ఎవరి హైదరాబాద్? ఎవరి ఆదాయం?

విభజన సమస్య చివరకు హైదరాబాద్ కోసం, హైదరాబాద్ చుట్టూ పరిభ్రమిస్తోంది. సమన్యాయం అని చంద్రబాబు మాట్లాడుతున్నదీ, సమైక్యాంధ్ర అని కిరణ్‌బాబు, జగన్‌బాబులు మాట్లాడుతున్నదీ అంతర్లీనంగా హైదరాబాద్ గురించే. రాష్ట్ర ఆదాయానికి అత్యధిక నిధులు సమకూర్చే హైదరాబాద్‌లో మావాటా ఏమీ లేదా అన్నదే వారి ప్రశ్న. హైదరాబాద్ ఆదాయంలో వాటాలేకపోతే ఆంధ్ర ఎలా మనుగడ సాగిస్తుందన్నదే వారికి ఆందోళన కలిగిస్తున్న విషయం. హైదరాబాద్‌లో మేము పంచిన భూముల సంగతేమిటి? మేము దంచిన భూముల మాటేమిటి? అన్నదే వారిని కలవరపెడుతున్న సమస్య. కానీ ఇవేవీ బాహాటంగా చెప్పే దమ్ము ధైర్యం వారికి లేవు. మనసులోని అధర్మ వాంఛలకు వారు వేస్తున్న అందమైన ముసుగు సమైక్యత. ఇదంతా ప్రజలకు కూడా అర్థమవుతున్నది. ‘ఆక్రమించిన భూముల జోలికి వెళ్లం. అక్రమంగా పంచిన భూములను ముట్టుకోం. గతంలో మీరు చేసిన పాపాలను పట్టించుకోం అని విభజన బిల్లులో పెడతామని హామీ ఇవ్వమనండి. వాళ్లు నోరుమూసుకుని వెళతారు’ అని డ్బ్బైఏళ్ల రిటైర్డు అధికారి ఒకరు ఫోను చేసి చెప్పారు. హైదరాబాద్ గురించి అసలు ఎందుకింత వివాదం జరుగుతోంది? హైదరాబాద్‌లో జీవితచక్రం నిరాఘాటంగా తిరగడానికి అవుతున్న ఖర్చు ఎంత? హైదరాబాద్‌ను పోషించడానికి తెలంగాణ నష్టపోయిందెంత? హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయం ఎంత? తెలంగాణ కోల్పోయిన ఆదాయం ఎంత? ఆవేశం అక్కరలేదు. వాస్తవాలు మాట్లాడుకుంటే చాలు. నిజాయతీగా విశ్లేషించుకుంటే చాలు. రాష్ట్ర జనాభాలో ఇవ్వాళ 27 శాతం జనాభా హైదరాబాద్ పట్టణ పరివ్యాప్తిలో జీవిస్తున్నారు. ఇందులో అన్ని ప్రాంతాల వాళ్లు, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని కులాలు, మతాల ప్రజలు ఉన్నారు. విభజన జరిగితే ఏ కొద్ది మంది ఉద్యోగులో తరలిపోతారు తప్ప ఆ తర్వాత కూడా వీరంతా ఇక్కడే ఉంటారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు అందిస్తున్న మౌలిక సదుపాయాలేవీ ఆగిపోవు, తగ్గిపోవు. ఆ మౌలిక సదుపాయాలు కల్పించడానికి తెలంగాణ పెట్టిన పెట్టుబడి ఏమిటి? వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్‌పై వస్తున్న ఆదాయం ఒక్క సింగూరు రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి చాలదు. సమైక్యతకోసం తెలంగాణ నష్టపోయిన వివరాలు తీస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎంత నీరు? ఎన్ని ఉద్యోగాలు? ఎన్ని భూములు? ఎన్ని లక్షల కోట్లు?

సింగూరు ప్రాజెక్టును నిర్మించింది కరువు కాటకాలతో విలవిలలాడుతున్న మెతుకుసీమ రైతులను ఆదుకోవడానికి. 29 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ చివరకు ఏమైంది? చుక్కనీరు రైతులకు ఇవ్వకుండా గత మూడు దశాబ్దాలుగా మంజీర ప్రాజెక్టుద్వారా హైదరాబాద్‌కు తరలించుకువచ్చారు. నగరానికి 1996లో రోజుకు 65 మిలియన్ లీటర్లు తాగునీరు అవసరం కాగా ఇప్పుడు అది 840 మిలియన్ లీటర్లకు పెరిగింది. 1996లో తలసరి నీటి వినియోగం 150 లీటర్లు ఉంటే ఇప్పుడది 120 లీటర్లకు తగ్గిపోయింది. నీటి అవసరాలు పెరిగేకొద్దీ ఒక్కొక్క ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించడం మొదలైంది. కృష్ణా నది నుంచి 17 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు కేటాయించారు. ఇప్పటికే 10.5 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. తాజాగా గోదావరి జలాల తరలింపు పథకం నడుస్తోంది. ఈ నీటిలెక్కలన్నీ తెలంగాణ వినియోగంలో చూపిస్తున్నారు. ఈ నీటి తరలింపుకోసం అయ్యే ఖర్చునంతా తెలంగాణలో చేసిన ఖర్చులకింద చూపిస్తున్నారు. కానీ ఒక్కసారి తెలంగాణకు జరిగిన నష్టాల్లోకి వెళ్లి చూడండి-సింగూరు, మంజీరా ప్రాజెక్టులకింద రైతాంగం ఏటా కనీసం 20 టీఎంసీల నీరు ఉపయోగించుకుంటే 2 లక్షల ఎకరాలు సాగయ్యేది. రాజశేఖర్‌రెడ్డి సూక్ష్మ వ్యవసాయం ప్రకారమయితే ఆరు లక్షల ఎకరాలు సాగయ్యేది. తడి పంటలయితే ఏటా ఎకరాకు 80 వేల రూపాయల రాబడి వస్తుంది. అంటే మెదక్ రైతులకు ఏటా 1600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ ముప్పైఏళ్లలో వారు నష్టపోయింది ఎంతో ఇప్పుడు లెక్కవేయండి. అలాగే కృష్ణా నీటికీ మూల్యం కట్టండి. ఇవి కాకుండా తెలంగాణలో తెలంగాణకు రావలసిన న్యాయమైన నీటి వాటాలు ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టం ఎంత? కృష్ణా నదిలో తెలంగాణకు కేటాయించిన 280 టీఎంసీల నీటిని తెలంగాణ ఉపయోగించుకుని ఉంటే ఇవ్వాళ నల్లగొండ, మహబూబ్‌నగర్‌లు ఇలా దారిద్య్రంలో కొట్టుమిట్టాడవలసి వచ్చేదా? ఫ్లోరైడు సమస్య, వలసల విషాదంతో అలమటించేవా?

ఒక ఉద్యోగం పది కుటుంబాల జీవితాలను బాగు చేస్తుంది. ప్రభావితం చేస్తుంది. ఊరుకు పది ఉద్యోగాలు ఉంటే ఆ ఊరు జీవితం మారిపోతుంది. జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. సమైక్యాంధ్రలో తెలంగాణ పౌరులకు అర్హత ఉండీ దక్కకుండా పోయిన ఉద్యోగాల సంఖ్య, దానివల్ల జరిగిన నష్టం లెక్కలు తీయండి-హైదరాబాద్ ఎవరికి దక్కాలో తెలిసిపోతుంది. తెలంగాణ ఉద్యమకారులు లక్షకు పైగా ఉద్యోగాలు కోల్పోయామని చెబుతుంటారు. యాభైవేల ఉద్యోగాలే తీసుకుందాం. ఒక ఉద్యోగం సంపాదన ఇన్నేళ్లలో తక్కువలో తక్కువ కనీసం కోటి రూపాయలు ఉంటుందనుకుందాం. అంటే 50 వేల కోట్ల రూపాయలు ఉద్యోగాల రూపంలోనే తెలంగాణ నష్టపోయింది. ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణకు దక్కి ఉంటే తెలంగాణ ఇంతగా వెనుకబడి ఉండేది కాదు. హైదరాబాద్ నగరం చుట్టూ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకం కింద పరిశ్రమలు పెట్టడానికి తొలినాళ్లలో ఉచితంగా భూములు, నీరు, పన్నురాయితీలు, సబ్సిడీ విద్యుత్ ఇచ్చారు. అవన్నీ తెలంగాణ వనరులే. తెలంగాణ జిల్లాల యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడంకోసం ఈ పథకాన్ని తెచ్చారు. కానీ జరిగింది ఏమిటి? ఆ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కడివారో ఇప్పుడయినా లెక్కలు తీయండి. ఆ కంపెనీలు కాలుష్యకారకాలుగా మారి ఎంత నరకం చూపిస్తున్నాయో ఆ పారిశ్రామిక వాడలకు వెళ్లి చూడండి. తెలంగాణ ఉద్యమం ఎందుకు సమంజసమైనదో అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయం మాదేనని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. ఇక్కడి వనరులు, ఇక్కడి భూములపై వెలసిన కంపెనీలు ఇక్కడ పన్నులు కట్టకుండా విజయవాడలో చెల్లిస్తాయా?

అతిపెద్ద కుంభకోణం భూములదే. హైదరాబాద్‌లో, హైదరాబాద్ చుట్టూ సర్ఫెఖాస్, పైగా, వక్ఫ్, భూదాన్, షేవూషీ, గురుకులట్రస్టు, బోనావేకెన్సీ…ఇలా రకరకాల పేర్లతో ఉన్న ప్రభుత్వ భూమి కనీసం రెండు లక్షల ఎకరాలు మాయమయింది. బాలానగర్ మండల రెవెన్యూ రికార్డులు రెండుసార్లు తగులబడ్డాయి. నిన్నగాకమొన్న శంకర్‌పల్లి హెచ్‌ఎండీఏ జోనల్ కార్యాలయం తగులబడింది. షేక్‌పేట మండల కార్యాలయంలో కూడా ఒకసారి అగ్నిప్రమాదం జరిగింది. ఇవ్వాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ తారుమారయ్యాయి. అన్యాక్రాంతమైన భూమి కనీసం లక్ష ఎకరాలే లెక్కవేయండి. ఎకరం విలువ కోటి రూపాయలే లెక్కగట్టండి. లక్ష కోట్ల రూపాయలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కోల్పోయాయి. న్యాయంగా కొనుక్కున్న భూముల గురించి మాట్లాడడం లేదు. ప్రైవేటు భూముల గురించి మాట్లాడడం లేదు. తెలంగాణలో భూములు కొనాలంటే ప్రాంతీయ అభివృద్ధి మండలి అనుమతి తీసుకోవాలని రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందం నుంచి ఇప్పటిదాకా జరిగిన దుర్మార్గాలను చూస్తే హైదరాబాద్‌పై సీమాంధ్ర నాయకత్వం చేస్తున్నవాదన ఎంత అన్యాయమైనదో, ఎంత మోసపూరితమైనదో అర్థమవుతుంది.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు 19 ప్రభుత్వ రంగ కంపెనీలను మూసేశారు. వాటి ఆస్తులను వేలం వేశారు. హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిన జనాభాను తట్టుకోవడానికి ఇన్నర్‌రింగ్‌రోడ్డు అవసరం అన్నారు. ఫ్లై ఓవర్లు కట్టారు. తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు అవసరం అన్నారు. ఇప్పుడు మెట్రోరైలు వస్తోంది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల వెనుక సీమాంధ్ర రియల్టర్ల ప్రయోజనాలే ప్రాథమికమైనవి. ఈ ప్రాజెక్టులకోసం ప్రభుత్వం లక్షలకోట్ల అప్పులు తెస్తోంది. అవన్నీ ఇప్పుడు హైదరాబాద్‌పై వదిలేస్తారా లేక సీమాంధ్ర పంచుకుంటుందా? హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ, విద్యుత్ వినియోగం, రవాణా సౌకర్యాల నిర్వహణకోసం ఎంత ఖర్చవుతోంది? ఈ లెక్కలన్నీ తేలాలి. 2009-10 లెక్కల ప్రకారమే 3541 బస్సులు రోజుకు 40,006 ట్రిప్పులు నగరంలో తిరుగుతున్నాయి. నగరం వినియోగానికి కనీసం 1000 నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఒక కాప్టివ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయిన మహానుభావులు సమైక్య ప్రభువులు. సమైక్యాంధ్రలో ఇన్ని నిర్వాకాలు చేసి ఇప్పుడు కలుసుందామని, హైదరాబాద్‌లో వాటా కావాలని మాట్లాడితే ఏమని అర్థం చేసుకోవాలి? హైదరాబాద్ అంటే ఇక్కడి ప్రజలు. వారి జీవితం. హైదరాబాద్ ఆస్తి కాదు పంచుకోవడానికి. హైదరాబాద్‌ను మీరు తేలేదు తీసుకుపోవడానికి. విడిపోయిన తర్వాత కూడాఆ జీవితం కొనసాగుతుంది. ప్రజలు కలిసే ఉంటారు.