అంపకాలు, అవసరాలు

Namasthe Telangana Editorial

రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర పాలకవర్గాలు తమ దుష్ప్రచారంతో కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ స్థాయి రాజకీయ శక్తులను తప్పుదోవ పట్టించి తెలంగాణకు తీరని అన్యాయం చేయడానికి యత్నిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా తామే త్యాగం చేస్తున్నట్టు, దానికి పరిహారం కోరాలన్నట్టు సీమాంధ్ర పెద్దలు మాట్లాడడం విచివూతంగా ఉన్నది. ఈ పెత్తందారులు రాష్ట్ర విభజన సందర్భంగా కొన్ని ప్రాథమిక విషయాలు గుర్తుంచుకుంటే వారికే మంచిది. 1956లో తెలంగాణ, ఆంధ్ర విలీనం షరతుల ప్రాతిపదికగా జరిగింది. ఆ షరతుల ఉల్లంఘన, ఇతర అన్యాయాల వల్ల విభజన జరుపవలసి వస్తున్నది. తెలంగాణ ఆకాంక్షను గుర్తించిన కేంద్రం రాజ్యాంగ బాధ్యతతో తీర్పరి పాత్ర వహించి విభజన జరుపుతున్నది. అంతే తప్ప ఈ విభజన షరతుల ప్రాతిపదికగా జరగడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి సీమాంవూధకు తోడిపెట్టే షరతులకు ఏ విభజన పత్రంలోనూ స్థానం ఉండకూడదు. దానిని విజ్ఞుపూవరూ ఆమోదించరు. విభజన సందర్భంగా సీమాంవూధకు అన్యాయం జరగకూడదనేదే ప్రాతిపదిక. అదే విధంగా తెలంగాణకు అన్యాయం జరగకూడదనే ప్రాతిపదిక కూడా ఉంటుంది. నష్టం లాభం అనే ఆలోచన వేరు.

న్యాయం, అన్యాయం అనే ధృక్కోణం వేరు. తెలంగాణ విముక్తి చెందడం వల్ల సీమాంధ్ర పెత్తందారులకు నష్టం జరగవచ్చు. ఒకరికి లబ్ధి జరిగితే ఆ మేర మరో వర్గం నష్టపోవచ్చు. అందుకని లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా- ఎవరిది న్యాయం అనేదే ప్రాతిపదికగా ఉంటుంది. కేంద్రం విభజన నిర్ణయం తీసుకుని అమలు జరిపే క్రమంలో తెలంగాణ, ఆంధ్ర రెండూ సమాన హోదాతో న్యాయంగా పంపకాలు జరుపుకోవలసిందే. అంతే తప్ప విభజనకు అంగీకరించినందుకు తెలంగాణ వారు ఉద్యోగాలలో, నిధుల్లో, నీళ్ళలో త్యాగం చేయ వలసి ఉంటుందని సీమాంధ్ర పెత్తందారులు భ్రమ పడకూడదు. విభజన తరువాత కూడా తమ దోపిడీ కొనసాగేటట్టు అయితేనే అందుకు అంగీకరిస్తామని ఆంధ్రా పెద్దలు భావిస్తే, వారి అల్పత్వం బయట పడుతుందే తప్ప ఆచరణ సాధ్యం కాదు. తెలంగాణ విముక్తి అనేది ఆంధ్రా పెత్తందారులు దయతలచి పెట్టే భిక్ష కాదు. తెలంగాణ ప్రజల హక్కు. ఈ హక్కు ఆంధ్రా పెత్తందారులు షరతులతో అప్పగిస్తే తీసుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు.

తెలంగాణ విముక్తిని ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్నారు. తెలంగాణ భూభాగం రూపు రేఖలు మార్చే లేదా ప్రయోజనాలను పణంగా పెట్టే హక్కు ఇక్కడి నాయకులకు కూడా లేదు. అటువంటి సంతకాలు ఎవరు పెట్టినా వాటికి ఆమోదనీయత ఉండదు. తమ ప్రయోజనాలకు ఏ రూపంలో భంగం వాటిల్లినా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలు కొనసాగిస్తారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రా ప్రాంతానికి లేదా అక్కడి సమాజానికి అన్యాయం ఏమీ జరగడం లేదు. తెలంగాణకు కూడా అన్యాయం జరగ కూడదు. తెలంగాణతో విలీనానికి ముందు ఆంధ్రకు రాజధాని సమస్య ఎదురైంది. ఇప్పుడు కూడా అదే సమస్య వెంటాడుతున్నది. అందువల్ల కేంద్రం కారుణ్య దృక్పథంతో ఆ ప్రాంతానికి రాజధాని నిర్మాణంలో సహకరించాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. హైదరాబాద్‌ను తాము అభివృద్ధి చేశామని అందువల్ల నష్టపోతున్నామని ఆంధ్రా పెత్తందారులు చెప్పడం తప్పు. విలీనం తరువాత తెలంగాణ నిధులు, నీళ్ళు ఉపయోగించుకుని ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. తెలంగాణ నోరు కొట్టి ఆంధ్రా సమాజం కూడా అభివృద్ధి చెందింది. తెలంగాణ యువతకు రావలసిన ఉద్యోగాలు కాజేసి హైదరాబాద్‌లో ఇండ్లు కట్టుకుని కాలనీలు నిర్మించుకోవడం దోపిడీ అవుతుందే తప్ప అభివృద్ధి కాదు. సింగరేణి మొదలుకొని సచివాలయం వరకు తెలంగాణ ప్రజలు ఉద్యోగాలలో నష్టపోయింది లెక్కకు అందనంత! ఇక కాంట్రాక్టులు, వ్యాపారాలు లెక్క పెడితె చెక్కరొచ్చి పడాలె. యాభై ఏడేండ్ల సంది తిన్నదంతా ఇప్పుడు కక్కాలని తెలంగాణ ప్రజలు నిలదీస్త లేరు. కానీ ఆంధ్రా వలస పాలనలో చితికి పోయిన తెలంగాణ సమాజం లేచి నిలబడడానికి కేంద్రం చేయూత నివ్వాలని కోరడంలో సహేతుకత ఉన్నది.

ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ మధ్య తరగతి జనం అర్హతకు తగిన ఉద్యోగాలు పొందకపోగా, అవమానాలను ఎదుర్కొంటూ రెండవ తరగతి పౌరులుగా బతకవలసి వచ్చింది. మరోవైపు చెరువులు దెబ్బతీయడం వల్ల, విద్యుత్ సరఫరా లేక పోవడం వల్ల, నిధులు మరో ప్రాంతానికి మళ్ళడం వల్ల గ్రామీణ సమాజం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నది. వలస పాలన సామాజిక సంక్షోభానికి కూడా దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం యూరప్ సమాజాన్ని ఎంత ఛిన్నాభిన్నం చేసిందో అంత కన్నా ఎక్కువగా తెలంగాణ సమాజం విధ్వంసానికి గురైంది. జనం బొంబాయి, దుబాయి వెళ్లిపోవలసి వచ్చింది. ఇట్లా కోట్లాది కుటుంబాలు కార్చిన కన్నీళ్ళు ఏ మంత్రుల బృందం లెక్కలకు అందవు. తెలంగాణ ఏర్పాటు తరువాత సామాజిక, ఆర్థిక పునర్నిర్మాణం పెద్ద సవాలుగా మారనుంది. దీనికి ఎన్ని లక్షల కోట్లయినా కేంద్రం భరించవలసిందే. ఈ సమస్యను తెలంగాణకు పరిమితమై ఆలోచించకూడదు. దేశ సమస్యగా భావించాలె. తెలంగాణ పునర్నిర్మాణం ద్వారా బడుగు వర్గాల బతుకుల్లో వెలుగు నింపడం విధానకర్తల బాధ్యత. దీనిని విస్మరిస్తే తెలంగాణ ఉద్యమం కొనసాగి అనేక అవాంఛనీయ పరిస్థితులకు దారితీయవచ్చు.
Editorial
Courtesy Namasthe Telangana Daily