ఒక సామాజిక విషాదం

రెండు రోజుల కింద ఒక పెద్దాయన ఫోను చేశాడు. చాలా ఆవేశంగా మాట్లాడాడు.‘ఏమయ్యా…మా కులం మీద అలా విషం కక్కుతున్నారు? కులం ఏంచేసింది? ఎందుకిట్లా రాస్తున్నారు? ఇది మీకు న్యాయమేనా? తెలంగాణకు అనేక సార్లు అండగా నిలబడింది మావాళ్లే. తెలంగాణ సాయుధపోరాటానికి చేయూతనిచ్చింది మావాళ్లే. ఎన్‌జి రంగా చెన్నారెడ్డిని ఎంతగా ప్రేమించేవాడో తెలుసా?….’ అని ఆయన నిరాఘాటంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మాటల్లో బాధ, కోపం తెలుస్తూ ఉన్నాయి. ఆయన తన విమర్శకు ఉదాహరణగా రెండు వార్తలు గుర్తు చేశారు. తెప్పించి చూశాను. ఒక వార్తలో రంగా ప్రస్తావన ఉంది. అది నిజం కాదంటారాయన. అందులో కులం ప్రస్తావన లేదు. మరో వార్త ఒక ప్రముఖుని ప్రకటన. ఒకప్పుడు కాళోజీ చేసిన రెండున్నర కులాల ప్రస్తావనే ఆ ప్రముఖుడు గుర్తు చేశారు. బహుశా ఆయన కోపానికి అది ప్రధాన కారణమై ఉండవచ్చు. అది నమస్తే తెలంగాణ అభిప్రాయం కాదు. ఆ పెద్దాయన మాటలు నన్ను మాత్రం కుదిపాయి. ఎందుకంటే నేను ఒకప్పుడు విద్యార్థి నాయకుడిగా, జర్నలిస్టుగా ఎదిగిందీ, పెరిగిందీ, పరిణతి చెందిందీ వారి మధ్యనే, వారి మద్దతుతోనే. ఇప్పటికీ నా మిత్రుల్లో ఎక్కువ మంది వారే. నేను చేసే తెలంగాణ వాదనలను సహనంతో పరామర్శించిందీ వారే. ఒక్కసారి మొత్తం చరిత్ర రీలును వెనుకకు తిప్పి చూడాలనిపించింది. నిజానికి నాయకుడిని చూసి సమాజాన్ని చూస్తారు. నాయకుడిని చూసి కులాన్ని చూస్తారు. సమాజానికయినా, కులానికయినా మంచి పేరో లేక చెడ్డపేరో ఆయా కాలాల్లో నడిపిస్తున్న నాయకుడికి సంబంధించినదే తప్ప, మొత్తం ప్రజలది కాదు. నాయకులు తాము ఆ కులాన్ని ఉద్ధరిస్తున్నామన్న పోజుతో చేసే విపరీత చేష్టలు ఆ కులానికి చెడ్డపేరు తెస్తాయి. కానీ అందుకు మొత్తం కులాన్ని దూషించడం లేక తప్పుపట్టడం న్యాయం కాదు. ఆ పెద్దాయన ప్రస్తావించిన సామాజికవర్గం పేరు కమ్మ. నిజంగా ఆ కులం రాష్ట్రానికి కీడు చేసిందా? రాష్ట్ర ప్రగతికి ఆ కులం చేసిన ప్రగతి ఏమీ లేదా? ఇవ్వాళ ఆ కులం చుట్టూ ఎందుకింత ద్వేషభావం ప్రచారం అవుతోంది? మూలాలు ఎక్కడ ఉన్నాయి?

ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, తదుపరి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ప్రగతిశీల ఉద్యమాలన్నింటికీ ఒకప్పుడు నాయకత్వం వహించిన సామాజిక వర్గం అది. బ్రాహ్మణ ఆధిపత్య రాజకీయాలకు, భూస్వామ్య పెత్తందారీ దాష్టీకానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసిన నాయకులు అత్యధికులు ఆ కులానికి చెందిన వారే. ఈ యుద్ధాల్లో కూడా బ్రాహ్మణులు, రెడ్లు, దళితులు అన్ని కులాల వారున్నారు. కానీ పురోగామి కులంగా ఈ యుద్ధాలకు వెన్నుదన్నుగా నిలిచిన కులం ప్రధానంగా వారిదే. నాయకత్వ పాత్రలో ఎక్కువ కాలం ఉన్నది వారే. బ్రాహ్మణ భావజాలంపై తిరుగుబాటు ప్రకటించిన త్రిపురనేని రామస్వామి చౌదరి ఆ సమాజానికి చెందినవారే. అలాగని బ్రాహ్మణుల్లో ప్రగతిశీలురు ఆనాడు లేరని కాదు. ఉన్నవ, మహీధర, కొడవగంటి, చలం, పరకాల పట్టాభిరామారావు, ఏటుకూరి బలరామమూర్తి ఆ సమాజం నుంచి వచ్చినవారే. వారంతా కమ్మ సామాజిక వర్గంతో కలసి అథోజగత్ సహోదరులకు అండగా నిలిచినవారే. కానీ చోదక శక్తులను ఎలా విస్మరించగలం? ఆంధ్ర సమాజాన్ని అభివృద్ధి నిరోధక భావజాలం నుంచి ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ ముందుకు సాగిన సామాజిక వర్గం కమ్మకులం వారే. అలనాడు పత్రికలన్నీ బూజుపట్టిన సనాతన భావదారిద్య్ర ప్రవాహంలో మునిగి తేలుతున్నప్పుడు, ప్రగతిశీల భావజాలంపై విషం చిమ్ముతున్నప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త ప్రపంచాన్ని, కొత్త భావజాలాన్ని పరిచయం చేసిందీ వారే. పత్రికలు, సాహిత్యం తీసుకువచ్చి జనాన్ని జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించిందీ వారే. రాష్ట్రంలో ఏ ప్రగతిశీల ఉద్యమం వచ్చినా తొలుత అందిపుచ్చుకున్నవారిలో ఎక్కువమంది వారే.

బహుశా ముందుగా అందివచ్చిన భావజాల చైతన్యం, ఆర్థిక పుష్టి, పురోగామి తత్వం అందుకు కారణమై ఉండవచ్చు. కమ్యూనిస్టు పార్టీలు…..ఏబీసీడీ ఎన్ని గ్రూపులయినా తీసుకోండి…అన్నింటి ప్రస్థానంలో వారి ప్రమేయం, క్రియాశీల పాత్ర కనిపిస్తుంది. కమ్యూనిస్టులు తెలుగు సమాజంలో సాధించిన ప్రతి మార్పు, విజయాల్లో వారి పాత్ర విడదీయరానిది. తెలంగాణ సాయుధపోరాటానికి ప్రధానంగా నాయకత్వం వహించింది రెడ్డి సామాజికవర్గంతో పాటు ఇక్కడి బీసీ, దళిత కులాల ప్రజలు. కానీ తెలంగాణ సాయుధపోరాటానికి తన ఆస్తులు అమ్మి ఆయుధ సాధన సంపత్తిని సమకూర్చిన యోధుడు చండ్ర రాజేశ్వర్‌రావు. వారికి అనునిత్యం అండగా నిలిచి, నాయకులుగా మార్గనిర్దేశం చేయడంలోనూ, ఆయుధ, ధన, సాధన సంపత్తిని సమకూర్చడంలోనూ ఆ సామాజిక వర్గాన్ని ఎవరూ విస్మరించలేరు. రామోజీరావు ఈనాడు పత్రిక కూడా ఒక విప్లవమే. పెట్టుబడికోసం, లాభాలకోసం….అని ఎవరు ఏమైనా విమర్శలు చేయనీయండి. ఆయన ఏయే సందర్భాల్లో ఎలా వ్యవహరించారన్న దానిపై అనేక విమర్శలు ఉండవచ్చు. థాట్ పోలీసింగ్ చేశారని ఆరోపణలూ చేయవచ్చు. నిజమే కానీ అప్పటిదాకా ఏకపక్షంగా, విజయవాడ కేంద్రంగా ముతక మార్గాల్లో జరుగుతున్న థాట్ పోలీసింగ్‌ను బహుముఖం చేశారాయన. అక్షరాన్ని, జ్ఞానాన్ని, సమాచారాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చారాయన. ఆంధ్రజ్యోతి ఇంకా ముందే వచ్చినా, రాజకీయ ప్రయోజనాలు కేంద్రంగా పనిచేసినా, దానికీ గుణాత్మకమైన మార్పును ప్రోత్సహించిన చరిత్ర ఉంది. ఆ పత్రికలు ఇవ్వాళ ఏం చేస్తున్నాయన్నది మాట్లాడుకునే ముందు అవి ముందు నిర్వహించిన మంచిని విస్మరించలేము. ఒక ప్రత్యామ్నాయ భావజాలాన్ని, భాషను ప్రచారంలోకి తెచ్చాయి. ఒక్క పత్రికా రంగమే కాదు, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో పురోగామి వర్గంగా వారు ఎదిగివచ్చారు. వారు ఎదిగారు, సమాజమూ ఎదగడానికి తోడ్పడ్డారు.

మరోవైపు రాజకీయాల్లో దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించిన నాయకులు ఆ కులానికి సంబంధించిన వారే. రాష్ట్రంలో ఊడలు దిగిన అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ మహావృక్షాన్ని పెకిలించడానికి కమ్యూనిస్టుల శక్తి చాలలేదు.1980లలో ఎన్‌టిఆర్ వచ్చేదాకా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కమ్యూనిస్టులు ప్రతిపక్ష పాత్రను దాటి ముందుకు రాలేకపోయారు. రాష్ట్రాన్ని భూస్వామ్య, అభివృద్ధి నిరోధక శక్తులే ఏలుతూ వచ్చాయి. చాలా సామాజిక వర్గాలకు అధికారం అందని మానిపండులా ఉంటూ వచ్చింది. కానీ ఎన్‌టిఆర్ ఒక ఉప్పెనలా వచ్చి తెలుగు సమాజాన్ని కుదిపేశారు. అత్యధిక శాతం మంది కొత్త నాయకులను, అది కూడా బీసీ, దళిత వర్గాలకు చెందిన నాయకులను ముందుకు తీసుకువచ్చి గెలిపించారు. అప్పటిదాకా రాజకీయాలను, అధికారాన్ని శాసిస్తున్న సామాజిక వర్గాల దుమ్ముదులిపారు. ఇతర సామాజిక వర్గాలకు అధికారంలో తగిన స్థానం కల్పించారు. సమాజంలో అనేకానేక ప్రగతిశీల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రజలకు తెలిసేలా, ప్రజల దగ్గరకు వెళ్లేలా చేశారు. ఆయనకు రాజకీయ నేపథ్యం లేదు. సినిమాల్లో హీరోగా గొప్ప గొప్ప ఆదర్శాలకు ప్రతీకగా నటించారాయన. కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా, ఉన్నత మానవుడిగా అనేక సినిమాల్లో నటించారు. ఆ ఆదర్శాలతోనే, ఆ అమాయకత్వంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి ఆయన రాక ఆయన సామాజిక వర్గానికి గొప్ప ఊతం ఇచ్చి ఉండవచ్చు. అధికారంలో వారి వాటా వారు తీసుకుని ఉండవచ్చు. కానీ ఆయన తెచ్చిన మార్పులు గుణాత్మకమైనవి, తెలుగుసమాజాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లినవి. రాజకీయంగా జాగృతం చేశారాయన. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, పటేలు పట్వారీ వ్యవస్థ రద్దు, మండలాల వ్యవస్థ ఏర్పాటు, ప్రజల వద్దకు పాలన, మద్య నిషేధం వంటివి ముందు ఎవరూ ఊహించని పరిణామాలు. రాజకీయాలు ఎక్కువగా తెలియకపోవడం, సినిమా ఆదర్శాల ప్రభావం ఎక్కువగా ఉండడం ఆయనను ప్రజల్లో గొప్పగా నిలబెట్టాయి. పందిరిని అల్లుకుని లతలు ఎదిగినట్టు ఆ సామాజిక వర్గమూ అధికారంలో, సంపద సోపానంలో అసాధారణరీతిలో రాష్ట్రంలో ఎదిగింది. అప్పటిదాకా ఎవరికీ ఆ సామాజిక వర్గంపై పెద్దగా కంటగింపు లేదు. కానీ రాజకీయ మాయోపాయాలతో ఎన్‌టిఆర్‌ను దించేసి చంద్రబాబునాయుడు ఎప్పుడయితే పగ్గాలు తీసుకున్నారో, అప్పటిదాకా ప్రగతిశీల శక్తులుగా ఉన్నవారు సైతం ఎప్పుడయితే చంద్రబాబుతో చేతులు కలిపారో ఇక అక్కడి నుంచి ఆ సామాజిక వర్గం టార్గెట్‌గా మారింది. ఎన్‌టిఆర్ ప్రభుత్వంలో ఉండి కూడా వ్యవస్థలకు వ్యతిరేకి(యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్)గానే పనిచేశారు. పాత వ్యవస్థలను బదాబదలు చేశారు. కానీ చంద్రబాబు రాజకీయాలను విలనైజ్ చేశారు. చంద్రబాబు, ఆయన పోగేసిన నేతల చేతలు, విధానాల కారణంగా వ్యవస్థను వ్యతిరేకించే సామాజిక వర్గం కాస్తా తనే ఒక వ్యవస్థ(యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ టర్న్‌డ్ ఇట్‌సెల్ఫ్ ఇన్‌టూ యాన్ ఎస్టాబ్లిష్‌మెంట్)గా అవతరించింది. ఆ ప్రయత్నంలోనే ఎన్‌టిఆర్‌ను అన్యాయంగా బలితీసుకున్నారు.

ఎన్‌టిఆర్‌ను మరింపించేందుకు మాయలు చేసే ప్రయత్నంలో మీడియా చంద్రబాబును చెట్టెక్కించింది. ఆయన అటునుంచి అటే ఆకాశంలోకి, అమెరికాలోకి, ప్రపంచబ్యాంకులోకి….ఎటెటో వెళ్లిపోయారు. ఎన్‌టిఆర్ ప్రజల వద్దకు వెళితే, చంద్రబాబు ప్రజలకు దూరంగా ప్రపంచబ్యాంకు వలల్లోకి వెళ్లారు. ఉద్యమాలను, ఆకాంక్షలను నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ, నిషేధిస్తూ, ఏమైనా చేయగలను, ఎలాగైనా నెగ్గగలను అనే ఒక భ్రమలోకి వెళ్లిపోయారు. ఆయన అండతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, మంత్రులు, వందిమాగధ జనం సమాజంపై రైడ్ చేశారు. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడాన్నే నిషేధించేదాకా వెళ్లింది ఆయన రాజ్యం. పర్యవసానంగా 2004లో ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఆయన ఇప్పటికీ కోలుకోలేదు. కోలుకునే ప్రయత్నం చేయడంలేదు. కోల్పోయిన విలువలను తిరిగి కూడగట్టుకునే ప్రయత్నం చేయడంలేదు. ఇప్పుడు విభజన భయంతో ఆయన రకరకాల తప్పులు చేస్తున్నారు. ఆయన వైఫల్యం, ఆయన సామాజికవర్గానికీ అపప్రథ తెచ్చిపెడుతోంది. ఆ సామాజిక వర్గం ఒకప్పుడు మార్పును ఆహ్వానించినవర్గం. ధైర్యంగా నిర్ణయాలు చేయగలిగిన సామాజికవర్గం. గతిశీలంగా వ్యవహరించగలిగిన సామాజిక వర్గం. జీవన, ఉద్యోగ, వ్యాపారాలకోసం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికయినా చొరవతో దూసుకెళ్లి, శ్రమించి, ఎదిగిన సామాజిక వర్గం విభజనకు వ్యతిరేకంగా ఇప్పుడెందుకింత ఘర్షణపడుతుందో అర్థం కాదు.

ఒక్క తీర్మానంతో తన కంపెనీల హెడ్డాఫీసును హైదరాబాద్ నుంచి హర్యానాలోని గుర్‌గాంకు మార్చగలిగిన లగడపాటి రాజగోపాల్, భారంగా పరిణమిస్తుందని భావించిన ఒక శుభోదయాన వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేసిన రాజగోపాల్ ఇప్పుడు విభజన విషయంలో ఎంత తిరోగామిగా ఆలోచిస్తున్నాడో గమనించాలి. ఒక్క చంద్రబాబు, రాజగోపాల్, రాయపాటిలే కాదు పయ్యావుల కేశవ్, గాలి ముద్దు కృష్ణమ, దేవినేని ఉమ వంటి వారలు మాట్లాడుతుంటే వారిని సామాజిక వర్గ ప్రతినిధులుగా చూసి జనం ఒక ద్వేషభావం పెంచుకుంటున్నారు. ఇక మీడియా ఉన్మాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. విచక్షణా పరుల చేతుల్లోంచి మీడియా ఉన్మాదుల చేతుల్లోకి పోయింది. అంతిమ పర్యవసానాలను గురించి ఎవరూ ఆలోచించడం లేదు. జనాన్ని రెచ్చగొట్టడం ఎలా అన్నదానికి పరిమితమై ఉన్నవీ లేనివీ కల్పించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఆ మీడియా ఎక్కువగా ఆ సామాజిక వర్గం చేతుల్లోనే ఉండడం, అది కూడాసామాజిక వర్గాన్ని ద్వేషించడానికి కారణం కావడం యాదృచ్ఛికం కాదు. గత రెండు దశాబ్దాలలో నాయకులు, మీడియా, పారిశ్రామికవేత్తలు ప్రవేశపెట్టిన విపరీత సామాజిక వివర్తన పర్యవసానం ఈ విద్వేషం. అది సామాజికవర్గం తప్పు కాదు, నాయకుల వైఫల్యం, మీడియా వైపరీత్యం.