క్లాప్, స్విచ్ఛాన్, take, కట్, ప్యాకప్

ఒక ప్రత్యక్ష సాక్షి కథనం

విజయవాడ ఉద్యమం పార్ట్-1: ‘ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలకు, పాఠశాలకు కోటాలు ఇచ్చి బస్సుల్లో విద్యార్థులను తరలించండి. బ్రహ్మాండమైన వేదిక ఏర్పాటు చేయండి. విద్యార్థులు కూర్చునేందుకు తివాచీలు పరవండి. విద్యార్థులకు నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందించండి. టీవీల వాళ్లకు ముందుగానే సమాచారం ఇవ్వండి. ముఖ్యంగా ఎన్‌టీవీని. సభను విస్తృతంగా, అందంగా చూపించడానికి జిమ్మీ కెమెరాలను ఏర్పాటు చేయండి. క్లాప్, స్విచ్ఛాన్, take, కట్, ప్యాకప్….ండు గంటల్లో అంతా పద్ధతి ప్రకారం జరగాలి. సభ అయిపోగానే విద్యార్థులను జాగ్రత్తగా కళాశాలలకు పంపంచి వేయండి.’

విజయవాడ ఉద్యమం పార్ట్-2: ‘మహిళా గర్జన విజయవంతం చేయాలి. పీడీలతో చెప్పి డ్వాక్రా మహిళలను రప్పించండి. సంఘాలకు కోటాలు ఇవ్వండి. వాళ్లుంటున్న కాలనీలకు, సంఘాల కార్యాలయాలకు బస్సులు ఏర్పాటు చేయండి. టెంట్లు వేసి, వచ్చినవారికి కుర్చీలు, తివాచీలు ఏర్పాటు చేయండి. అందరికీ నీళ్లు, మజ్జిగ పొట్లాలు, పులిహోర పొట్లాలు అందించండి. టీవీల వాళ్లను సకల సన్నాహాలతో పిలవడం మరవద్దు. సభ బాగా జరగాలి. ఉపన్యాసాలు పొదుపుగా జరగాలి. వచ్చినవాళ్లందరినీ మళ్లీ జాగ్రత్తగా ఇళ్ల వద్ద వదిలిపెట్టాలి.’

‘‘ఏమి ఉద్యమమయ్యా. ఒక్క లాఠీ చార్జీ లేదు. ఒక్క చోట టెన్షనూ లేదు. అంత సాఫీగా, కూల్‌గా జరిగిపోతున్నది…మాకాడ పదిమంది పోరలు గుమి కూడితే తరిమితరిమి కొడుతున్నారు. ఇంకా ఎక్కువ మంది ఉంటే బాష్పవాయుగోళాలు వదుల్తారు. సభలు పెట్టాలంటే పర్మిషన్లంటారు. నిషేధాజ్ఞలు ఉన్నాయంటారు. ఉద్యోగులు, పోలీసులు, నాయకులు, అధికారులు అంతా కలిసి ఐకమత్యంతో ఉద్యమాలు చేయడం మీ దగ్గర్నే చూస్తున్నా. భలే వాళ్లయ్యా!’ అని ఒక ప్రముఖ న్యూరాలజిస్టు వ్యాఖ్యానించారని ఆ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.