హైదరాబాద్ లూటీపోతోంది….!

సంధికాలం. ఎవరూ ఎవరినీ పట్టించుకునే పరిస్థితి లేదు. అందరికళ్లూ ఇటు తెలంగాణపైన, అటు సమైక్యాంధ్రపైన ఉన్నాయి. కొందరు ప్రభుత్వంలోని పెద్దలు, ప్రజాప్రతినిధులు, భూకబ్జాదారులు మాత్రం రెక్కలు విరుచుకుని నగరంపై పడ్డారు. ఎక్కడ ఖాళీ భూములు ఉంటే అక్కడ కర్చీఫ్ వేసి ఇది నాదే అని ప్రకటించుకునేందుకు, ప్రభుత్వంతో రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కబ్జా రాబందులు నగరంలో ఖాళీ ప్రదేశాలను తమ గుప్పిట్లోకి తీసుకుని, పత్రాలు సృష్టించి, రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులు తారుమారు చేసి, భూములు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చోటామోటా నాయకులు అందరూ ఉన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ ఈ విషయంలో కలిసే పనిచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిని ఉమ్మడిగా వేర్వేరుగా వేగంగా చేసుకుపోతున్నారు. ఎవరయినా రెవెన్యూ అధికారులు అడ్డొస్తే వారిని బదిలీ చేయిస్తున్నారు.

gaddalu
Courtesy Eeenadu Daily

ఈనాడులో ఈరోజు వచ్చిన వార్త అందుకు ఒక మచ్చుతునక మాత్రమే. సుమారు 5000 వేల కోట్ల రూపాయల విలువ జేసే భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఒక అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేలోగా ఈ తతంగం పూర్తిచేయాలని కబ్జారాబందులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబిలీ హిల్స్, మాధాపూర్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఈ దందా జోరుగా జరుగుతున్నదని ఆయన చెప్పారు.

సంధికాలంలో ఎటువంటి భూబదలాయింపులు జరుగకుండా తెలంగాణవాదులు అడ్డుకోవాలని ఆ అధికారి కోరారు. అవసరమైతే కోర్టు నుంచి సాయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘హైదరాబాద్‌లో అన్యాక్రాంతమవుతున్న భూములపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి నిగ్గుతేల్చాల్సి ఉంద’ని తెలంగాణ న్యాయవాద జేయేసీ నాయకుడొకరు అన్నారు.