హైదరాబాద్‌పై రాజీలేదు

సీమాంధ్ర ఆధిపత్య శక్తుల విష్‌ఫుల్ థింకింగ్

రాష్ట్ర విభజనపై, హైదరాబాద్ హోదాపై కమిటీల నివేదికల పేరిట సీమాంధ్ర మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఎవరూ కలవరపడవద్దు. హైదరాబాద్‌ను గవర్నర్ అజమాయిషీలో పెడతారని వస్తున్నవార్తలు నిజమయితే అది పది జిల్లాల తెలంగాణ కాబోదు. హైదరాబాద్‌తో కూడిన పదిజిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీ, కేంద్ర మంత్రివర్గం రెండూ విధాన నిర్ణయం ప్రకటించాయి. హైదరాబాద్‌లో పరిపాలన, భూ రెవెన్యూ వ్యవహారాలను గవర్నర్ అజమాయిషీలో పెట్టడం అంటే తెలంగాణ నుంచి ఒక జిల్లాను లాగేసుకోవడమే.

తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు అన్యాక్రాంతాలకు కేంద్రబిందువు హైదరాబాద్. హైదరాబాద్‌లేని తెలంగాణ వచ్చినా ఒక్కటే రాకపోయినా ఒక్కటే. సీమాంధ్ర ఆధిపత్య అవశేషాలు కొనసాగే హైదరాబాద్ వల్ల తెలంగాణకు ఎటువంటి ఉపయోగం ఉండదు. హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండాచేసే కుట్రలను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, యూపీఏ రెండూ తాము చేసిన తీర్మానాలను తామే ఉల్లంఘించే అవకాశాలు ఎంతమాత్రం లేవు.

ఉమ్మడి రాజధానిగా ఉండేకాలంలో ఒక్క శాంతిభద్రతల అంశం తప్ప మరే అంశాన్నీ కేంద్రం లేక గవర్నర్ అజమాయిషీలోకి తీసుకునే అవకాశాలు లేవు. భూమి రెవెన్యూ వ్యవహారాలు కూడా తెలంగాణకు దక్కకుండా పోవాలన్నది సీమాంధ్ర ఆధిపత్య శక్తుల విష్‌ఫుల్ థింకింగ్ అండ్ విసియస్ కాంపెయిన్.

కానీ సీమాంధ్ర ఆధిపత్య గుంపులు చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాలు విరమించవు. సీమాంధ్ర మీడియా గత రెండు మూడు రోజులుగా చేస్తున్న ప్రచారం చూస్తే సందర్భం వస్తే తెలంగాణకు వ్యతిరేకంగా అవిఎంతగా బరితెగిస్తాయో అర్థం అవుతుంది. ముఖ్యంగా కొద్దిరోజులుగా ‘ఈనాడు’ దినపత్రిక తన సీమాంధ్ర స్వభావాన్ని నిర్లజ్జగా బయటపెట్టుకుంటున్నది. తెలంగాణకు వ్యతిరేకంగా ఏచిన్న ఆధారం దొరికినా రెచ్చిపోతున్నది.

హైదరాబాద్‌ను ఎలాగైనా తెలంగాణకు కాకుండా చేయాలన్న కుట్రలో సీమాంధ్ర మీడియా అంతా కట్టగట్టుకుని వ్యవహరిస్తున్నది. మరో దినపత్రిక అదేదో ఆర్గనైజ్డు ఆన్‌లైన్ సర్వేను తాటికాయంత అక్షరాలతో ప్రచురించి చంద్రబాబును ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక దిక్కుగా ప్రకటించేసింది. ఈ పత్రికలు, ఈ పార్టీలు, వాటి అధినేతల బుద్ధులు మారవు. మారాల్సింది, వీరి ఆనవాళ్లు తెలంగాణ గడ్డమీద లేకుండా చేయాల్సింది తెలంగాణ ప్రజలే.