తెలంగాణ అకస్మాత్తుగా ఊడిపడిందా?

సీమాంధ్ర నాయకత్వానిది అజ్జకారితనం

ఫజల్ అలీ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా ఆంధ్రతో కలిపారు.
హైదరాబాద్ అసెంబ్లీలో తీర్మానం చేయకుండావిలీనం చేశారు.
ఆరు దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోంది.
నాలుగు దశాబ్దాల క్రితం ఉవ్వెత్తున ఉద్యమం ఎగసి 360 మంది మరణించారు.
1994 నుంచి మలిదశ ఉద్యమం మొదలైంది.

2001 నుంచి తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.
మొదట వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ప్రేరేపించారు.
2004లో తెలుగుదేశం సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి టీఆరెస్‌తో కలసి పోటీ చేసింది.
ఒకనాడు విశాలాంధ్ర నినాదం ఇచ్చిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించింది.
బిజెపి తెలంగాణ రాష్ట్ర డిమాండును సమర్థించింది.
2008లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని సమర్థిస్తూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది.

2008లో తెలుగుదేశం నలుగురు పొలిట్ బ్యూరో సభ్యులతో కమిటీ వేసి మూడు మాసాలు చర్చలు జరిపి తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది.
2009లో తమను గెలిపిస్తేనే తెలంగాణ ఏర్పాటవుతుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.

2009లో కేసీఆర్ నిరాహారదీక్ష, విద్యార్థుల ఉద్యమంతో దిగివచ్చిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు దఫాలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించింది.
శ్రీకృష్ణకమిషన్ రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్‌లందరితో చర్చించి నివేదిక సమర్పించింది.

ఇంత ప్రక్రియ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది.
తెలంగాణ ఏర్పాటు ఏదో అకస్మాత్తుగా, ఎవరికీ చెప్పకుండా, రహస్యంగా జరిగినట్టు చెబుతున్న ప్రబుద్ధులు ఈ పరిణామాలన్నింటినీ గమనించాలి.
ఆస్తులు, అప్పులు, పంపకాలు, వివాదాల పరిష్కారం…ఇవన్నీ ఏరాష్ట్ర ఏర్పాటులోనయినా తదనంతరం ముందుకు వస్తాయే తప్ప, ముందే వీటన్నింటినీ పరిష్కరించి రాష్ట్రాన్ని విభజించడం జరుగలేదు.
సీమాంధ్ర నాయకత్వానిది కేవలం అజ్జకారితనం, గయ్యాళితనం, ఆధిపత్య దురహంకారం.