పవన్‌ను ముగ్గులోకి దింపే ప్రయత్నం

తెలుగుదేశం అగ్రనాయకత్వం కొత్త బలిపశువులకోసం ఎదురుచూస్తోంది. 2009లో జూనియర్ ఎన్‌టిఆర్‌ను ఉపయోగించుకుని ఆ తర్వాత డంప్ చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే శక్తులకోసం వెదకుతున్నారు. బిజెపితో జట్టుకట్టాలన్న ఆరాటం అందులో భాగమే. నరేంద్రమోడిపై సానుకూల వాతావరణం తనకు ఉపయోగపడుతుందన్న దూరాలోచనతోనే ఆయన ఆ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇప్పుడు హీరో పవన్ కల్యాణ్ టీడీపీలో చేరే అవకాశాలున్నాయని ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారం కూడాచంద్రబాబును లేపే ప్రయత్నాల్లో భాగమేనని పరిశీలకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చేరి రాష్ట్రాన్ని ఉద్ధరించాలని కొంతకాలంగా రాంగోపాల్ వర్మ ట్వీట్‌లు చేస్తూనే ఉన్నారు. అది వ్యంగ్యమో లేక నిజమో తెలియదు కానీ ఇప్పుడు తెలుగుదేశాన్ని కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్న మీడియా కూడా పవన్, ఆయన అన్న నాగేంద్రబాబు చుట్టూ అటువంటి కథనాలనే ప్రచారంలోకి తెస్తోంది. పవన్‌ను ఒప్పించాలని టీడీపీ నుంచి కొంత మంది పెద్దమనుషులు పవన్‌ను కలిసి చర్చలు జరిపారని కూడా ఈ కథనాల సారాంశం.

అయితే ఇప్పటివరకు పవన్ కల్యాణ్ వైపు నుంచి చిన్న సూచన కూడా బయటికి రాలేదు. కేంద్ర మంత్రి చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు సరిపడడం లేదని సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. పవన్‌కు ఆవేశపరుడిగా, పీపుల్ కన్సర్న్ ఉన్న నటునిగా పేరుంది. అయితే రాజకీయాల్లో చేరడానికి సినిమా ఇమేజి మాత్రమే చాలదని చిరంజీవి, జూనియర్ ఎన్‌టిఆర్ అనుభవం తేటతెల్లం చేసింది. పార్టీలో చేరడం, అందులో ఇమడడం, పార్టీకి ఉపయోగపడడం, పార్టీని ఉపయోగించుకోవడం ఇవన్నీ అర్థమయితే గానీ రాజకీయాల్లో రాణించడం సాధ్యం కాదు. చంద్రబాబునాయుడికి యూజ్ అండ్ త్రో నాయకునిగా పేరుంది. జూనియర్ ఎన్‌టిఆర్ విషయంలో అది రుజువయింది.

పైగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం గందరగోళంగా ఉంది. విభజన జరుగుతుందా? జరిగితే రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతాయి? జరుగకపోతే ఏపార్టీ ఏం చేస్తుంది? ఎవరు ఎవరితో కలుస్తారు? వంటి అనేక సందిగ్ధాలు తేలాల్సి ఉంది. డిసెంబరు నెలాఖరుకు గానీ విభజన జరిగేదీ లేనిదీ తేలిపోతుంది. అప్పటిదాకా రాజకీయ మీడియా వలలకు చిక్కకుండాతప్పుకోవడం హీరోలకు మంచిది.