డిసెంబరు 9న లోక్‌సభలో తెలంగాణ బిల్లు

నవంబరు ఏడున విభజన షెడ్యూలు

నవంబరు ఏడవ తేదీన జరుగనున్న మంత్రివర్గ బృందం(జీవోఎం) తదుపరి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి రాజకీయ వర్గాల సమాచారం. ఈలోపు విభజన విధివిధానాలు, సీమాంధ్రకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, అక్కడి రాజధాని స్థల నిర్ణయం వంటి అంశాలపై మంత్రివర్గ బృందం ఒక అవగాహనకు వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు అందిన విన్నపాలను పరిశీలించడంతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి కావలసిన సమాచారం తెప్పించుకుని ఈ బృందం అధ్యయనం చేస్తుంది.

ఈ అధ్యయనం ఆధారంగానే విభజనకు సంబంధించిన షెడ్యూలును రూపొందించి, సమావేశంలో చర్చిస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. డ్రాఫ్టు బిల్లును శాసనసభ పరిశీలనకు పంపితే సరిపోతుందని ఇప్పటికే మంత్రివర్గ బృందం ఒక అవగాహనకు వచ్చిందని ప్రచారం జరుగుతున్నది. జీవోఎం తదుపరి సమావేశం తర్వాత వారం రోజుల్లో డ్రాఫ్టు బిల్లు రూపొందిస్తారని, దానిని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతి ద్వారా శాసనసభకు పంపుతారని, నవంబరు 20 తర్వాత శాసనసభ ఈ తీర్మానంపై చర్చచేయవచ్చునని భావిస్తున్నారు. శాసనసభలో ఓటింగ్ జరుగకపోవచ్చునని, ఒక వేళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహాయ నిరాకరణ వల్ల ఏదైనా రాజ్యాంగ సంక్షోభం తలెత్తితే కేంద్రం అదే అదనుగా రాష్ట్రపతిపాలనకు వెళుతుందని, అప్పుడిక కేంద్రం పని సులువవుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలిపారు. డిసెంబరు 9న లోక్‌సభలో కేంద్రం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టవచ్చునని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతల వ్యవహారాన్ని మాత్రం కేంద్రం పరిధిలో ఉంచేందుకు దాదాపు నిర్ణయం జరిగిపోయిందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను యూటీ చేసే అవకాశాలు ఎంతమాత్రం లేవని, రెవెన్యూ, భూవ్యవహారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే అవకాశాలు కూడాలేవని ఆయన అన్నారు. హైదరాబాద్‌తో సహా పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యుసి తీర్మానం చేసినందున, హైదరాబాద్‌లో రెవెన్యూ, భ్యూవహారాల జోలికి కేంద్రం వెళ్లదని ఆయన వివరించారు. రెవెన్యూ, భూవ్యవహారాలను తెలంగాణకు దక్కకుండా చేయడమంటే తొమ్మిది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేసినట్టవుతుందని, అందుకు తెలంగాణవాదులు ఒప్పుకునే అవకాశమే లేదని ఆయన తెలిపారు.

అయితే సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు కమ్ రాజకీయవేత్తలు అయిన కొందరు నాయకులు మాత్రం ఇప్పటికీ తెలంగాణను ఆపుతామని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వారి మాటలు వినిపించుకోకపోవడంతో ఇప్పుడు వారు వేరే మార్గాల్లో తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు కోర్టులకెక్కుతున్నారు. ఇంకొందరు బిజెపి అగ్రనాయకులను బతిమాలుతున్నారు. మరికొందరు ఎస్‌పి వంటి పార్టీలతో మాట్లాడి అవిశ్వాసం పెట్టించాలని, ప్రభుత్వాన్ని పడగొట్టించాలని చూస్తున్నారు. ఇంకొకాయన రాష్ట్రపతిని కూడా ఈ వివాదంలోకి లాగాలని చూస్తున్నారు.

రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. డ్రాఫ్టు బిల్లు రాగానే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే సంక్షోభం వస్తుందని, అది కాలయాపనకు దారితీస్తుందని, తెలంగాణ ఆగిపోతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే శాసనసభ ఎజెండాలోకి వచ్చి వెళితే చాలునని, ఆ తర్వాత ఏమైనా పర్వాలేదని న్యాయనిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఒక వేళ సీఎం, ఆయన అనుచరులు రాజీనామా చేసి సభ నుంచి వెళ్లిపోతే, కోరంకు సరిపోయే సభ్యులున్నా బిల్లును ఆమోదించి పంపవచ్చునని కూడా ఆయన చెప్పారు.