. ఇదివరకు శాసనసభలో ఆంధ్రులు నెగ్గిన సవరణల్లో తమిళ కమ్యూనిస్టు సభ్యులు కూడా ఓటు చేశారు. ఇవాళమటుకు కమ్యూనిస్టులలో ఆంధ్రసభ్యులుమటుకే ఓటుచేశారు.

ap260753

ఇక 7వ షెడ్యూలుపై చర్చజరుగుతుందని స్పీకరు అన్నారు.

శ్రీప్రగడ కోటయ్య:
సవరణపై ఓటింగ్ జరిగిన తరువాత షెడ్యూలుపై చర్చ అవసరం లేదనుకుంటున్నాను.

శ్రీవి చిదానందంగారు: దీనిపై చర్చ అవసరంలేదు.

శ్రీనాగిరెడ్డి: షెడ్యూలులో ఆర్థిక విషయాలే గాక రాజధాని విషయంవుంది. ఆ విషయమై చర్చ జరగవలసివుంది. శ్రీ లచ్చన్న, కూనిషెట్టి వెంకటనారాయణ, వీరభధ్రం,వావిలాల గోపాలకృష్ణయ్యగారి సవరణలున్నాయి. షెడ్యూలులోని ఈ అంశంపై చర్చ జరుగుట అవసరం.

శ్రీటి వెంకటసుబ్బారెడ్డి(కాంగ్రేసు): నిన్న ఇవ్వాళ ఆమోదించిన తీర్మానములను బట్టి షెడ్యూలు లేదు, రాజధాని గురించి ప్రత్యేకంగా క్లాజులేదు. పేరా 13 (2)లో రాజధాని ఖర్చుకు సంబంధించినదికూడ ఆర్థిక సంబంధమైనదే.

శ్రీహనుమంతరావు (కమ్యూనిస్టు): 7వ షెడ్యూలు చాలా భాగం ఆర్థిక విషయమైనదే, అయితే రాజధాని విషయం భిన్న మైనది. రాజధానికి ప్రత్యేక వ్యవధి ఇస్తే మిగతా ఆర్థిక వ్యవహారాలు ముగించినట్లు ఎంచవచ్చు.

ముఖ్యమంత్రి: ఈ వ్యవహారం ముగిసిపోయింది. పార్లమెంటులో సహాయంగా ఉండటానికి మనం చర్చ చేస్తున్నాము. సాంకేతికమైన విషయాల గూర్చి పట్టుపట్టకూడదు. జనాభాననుసరించి ఆస్తి, అప్పుల విభజన జరగాలన్న సూత్రం బాగానే ఉంది. దానికి మినహాగా వేరే ఏమీ చెప్పదగింది లేదు. కమ్యూనిస్టు పక్షం తప్ప మిగతావారు భాషావారిగా ఓటుచేశారు. మళ్ళీ అదంతా పునశ్చరణ చేయడం తగదు. రాజధాని విషయంకూడా ఆర్థికమైనదే. అందువల్ల 7వ షెడ్యూలు లేదు. గనుక ఇది ఇందులో చర్చించరాదు. భిన్నంగా వేరే తీర్మానంగా చర్చించవచ్చు.

శ్రీలచ్చన్న (కృషిక్‌లోక్): ఇది ఆర్థిక విషయం కాదు. ఇది పూర్తిగా వేరే విషయం.

స్పీకరు: అయితే లచ్చన్నగారి సవరణను తీసుకుందాము.

శ్రీనాగిరెడ్డి: సవరణలు వేర్వేరు ఊర్ల పేర్లు తెలుపుతున్నాయి.

ముఖ్యమంత్రి: అన్ని కలిపి చదవడానికి వీలుగా సవరణ తిరిగి వ్రాయడంమంచిది.

శ్రీవిశ్వనాథం: రాజధాని విషయంలో కూడా ఆర్థిక వ్యవహారం ఉన్నది. షెడ్యూల్లో ఆపట్నం మాట వ్రాసి ఉండటం సరికాదు. వేరే ఉండవలసింది. భారత ప్రధాన మంత్రి ఒక కార్యక్రమాన్ని నిర్ణయించారు.

స్పీకరు: అది మనలను బంధించదు.

శ్రీవిశ్వనాథం: ఆంధ్ర బిల్లుకు పూర్వం ఆంధ్ర శాసన సభ్యులు చేసిన నిర్ణయం మనల్ని బంధిస్తుంది.

స్పీకరు: నైతికంగా బంధిస్తుందేమో గాని భౌతికంగా కాదు.

శ్రీవిశ్వనాథం: రాజకీయంగాను, నైతికంగాను, శాస్త్రీయంగాను బంధిస్తుంది. వేరే ప్రతిపాదనతో సభవారు ఆలోచించవచ్చు. ఒక నెల రోజులలోగా ఆంధ్ర శాసన సభ్యులే మళ్లీ ఆలోచించుకుని, ప్రశాంతంగా వ్యవహరించుకోవచ్చు. ‘కర్నూలు’ అని పేరు వ్రాసినంత మాత్రాన, ఇక్కడ దాన్ని తీసెయ్యాలనడం సబబు కాదు. దీని నిమిత్తం వేరే కార్యక్రమం నిర్ణయింపబడింది. మీరూ దాన్ని అనుసరించారు.

స్పీకరు: అది వీరిని ఎలా బంధిస్తుంది శాస్త్రీయంగా?

శ్రీవిశ్వనాథం: ఆంధ్ర బిల్లులో రాజధాన్ని చేర్చనవసరం లేదు. షెడ్యూలో ఆ ప్రస్తావన వచ్చినంత మాత్రాన ఇక్కడ చర్చించరాదు.

ముఖ్యమంత్రి: ఈ విషయానికి సంబంధించినంతవరకు మా ఇద్దరి అభిప్రాయం ఒక్కటిగానే ఉంది. రాజధాని విషయం షెడ్యూలు కిందకురాదు. న్యాయంగా ఆలోచిస్తే ఈ విషయం ఇక్కడ రాకూడనిదే. ఈ విషయంలో వరిశిష్ట రాష్ట్రం పాల్గొనకూడదు. శ్రీకళ్యాణ సుందరం కూడా ఈ విషయానికి సంబంధించినంతవరకు ఆంధ్రేతర కమ్యూనిస్టులు కూడా ముఖ్యమంత్రితో ఏకీభవిస్తున్నారన్నారు.

శ్రీప్రకాశం: ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. విశ్వనాథం గారు చెప్పినది మీరు ఓప్పుకోవాలి. మీరు ఆంధ్ర శాసన సభ్యుల సమావేశాన్ని ఏర్పరచారు.

స్పీకరు: అది ఆంధ్రశాసన సభ్యుల లాంఛన సమావేశం మాత్రమే.

శ్రీప్రకాశం: మీరు స్పీకరుగా, జాగ్రత్తగా, మెల్లగా కాన్‌స్టిట్యూషన్ లాలు పరిశీలించాలి. భారత ప్రధానమంత్రి ఉత్తర్వు క్రింద పొరపాటు – వారి సూచన క్రింద మీరు పూర్వం వ్యవహరించారు. ఈ సభలో ఈ రాజధాని ప్రస్తాపన రానవసరం లేదు. వెనక నిర్నయాన్ని తిరగదోడనవసరంలేదు

శ్రీహనుమంతరాంవు (కమ్యూనిస్టు): పూర్వ నిర్ణయం మన్ని శాశ్వతంగా బంధించజాలదు. ఇక్కడా, పార్లమెంటులోను కూడ దాన్ని సవరించుకోవచ్చు.

డా.కె.బి. మీనన్: పూర్వం చేసిన నిర్ణయం నైతికంగా బంధించినప్పుడు లా పూర్వకమైనదానికన్న, దాన్ని మన్నించవలసిన బాధ్యత మనపై హెచ్చుగా ఉంది.

స్పీకరు: అయితే లచ్చన్న గారి సవరణను ప్రతిపాదించవద్దని చెప్పండి.

డా.మీనన్: కర్నూలు విషయం పొరపాటున చేర్చారు. అందువల్ల ఆపేరు ప్రస్తావన పట్టుకొని దాన్ని మారుస్తామనడం సబబుకాదు.

శ్రీనాగిరెడ్డి: కర్నూలు తాత్కాలిక రాజధాని. అక్కడ రాజధాని పెట్టేముందు రోడ్లు, మున్నగుపనులు కొన్ని చేయవలసి ఉంది. అందువల్ల దాన్ని గూర్చి చర్చించవచ్చు. సరిహద్దు సంఘం విషయం బిల్లులో లేకపోయినా మనం కావాలన్నాము. అలాగే రాజధాని గూర్చి కూడా మనం అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. ఇది అధికారపూర్వకమైన సమావేశం. ‘లా’ పూర్వకంగా మమ్మల్ని పూర్వనిర్ణయం బంధించజాలదు.

శ్రీగౌతు లచ్చన్న: ఆంధ్రశాసన సభ్యులు ఒకసారి ప్రత్యేకంగా సమావేశం అయి నిర్ణయం చేసిన తరువాత అభిప్రాయమును మార్చుకొనుటలో తప్పేమిలేదు. తప్పు జరిగిందని విశ్వసించి దిద్దుకొనుటలో నైతికతప్పు ఏమిలేదు.

శ్రీటి.ఎన్: రాజధానిని ప్రత్యేకంగా ఆంధ్రులు సమావేశమై నిశ్చయించాలన్నారు. ఒకసారి నిర్ణయం జరిగింది. ఈ సభను ఆంధ్రశాసన సభ్యుల సమావేశంగా మార్చకూడదు.

ఇది రూలింగ్ కాకపోయినా లచ్చన్న గారి సవరణపై చర్చ జరిగవచ్చని అనుకుంటున్నామని స్పీకరు అన్నారు. శ్రీగౌతు లచ్చన్న గారు అంతట తమ పేరనున్న సవరణను ప్రతిపాదించారు శ్రీకిల్లి అప్పులనాయుడుగారు బలపర్చారు. మిగిలిన సవరణలన్నీ లచ్చన్న గారి సవరణకు సవరణగా ప్రతిపాదించబడతాయి. ముందు ‘విజయవాడ’ అని వున్న సవరణపై ఓటు తీసుకొని తరువాత లచ్చన్న సవరణపై ఓటింగ్ జరుగుతుంది.

శ్రీగౌతు లచ్చన్న సవరణ పారం

పేరా 13 (3)లో ‘కర్నూలు’ అనే మాటకు బదులు ఈ క్రింది మాటలను చేర్చాలని ఈ అసెంబ్లీ వారు శిఫార్సు చేస్తున్నారు:
‘తిరుపతిని గాని, లేక రాజధానికి తగిన సౌకర్యాలు కల్గి ఉత్తర సర్కారులతో రాకపోకల సౌకర్యము కలిగిన చిత్తూరు జిల్లాలోని మరొకచోటుగాని’.

శ్రీనాగిరెడ్డి: లచ్చన్న గారి సవరణకు, మా సవరణను ప్రతిపాదించమంటారా?

స్పీకరు: ఏణర్థంగా గౌరవసభ్యులు ఇక్కడ ఉన్నారు. కార్యక్రమం తెలియలేదా?

శ్రీహనుమంతరావు: సవరణకు సవరణగా కాకుండా మా సవరణ వేరే ప్రతిపాదినస్తాము .

స్పీకరు: నాగిరెడ్డిగారు లచ్చన్నగారి సవరణకు సవరణగా ‘విజయవాడను’ ప్రతిపాదిస్తారా లేదా?

శ్రీనాగిరెడ్డి: నేను విజయవాడను ప్రతిపాదిస్తున్నాను.

శ్రీప్రకాశం: ఏదో రాజధాని ప్రస్తావన షెడ్యూల్లో వచ్చిందాన్ని తీసుకుని ఇలా మార్పుచేయడం సబబు కాదు. ఈ పద్దతి బాగుండలేదని నేను చెబుతున్నాను.

శ్రీగోపాలకృష్ణయ్య:
‘విజయవాడ-గుంటూరు’ మధ్య అన్న సవరణను ప్రతిపాదిస్తున్నాను.

శ్రీకూనిశెట్టి వెంకటనారాయణదొర: నేను విశాఖపట్టణం సవరణను ప్రతిపాదిస్తున్నాను.

శ్రీగౌతు లచ్చన్న(కృషిక్‌లోక్): కృషిక్‌లోక్ పార్టీవారు శ్రీబాగ్ ఒడంబడికననుసరించి రాయలసీమ సర్కారుల మధ్య సామరస్యం పెంపొందాలనే ఉద్యేశంతోనే రాయలసీమలో రాజధాని ఉండాలని కోరుతున్నారు. మేము కాంగ్రేసులో ఉన్నప్పటినుంచీ కూడా ఈ మాట స్పష్టంగా చెబుతున్నాము.

ఇచ్చట శివషణ్ముగం గారి స్థానే శ్రీమతి కోటమ్మ రెడ్డి అధ్యక్షస్థాన్నాన్ని హర్షధ్వారాల మధ్య అలంకరించారు .

శ్రీలచ్చన్న: ఉత్తర సర్కారులకు దగ్గరగా ఉంటే బాగుంటుందని 3 ఏండ్ల క్రితమే మేము అనుకున్నాము. న్యాయమూర్తి వాంఛూగారు విజయవాడ-గుంటూరు రాజధాని కాక పోతే తిరుపతి ఉత్తమమైందని సూచించారు. రాయలసీమ సర్కారు ప్రజలు శ్రీబాగ్ ఒడింబడిక అనే పెద్దమనిషి ఒప్పందాన్ని చేసుకుని ఉన్నారు. దాన్ని గౌరవించడం సర్కారు జిల్లాలవారిపై ఉంది. కర్నూలు మారుమూలపట్టణం. అది అందరికీ అనుకూల మైంది కాదు. మనరాష్ట్రం బాగులపడాలంటే ఉభియప్రాంతాల మధ్య సౌమనస్యాన్ని ఏర్పరచి, సమన్యాయాన్ని కల్గించడం అవసరం. అందుకు తిరుపతి రాజధానిగా చేస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాము. ఇదివరకు కర్నూలు అని అనుకున్నంత మాత్రాన అది మార్చకూడదని ఎక్కడ లేదు. సర్కారు ప్రజలకు ఆ నిర్ణయం కష్టం కల్గించింది కనుక దానిని మార్పించడం అవసరం. అది గమనించే మేము ఈ తిరుపతి సవరణను ప్రతిపాదిస్తున్నాము.

శ్రీమాదాల నారాయణస్వామిగారు(కమ్యూనిస్టు): విజయవాడ సవరణను బలపరుస్తూ ఇలా అన్నారు: కర్నూలు నిర్ణయంపై లోగడ చాల దీర్ఘంగా చర్చ జరిగింది. దీనిమీద చాల వాదోపవాదములు పెరిగాయి. కర్నూలు నిర్ణయం వల్ల రాయలసీమ, సర్కారువారికి తేడాలు, ఉద్రేకాలు వచ్చాయనీ అంటూ తిరుపతిని చేయలన్నారు. రాయలసీమ, సర్కార్ల మధ్య తేడాలకు కారణం శ్రీ సంజీవరెడ్డిగారు, వారి పార్టీవారు అని నాఉద్దేశం. తిరుపతి అందరికీ అందుబాటులో అంటుంటే నాకు నవ్వువచ్చింది. ఇటీవల వారు కర్నూలు కావాలన్నారు ఇప్పుడు మార్చుకున్నారు. వారిపార్టీకి చెందినవారిలో ఒకరు విశాఖపట్నం కావాలని సవరణ ఇచ్చారు. దీనినిబట్టి శ్రీబాగ్ ఒడంబడికకు వారిచ్చే విలువ అర్థమౌతూనే ఉంది. విజయవాడ అందరికీ కేంద్రముగ వీలుగవుంటుంది. కమ్యూనిస్టు విజయవాడ సవరణ తెచ్చారణి వెనుదీయగూడదు. విజయవాడ సవరణను నెగ్గించాలని గోరుతున్నాను.

శ్రీజి.నాగభూషణం(కాంగ్రేసు): 1937లో ఆంధ్ర దేశంలోని వివిధ ప్రాంతాలమధ్య సామరస్యాన్ని సాధించడానికి శ్రీబాగ్ ఒడింబడికను చేసుకున్నాము. తర్వాత దాని ప్రకారం కర్నూలు అనే రాజధాని ఐక్యమత్యం కోసం చేశాము. ప్రకాశం, విశ్వనాథంగారు చెప్పినటుల దాన్ని మార్చడం సబబుకాదు. ఏమైనాసరే కర్నూలు నిర్ణయం మారరాదు. అదిమారిస్తే సామాన్య ప్రజలు మనలచూసి నవ్వుతారు. భావి ప్రభుత్వం యెడల ప్రజలకు విశ్వాసం పోతుంది. కమ్యూనిస్టులు విజయవాడ అన్నారని మేము వద్దనడం లేదు. కర్నూలు కోస్తా జిల్లాలకు సన్నిహితమైన పట్టణం. చక్కని నీటివసతిగల పట్టణం. రాయలసీమలో ఉన్న పట్టణాల్లో మంచి సౌకర్యాలు ఉన్నది. కర్నూలు నిర్ణయాన్ని మార్చరాదని మరిమరీ నేను చెబుతున్నాను.

శ్రీటి.లక్షినారాయణరెడ్డి(స్వ): మనం తాత్కాలికమైన రాజధాన్ని గూర్చి యోచిస్తున్నాము. తాత్కాలిక రాజధాని విజయవాడలో ఉంటే అందరికీ అందుబాటులో ఉండగలదు. ఒక కమ్యూనిస్టులే విజయవాడ రాజధానిగా మంచిదని అనడం లేదు, ప్రజానీకం యావత్తూ విజయవాడే రాజధానిగా కోరుతుంది. సంజీవరెడ్డి ప్రభృతులు రాజధాని గూర్చి చేసిన నిర్ణయం దూరదృష్టితో చేసినది కాదు. దాన్ని ప్రజలు హర్షించడంలేదు. సక్రమంగా దాన్ని మారిస్తే నెహ్రూ కూడా ఒప్పకుంటాడు. దానికి సందేహం లేదు. రాయలసీమ అంతా రాజధాని కోసం పరితపిస్తోందనడం నిజంకాదు. కర్నూలు రాయలసీమకు గాని సర్కారులకు కాని తృప్తికరమైన రాజధాని కాజాలదు. విజయవాడలో రాజధాని అనంతపురంలో హైకోర్టులో పెడితే రాయలసీమ ప్రపజలకు, ఆంధ్ర ప్రజలకు తృప్తి కలుగుతుంది.

శ్రీఎం.బాపయ్య చౌదరి(స్వ): ఈ తాత్కాలిక రాజధాని గూర్చి 5 రోజులు పూర్వం చర్చజరిగింది. కర్నూలు పేరు రాజధానిగా బయటకు వచ్చింది. రాజధానిగా కర్నూలు ఉండాలని పూర్వం వాదించిన లచ్చన్న గారు తమ తప్పులను గ్రహించారు. ప్రజాభిప్రాయాన్ని గమనించారు. పూర్వం చేసిన నిర్ణయం తప్పని గ్రహించారు. కాని పూర్తిగా వారు ప్రజాభిప్రాయాన్ని గుర్తెరుగ కున్నారు. కృషికోర్ పార్టిలోని వారే ఒకరు తిరుపతిని, ఒకరు వాల్తేరును సూచిస్తున్నారు. కర్నూలు నిర్ణయం ప్రజలకు శ్రేయస్కరంకాదని పత్రికలు దిక్కులు సిక్కటిల్లెటట్లు ఘోషించివేయ, ప్రజలు కర్నూలు నిర్ణయం తప్పు నిర్ణయమని ఘోషిల్లారు. ఇందులో పార్టీ శిక్షణకాని, ప్రతిష్ట కాని లేదు. అందువల్ల కాంగ్రేసుపక్షం ఈ విషయంలో తమ నిర్ణయాన్ని పునర్విమర్శ చేసుకోవాలి. ప్రభుత్వ పరిపాలనా సామర్థాన్ని గురించి అయినా ఏ వసతి సౌకర్యాలు లేని కర్నూలును రాజధానిగా ఉంచడం సమంజసం కాదు. కర్నూలులో ఎంతవరకు వసతులు ఉన్నాయో పరిశీలించి ప్రభుత్వోద్యోగి లోబో ప్రభువు తమనివేదికలో వాస్తవ విషయాలను చెప్పారు. అక్కడ ఉన్న భవనాలన్నీ పాతపురాణాలు. విజయవాడ-గుంటూరులలో అయితే తగు భవనాలు ఉన్నాయి. ఉద్యోగులకు తగు భవనాలు వసతి సౌకర్యాలు లభించగలవు. విజయవాడ తృప్తికరమైని రాజధాని కాగలదు.

శ్రీకూనిశెట్టి వెంకట నారాయణదొర(కృషిక్‌లోక్): ఆంధ్రదేశంలో రాజధాని సందర్భంలో పుట్టిన సంచలనాన్ని పర్వతాకారంలో ఏమన్నా అడ్డగలదనే దృష్టితోనే వాల్తేరు సవరణకు నేను సూచించాను. శ్రీబాగ్ ఒడంబడికను సమర్థించి కర్నూలు నిర్ణయం చేసినది శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రతినుధులే. అయితే ఈ నిర్ణయానికి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నదని గ్రహించాము. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సహాయ కార్యదర్శి ఈ అభిప్రాయాన్నే టెక్కలిలో ప్రకటించాడు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే వాల్తేరులో తాత్కాలిక రాజధాని పెట్టడం ఉత్తమం. నిజంగా ఆంధ్రరాష్ట్రం ఆదిలో చక్కగా పనిచెయ్యాలంటే వాల్తేరు చక్కని తాత్కాలిక రాజధాని. ప్రభుత్వ కార్యలయాలకు తగిన భవనాలు ఉన్నాయి, సిబ్బంది వసతి సౌకర్యాలు ఉన్నాయి. శీతోష్ణస్థితి బాగా ఉంటుంది. వర్తక వ్యాపార సౌకర్యాలు ఉన్నాయి. ఏ విధంగా చూసినా శాసన సభ్యులు వాల్తేరునే నిర్ణయంచాలి.

శ్రీనీరుకొండ రామారావుగారు: రాజధాని సమస్య పార్టీవిషయం కాకూడదు. కర్నూలు నిర్ణయం జరిగినప్పుడు నేను పార్టీలో వ్యతిరేకించివున్నాను. ఆంధ్ర శాసనసభ్యులు రాజధానిని నిర్ణయించివున్నారు. కేంద్రప్రభుత్వం తాత్కాలిక రాజధానిని నిర్ణయించమన్నారు. ‘తాత్కాలికం’ అన్నమాటను అర్థం చేసుకోకుండా కర్నూలు నిర్ణయం జరిగింది. తాత్కాలిక రాజధానికి తగిన పట్టణములు ఆంధ్రలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో వున్నాయి. కాని శ్రీబాగ్ ఒడంబడిక ఒకటి ఉంది. శ్రీకళావెంటకటరావు గారు కర్నూలు నిర్ణయమునకు ముందు శ్రీబాగ్ ఒడంబడిక శాశ్వత రాజధానికి మాత్రం వర్తిస్తుందన్నారు. శ్రీబాగ్ ఒడంబడికపై సంతకము చేసిన వారిలో ఇద్దరు రాయలసీమలో రాజధాని ఉండనవసరంలేదని అన్నారు. హైకోర్టును శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం నిర్ణయించాలనే సవరణ ఓడించబడింది. శ్రీబాగ్ ఒడంబడికను మన్నించవలసిన అవసరం లేదు. సంజీవ రెడ్డి గారు కూడ రాజధాని కేంద్రప్రదేశంలో ఉండాలని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడికను మన్నించాలనే ప్రజాసోషలిస్టులు దానికి వ్యతిరేకముగ ఓటు చేశారన్నారు.

తెన్నేటి విశ్వనాథంపజాసోషలిస్టు): ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కావాలో, హైకోరుకావాలో నిశ్చయించుకోవాలని శ్రీబాగ్ ఒడంబడిక అధికారం ఇస్తోంది. ఆంధ్ర శాసన సభ్యులు అధికారికంగా మీరు కాదన్నా సమావేశమైనపుడు రాజధాని కావాలని నిశ్చయించుకున్నారు. స్థలాన్ని కూడా నిశ్చయించాము. అందువల్ల ప్రజాసోషలిస్టు పక్షం హైకోర్టు సవరణకు వ్యతిరేకంగా చేసింది. కొద్ది రోజుల క్రితమే కర్నూలు అని నిర్ణయం చేశాము. అయితే మనం చేసిన నిర్ణయం ఒక్కొక్కప్పుడు అందరికీ తృప్తికరంగాక పోవచ్చు. ఇట్టి విషయాల్లో ఒక స్పష్టతనేది ఉండాలి. కొంత కాలం వరకైనా నిశ్చయమనేది ఉండాలి. రాజధాని పేరు బిల్లులో చేరుస్తారని మేము నిర్ణయం చేశాము. మళ్ళీ ఈ విషయంలో ఇంతలో మార్చాలనే ఆలోచన వస్తుందని మేము అనుకోలేదు. ఈ నిర్ణయం ఇంతలో నే మారెట్టయితే అంత మొత్తం రైలు బత్తాలపై వృధాచేయడం సరికాదు. సమావేశాన్ని మీరు ఏర్పాటు చేయమన్నారు. ఆంధ్ర సభ్యులు కర్నూలు అని తాత్కాలిక రాజధానిగా నిర్ణయించారు. దాన్ని మధ్రాసు ప్రభుత్వం వారు కేద్రానికి పంపించారు. కేంద్రం దాన్ని బిల్లు షెడ్యూల్లో ఉదహరించారు.

స్పీకరు: ప్రభుత్వాన్ని మార్పునకు ఏవిధంగా బద్దం చేస్తారు?

శ్రీవిశ్వనాథం:
ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ముఖ్యమంత్రి ఇప్పుడు తటస్థంగా ఉంటామన్నారు. నేను అందుకు వారిని నిందించను. అవసరము ఉంటే మార్చవచ్చు. ఆంధ్ర శాసనసభ సమావేశమైనప్పుడు అవసరమైతే రాజధాని మార్చుకోవచ్చు. వారానికోసారి మనం మార్చవచ్చుననుకుంటే ఈ విధంగా నిర్ణయించే వాళ్ళమా? మనం కల్లోల సముద్రంలో తరంగాల వలె దొర్లి పోతుంటే ఎక్కడికపోతాము? నిన్నగాక మొన్న నిర్ణయంచేసి ఇవాళ మార్చాలనడం నాకిష్టంలేదు. నెల తిరగక ముందే మార్చాలని అంటున్న వారు ఇప్పుడు చెప్పేది రేపే మార్చగలరని హెచ్చరిస్తున్నాను .

శ్రీనాగిరెడ్డి: ఇందులో ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు. నాభావాలు అందరికీ తెలిసే ఉన్నవి. కర్నూలు గురించి ప్రభుత్వ ఉద్యోగుల నివేదిక కూడ వచ్చింది. కర్నూలు రాజధానిగ తగదని తేలింది. తప్పుదిద్దుకోనుటకు అవకాశం వచ్చింది. ప్రస్తుతపు చిక్కులు భావి పురోభివృద్దిని గమనించి నిర్ణయించాలని కోరుతున్నాను. విజయవాడను రాజధానిగా నిర్ణయించి భావితరముల అభివృద్ధికి తోడ్పవలసిందని సభ్యులకు విజ్ఙప్తి చేస్తున్నాను.

శ్రీప్రకాశం పంతులు: 25 సంవత్సరములకు పైగా రాయలసీమ సోదరులు ఆంధ్ర రాష్ట్రమునకు వ్యతిరేకముగా వుంటూ వచ్చారు. శ్రీబాగ్ ఒడంబడిక ఏర్పడింది. నేను ఎల్లకాలం ఒక చాపమునకు కట్టుబడి వుండాలనే వాడిని కాదు. రాయలసీమవారు రాష్ట్రమునకు అడ్డం తగిలారు. వేరే రాష్ట్రముగ వుంటామన్నారు కూడా. కర్నూలు గురించి నాకు తెలుసును. రాజధానిని ఎంచుకొననే అధికారం రాయలసీమ వారికి ఇవ్వబడింది. మనరాష్ట్రము మంచి పునాదులమీద ఏర్పడవలసి ఉంది. రాయలసీమ లేకుండ ఆంధ్రరాష్ట్రం ఏర్పడేదికాదు. ఇవ్వాళ తిరుపతి అని అంటున్నారు. ఇదేనా మనము ప్రవర్తించవలసిన విధానము. అసత్యం పునాదిగ ఏర్పడే రాష్ట్రము నిలవదు. నూతన రాష్ట్రమును నిర్మించవలసిన విధానము ఇదికాదు. విజయవాడలో ఏముంది? కమ్యూనిస్టు కేంద్రం తప్పకుండా రాజధాని అవుతుందని స్థలములు కొన్న వారు ఈ ఆందోళన చేస్తున్నారు. విజయవాడ -గుంటూరులు నా స్వస్థలము. గుంటూరు నేను పుట్టినజిల్లా. విజయవాడ-గుంటూరులకు వారు తెలిపిన విషయాలను బట్టి సర్టిఫికేటును ఇవ్వలేను. మనలో మనకైనా నిజాయితీ వుండాలి. మెజారిటి అభిప్రాయమును మన్నించటం ప్రపంచ ధర్మం. తమలో అనేక గ్రూపులున్నాయి. కాని అంతా కలిసి పని చేయాలనుకున్నాం. మనం క్రమం లేకుండా వ్యవహరిస్తున్నాం. తాత్కాలిక రాజధాని విషయంలో ఏకాభిప్రాయానికి రాలేని ఎడల ప్రపంచం నవ్వుతుంది. అదీగాక అగౌరం అనికూడ చెపుతున్నాను. విజయవాడ కేంద్రం అని అంటున్నారు. నిజంగా కేంద్రమే దోపిడీలకు, హత్యలకు కేంద్రం.

వినాయగం: ఆపని ఎవరిది?

శ్రీప్రకాశం: యూనిఫారములో వచ్చి ఆపని చేశారు. జరిగిన విషయాలు చెపుతున్నాను. ఆంధ్రప్రజల చరిత్రను తెలిసినవారు ఇప్పుడు ఈ ప్రతిపాదన చేయకూడదు. విడిపోదలచుకున్నాం పనిజరుపుకుంటున్నాం. తాత్కాలిక రాజధాని కర్నూలులో వుంటే నేమి విశాఖపట్నంలో అయితేనేమి. విశాఖపల్నంలో సౌకర్యాలు ఉన్నాయి. విశాఖపట్నం వెళ్ళాం విశ్వవిద్యాలయం పెట్టాం చిక్కులు అనుభవించాము. ఈ సారి మరొక కొసకు పోదలచుకున్నాం. తేడాలను మరచిపోయి కర్నూలు నిర్ణయము తిరగతోడుటకు ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నా విగ్రహం పగలగొట్టారని రాజధాని చర్చలో చెప్పారు. భయపడతా అనుకున్నారు. అనేక విగ్రహాలను పగలగొట్టడం చూశాను.

స్పీకరు: ముందు లచ్చన్న గారి సవరణ ఓటుకు పెడతాను. అదినెగితే మిగతా సవరణలు ఓటుకు పెట్టను. ఇప్పుడు నాలుగు సవరణలు ఓటుకు పెడ్తాను. ముందు లచ్చన్నది, తర్వాత నాగిరెడ్డి, తర్వాత కూని శెట్టి వెంకట నారాయణదొర, తర్వాత వావిలాల గోపాలకృష్ణయ్య గారల సవరణలను ఓటుకు పెడ్తాను.

శ్రీగౌతు లచ్చన్న: సవరణను ఓటుకు పెట్టేముందు ఒక్కవిషయం చెప్పదలచుకున్నాను .

శ్రీవినాయగం:
ఉపసంహరించుకుంటున్నా రనుకుంటాను.

శ్రీలచ్చన్న: అది వారి అభిప్రాయం.

తర్వాత లచ్చన్న గారి సవరణను అధ్యక్షులు ఓటుకు పెట్టి వీగిపోయిందన్నారు. తిరుపతికి 1 ఓట్లు వచ్చాయనీ, మిగతావారు ఎక్కవ మంది ఉన్నారనీ అధ్యక్షులు ప్రకటించారు. వెంకటనారాయణ దొరగారి వాల్తేరు సవరణకు అనుకూలంగా 15 మంది ఓటు చేశారనీ, వ్యతిరేకులు చాలామంది ఉన్నారనీ, వాల్తేరు సవరణ ఓడిపోయిందనీ ప్రకటించారు.

శ్రీనాగిరెడ్డిగారు తమ సవరణను గూర్చి పట్టుబట్టలేదు. తర్వాత వావిలాల గోపాలకృష్ణయ్యగారి సవరణను స్పీకరు ఓటుకు పెట్టారు. సవరణ ఇలా ఉంది ‘ఏడవ షెడ్యూలులోని 12(2) పేరాలోని ‘కర్నూలు పట్టణ’మనే మాటల బదులు ‘గుంటూరు నుంచి విజయవాడ’ వరకు అనే మాటను చేర్చాలి. సవరణ ఓటుకు పెట్టి ఓడిపోయిందని స్పీకరు ప్రకటించారు. గోపాలకృష్ణయ్యగారు విభాగం కోరగా స్పీకరు ఓట్లు తీసుకున్నారు.

ఓటింగు వివరాలు

స్పీకరు ఓట్లు భాగం తీసుకొని ఇలా ప్రకటించారు: గుంటూరు- విజయవాడ మధ్య తాత్కాలిక రాజధాని అనే గోపాలకృష్టయ్యగారి సవరణకు అనుకూలంగా 62 మంది ప్రతికూలంగా, 63 మంది, తటస్టంగా 94 మంది వోటుచేశారనీ, సవరణ వీగి పోయిందని ప్రకటించారు.

ఒక కమ్యూనిస్టు సభ్యుడు: ఆంధ్రేతరుల ఓటు ఇందులో లెఖ్కకు వస్తుందా?

స్పీకరు: లెఖ్కలోకి తప్పకుండా వస్తుంది. ఆంధ్రేతిరులను నేను ఓటు చెయ్యడం మానమని నిర్బంధించలేను.

విజయవాడ-గుంటూరు సవరణకు అనుకూలంగా ఈ క్రిందివారు ఓటు చేశారు:

1.ఎన్.వి.రామారావు, 2.నీలాద్రి రావురెడ్డి, 3.కె.అప్పలనాయుడు, 4.సి.బాపునాయుడు, 5.వి.గంగయ్య నాయుడు, 6.కావలి నారాయణ, 7.సి.పుండరీకాక్షాచార్లు, . వెంకటనారాయ దొర, 9.ఎం.పెంటన్నాయుడు, 10. కె.రామయ్యచౌదరి, 11ప. కోటయ్య, 12.ఎం.బాపయ్యచౌదరి, 13. స్వర్ణవేమయ్య, 14.నడింపల్లి నరసింహారావు, 15. పసల సూర్యచంద్రరావు, 16. ఆర్.సిద్దన్న గౌడ, 17.బి.సుబ్బరాజు, 1.గంజి నాగేశ్వరరావు, 19.డి. సీతారామయ్య, 20. ఖండవల్లి కృష్ణరావు, 21.వావిలాల గోపాలకృష్ణయ్య, 22.టి.లక్ష్మినారాయణరెడ్డి, 23.జి.పి.కొండయ్య, 24.బి.శంకరయ్య, 25.ఎస్.కాశిరెడ్డి, 26.అల్లూరి వెంకట్రామరాజు, 27.పాకా వెంకట్రావు, 2.గుంటూరు బాపనయ్య, 29.మోటూరి హనుమంతరావు, 30.సి.పుల్లారెడ్డి, 31.కె 32.ఎం.నారాయణస్వామి, 33.జి.అంజనేయులు, 34.వి.శ్రీకృష్ణ, 35.కాట్రగడ్డ రాజగోపాలరావు, 36.ముళ్లపూడి వీరభద్రం, 37.ఎం. మానేరావు, 3.చండ్ర రామలింగయ్య, 39.సివికె రావు, 40.జి. సత్యనారాయణ, 41.కోలా సుబ్బారెడ్డి, 42.కరనం రంగారావు, 43.చిట్టూరి ప్రభాకరచౌదరి, 44.జి.జోసెఫ్, 45.ఆర్ 46.కె.గోవిందరావు, 47.జి.రామరావు, 4.ఎన్.శివరామరావు, 49.ఎం.లక్ష్మణస్వామి, 50.వడాల శ్యామసుందరరావు, 51.పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, 52.టి.నాగిరెడ్డి, 53. పి.నరసింహారెడ్డి, 54.పి 55. దరిశి లక్ష్మయ్య, 56.జి.యలమందారెడ్డి, 57.పేట రామారావు, 5. భూపతిరాజా లక్ష్మినరసింహులు, 59.తమ్మిన పోతరాజు, 60.వాసిరెడ్డి రామారావు, 61.కె. మాలకొండయ్య, 62.పి.ఎస్. రామచంద్రరావు.

ఈ క్రింద వారు వ్యతిరేకంగా ఓటు చేశారు:

1.టి.ఎన్ 2.కడప కోటిరెడ్డి, 3.నాయకంటి శంకరరెడ్డి, 4.డి.సంజీవయ్య, 5.శ్రీమతి తిమ్మాకోటమ్మరెడ్డి, 6.ఆలపాటి వెంకట్రామయ్య, 7.ఆవుతు రామిరెడ్డి, .చెంచు రామనాయుడు, 9.పి.గోపాలకృష్ణరెడ్డి, 10.పి 11.సుదర్శనవర్మ, 12.చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు, 13.శెల్వరాజు, 14.కురుపాం రాజా, 15. పి.గున్నయ్య, 16.లుకలాపు లక్ష్మణరావు,17.కవిగొట్ల సూర్యనారాయణ, 1.హనుమంతు సత్యనారాయణదొర, 19.పాలవలస సంగంనాయుడు, 20.అచ్చన్నాయుడు, 21. కందుల బాలనారాయణరెడ్డి, 22.పాల వెంకటసుబ్బయ్య, 23.వేమారెడ్డి, 24. శ్రీశివశంకరరెడ్డి, 25.సందా నారాయణప్ప, 26.శాంతప్ప, 27.పిడతల రంగారెడ్డి, 2. అప్పు, 29. కె.వరదాచారి, 30.బి.కృష్ణమూర్తి, 31.డి.రామబ్రహ్మం, 32.కె.ఆదికేశవులురాయుడు, 33.మల్లయ్య, 34.హెచ్.రామలింగారెడ్డి, 35.జె.నాగభూషణం, 36.పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, 37.మునిరెడ్డి, 3.కందర్ప వెంకటరామేశం, 39.శృంగారం, 40.ఎస్ 41. కున్శి మహ్మద్ షఫి, 42.చిన్నమరెడ్డి, 43.కొట్రిక వెంకటశెట్టి, 44.వై.ఆదినారాయణరెడ్డి, 45. చల్లా సుబ్బారాయుడు, 46. కుందారామయ్య, 47.రొక్కం లక్ష్మీనరసింహం, 4.వీరన్న పడాల్, 49.రాజాసాగి సూర్యనారాయణరాజు, 50.కిల్లాడ రామ్మూర్తి, 51.వి.చిదానందం, 52.ఎం.వి.సుబ్బారెడ్డి, 53.పి.వి.జి.రాజు, 54.నడింపల్లి రామభద్రరాజు, 55.తెన్నేటి విశ్వనాథం, 56.సూర్యనారాయణ, 57.పద్మనాభరాజు, 5.బత్తెన రామకృష్ణ, 59 కూర్మినాయుడు, 60.ద్వారపూడి బసివిరెడి, 61 సుబ్బారెడ్డి, 62.ఆంధోనిపిళ్లె, 63. ప్రకాశం.

ఆంధ్రుల్లో గౌతు లచ్చన్నగారు, ఆంధ్రేతరుల్లో 9 గురు మొత్తం 94 గురు తటస్థంగా ఉన్నారు.

సవరణను ఓడించడానికి ఓటు చేసిన ఆంధ్రేతరులు:

1.శెల్వరాజ్ (కాంగ్రెసు), 2.అప్పు (కాంగ్రెసు), 3.కున్షి మహ్మద్ షఫీ (ముసింలీగ్), 4.మునిరెడ్డి (కృషిక్), 5.ఆంధోని పిళై (సోషలిష్టు)

గైరుహాజరైన సభ్యులు-సమావేశానికి రాని ఆంధ్రుల్లో వీరు ఉన్నారు.

1.మంత్రి పట్టాభి రామారావు, 2.చిట్టూరి ఇంద్రయ్య, 3.దంతలూరి నారాయణరాజు, 4.రాజా వి.వి.కృష్ణ రాజబహదూర్, 5.తోట రామస్వామి, 6.పి.సత్యనారాయణ రెడ్డి, 7.కమతం షణ్ముగం, .దండమూడి దశరథరామయ్య, 9.మేకా రంగయ్యప్పారావు, 10.అడ్సుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం,11.మల్లిపూడి రాజేశ్వరరావు, 12.అలపాటి వెంకట్రామయ్య,13.బొజ్జా అప్పలస్వామి, 14.వై.వి.కృష్ణరావు, 15.కారం బాపన్న దొర, 16. కుంద శ్రీనివాసులు, 17.ఎం.దొరైశణ్ణు.


‘కర్నూలు నిర్ణయం స్పష్టంగా ఓడిపోయింది’

రాజధాని సమస్యపై ఓటింగు తంతు కమ్యూనిస్టు నాయకుడు నాగిరెడ్డి గారి ప్రకటన

మద్రాసు, జూలై 25: ‘కర్నూలు నిర్ణయం అసందిగ్ధమైన ఓటమిని పొందింది’ అని మద్రాసు అసెంబ్లీ ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ శాసన సభా నాయకులు శ్రీతరిమిల నాగిరెడ్డి గారు ఇవాల ఒక ప్రకటన చేశారు:

ఆ ప్రకటనలో వారింకా ఇలా వివరించారు.

‘‘మద్రాసు అసెంబ్లీలో ‘గుంటూరు-విజయవాడ’ రాజధాని సవరణ ఓటమి ప్రకటన న్యాయమైనదికాదు. గుంటూరు-విజయవాడ సవరణకు వ్యతిరేకంగా ఓటుచేసిన జారిలో అయిదుగురు సభ్యులు వరిశిష్ట రాష్ట్రానికి చెందిన ఆంధ్రేతరులే. సవరణకు అనుకూలంగా 62 మంది, ప్రతికూలంగా 63 మంది ఓటు చేశారని మాత్రమే స్పీకరు ప్రకటించారు. సవరణకు వ్యతిరేకంగా ఓటు చేసిన వారినుంచి వరిశిష్ట రాష్ట్రానికి చెందిన మందిని మినహయిస్తే 5మంది మాత్రమే గుంటూరు- విజయవాడను వ్యతిరేకించారనేది స్పష్టమవుతుంది. అంటే గుంటూరు- విజయవాడ సవరణ ఖచ్చితంగా నాలుగు ఓట్ల మెజారిటితో నెగ్గితే, కర్నూలు రాజధాని నిర్ణయాన్ని కోరేవారు పట్టుబలవంతాన వరిశిష్ట రాష్ట్రానికి సంబంధించిన అయిదుగురు శాసన సభ్యుల చేత తమకు అనుకూలంగా ఓటు చేయించుకోవటానికి నీతి బాహ్య మైన ఎత్తులను వినియోగించారు.
పెక్కుమంది వ్యతిరేకించిన కర్నూలుకై ప్రయత్నించినవారికి అసందిగ్ధమైన ఓటమిని ఆంధ్ర ప్రజానికం కలిగించిందనేది తేటతెల్లమైంది.’’

ఓటింగ్‌పై రాష్ట్రపతికి తంతి

కమ్యూనిస్టుపార్టీ నాయకుడు శ్రీనాగిరెడ్డిగారు ఇవ్వాళ అసెంబ్లీలో రాజధాని విషయమై జరిగిన ఓటింగ్ ఫలితమును రాష్ట్రపతికి, ప్రధాన మంత్రి నెహ్రూ, హోంమంత్రి డా!! రాధాకృష్ణన్, శ్రీసుందరయ్య, ఎంపి గార్లకు ఈ విధంగా ఒక టెలిగ్రాం పంపారు.
‘‘ఇవ్వాళ అసెంబ్లీలో రాజధానిపై ఓటింగ్ జరిగింది. అయిదుగురు తప్ప వరిశిష్ట రాష్ట్ర శాసన సభ్యులంతా తటస్థంగావున్నారు. ఆంధ్రసభ్యులు 62 మంది గుంటూరు-విజయవాడ రాజధాని అవుటకు అనుకూలముగ వున్నారు. ప్రజాభిప్రాయం కూడా గుంటూరు-విజయవాడలకే ఎక్కువ సుముఖముగవుంది. రాజధాని స్థలమును మార్చగోరుతాము’’.
ఆంధ్ర రాష్ట్ర బిల్లుపై శేచించిన చర్చ సోమవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం జరుగుతుంది.