1953లో విజయవాడ ఎందుకు రాజధాని కాలేదు?


విజయవాడకు వ్యతిరేకంగా ఎలా కుట్ర జరిగింది?
విజయవాడ మహానగరం ఎందుకు కాలేకపోయింది?
రాజధానిపై అసెంబ్లీ సభ్యుల్లో ఓటింగ్ జరిగిన రోజు ‘ఆంధ్రపత్రిక’ ఏం రాసింది?

ప్రజా విజయం

రాష్ట్ర తాత్కాలిక రాజధాని గుంటూరు-విజయవాడలోనే ఏర్పడాలనే వివరణను రాష్ట్ర అసెంబ్లీలోని ఆంధ్రసభ్యులు నాలుగువోట్ల మెజారిటీతో ఆమోదించారు. సవరణకు అనుకూలంగా వోటువేసిన 62 మంది సభ్యులూ ఆంధ్రులే. సవరణకు ప్రతికూలంగా వోటువేసిన 63 ముగ్గురిలో ఆంధ్రేతరులు అయిదుగురిని తీసివేస్తే సవరణకు ప్రతికూలంగా వోటువేసిన ఆంధ్రసభ్యులు 5 మంది మాత్రమే. ఆంధ్ర రాజధాని సవరణపై ఆంధ్రేతరులవోట్లను పరిగణించరాదని మేము ఈ ప్రసక్తి వచ్చినప్పుడే స్పష్టం చేశాం. కర్నూలు నిర్ణయాన్ని సమంర్థించుకోదలచినవారు విజయవాడ సవరణను ప్రతిఘటించుటకు ఆంధ్రేతరుల సహాయంపై ఆధారపడటం అత్యంత శోచనీయం. నైతిక ప్రమాణాలకు విశేష ప్రాధాన్యమిచ్చినవారు ఇప్పుడీ విధంగా ప్రవర్తించి నైతికంగా పతనమొందారు. ‘టెక్నికల్’గా సవరణ వీగిపోయినా ఆంధ్ర రాజధాని నిర్ణయానికి సంబంధించినంతవరకు సభ్యుల నిర్ణయం అసందిగ్ధంగానే వున్నది. విజయవాడ – గుంటూరు సవరణ నెగ్గిందనే కేంద్రప్రభుత్వం అంగీకరించగలదని విశ్వసిస్తున్నాం. రాష్ట్రరాజధాని విషయంలో ఆంధ్రేతరుల ప్రసక్తి వుండరాదని చెప్పిన శ్రీసంజీవరెడ్డిగారున్నూ, వారిజోక్యాన్ని తొలగించి విజయవాడ-గుంటూరు సవరణ నెగ్గిందని అంగీకరింపగలరని ఆశిస్తున్నాం. ప్రజాభిమతాన్ని ధిక్కరించడాన్ని ఈ నాయకులిప్పటికైనా విరమిస్తారని నమ్ముతున్నాం.

విజయవాడ – గుంటూరు సవరణ నెగ్గడం ప్రజావిజయం. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన 62 మంది ఆంధ్ర ప్రతినిధులను, ఇందుకు తోడ్పడిన ఇతర ఆంధ్ర ప్రతినిధులనూ మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఆంధ్ర అసెంబ్లీ ఈ సవరణను ధృవీకరించుటకు తిరిగి సమావేశం కావలసివస్తే, ఇది కేవలం లాంఛనం మాత్రమేనని మా అభిప్రాయం. అప్పుడు ఆంధ్ర ప్రతినిధులు యావన్మంది కూడా యేకాభిప్రాయంతో ప్రవర్తించి ప్రజలవి శ్వాసానికి పాత్రులగుదురనే మా విశ్వాసం. ఆంధ్ర ప్రజలు తమ రాజధానిని తాము నిర్ణయించుకోవాలని ప్రధానమంత్రి ప్రకటించి నేటికి సరిగ్గా నాలుగు మాసాలైనది.

ప్రజాప్రతినిధులు ప్రజల నిర్ణయాన్ని శిరసావహించివుంటే, రాజధాని నిర్ణయమేగాక, రాజధాని నిర్మాణం కూడా ఇప్పటికి పూర్తి అయివుండేది. ఆంధ్ర ప్రజాప్రతినిధులు నేడు చూపిన విజ్ఞతను జూన్ 5న చూపగలిగి ఉంటే, రాష్ట్రం అవతరించే నాటికి రాజధాని ఏర్పడేది. గుంటూరు – విజయవాడల మధ్య ఒక మహానగరం వెలిసేది.

ap2607531

అన్ని ప్రాంతాల ప్రజలు ఆంధ్రాభిమానంతో, రాష్ట్ర భక్తితో రాష్ట్రాభివృద్ధికి బలిష్టమైన పునాదులను వేసి చక్కని ప్రాతిపదికను తయారు చేసే వారు. నిరాశ, నిస్పృహలతో వృధా అయిపోయిన ఈనలబై రోజులలో రాష్ట్రావతరణ ఉత్సాహానికి తగిన సన్నాహాలు చేసేవారు. నాలుగు మాసాలకాలం, ప్రజల నిర్మాణ శక్తి కొంత వృధా అయినా, ఆంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల ప్రగాఢ వాంఛను గుర్తించి, మొదట తొందరపాటుగా చేసినతప్పును సరిదిద్దుకొని ప్రజానిర్ణయాన్ని పాటించినందున అఖిలాంధ్రమూ నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ విశాలాంధ్ర సాధనకు నూతనోత్సాహంతో కృషిచేయగలుగుదురు. ఈనాలుగు మాసాల సంఘటనలు, ఆంధ్ర ప్రజలకు ఒక అపూర్వనుభవాన్ని చేకూర్చినవి. ప్రజల అభిమతాన్ని అలక్ష్యంచేసి, ప్రజల నిర్ణయానికి విరుద్ధంగా తాము చేయగల్గింది ఈషణ్మాత్రము లేదని ఆంధ్ర నాయకులు గ్రహించగలిగారు. నాయకులు ఏదోఅవసరానికి దూరదృష్టిలేని నిర్ణయాన్ని చేసినా ఆ నిర్ణయాన్ని మార్పింపగల శక్తి తమకుగలదని ఆంధ్ర ప్రజానీకం నిరూపించింది. ఆంధ్రలో ప్రజాస్వామికానికి ఉజ్వల భవిష్యత్తుగలదని నిరూపించబడింది. ఒక అనుచిత నిర్ణయం సముచిత నిర్ణయంగా మారిపోవడానికి నాయకులకంటే, వారి అనుయాయులే ఎక్కువగా బాధ్యులు కావడంకూడా గమనింపతగిన పరివర్తన. నాయకులు తమ అనుచిత నిర్ణయాన్నే పట్టుకు కూర్చున్నా, ప్రజాసోషలిస్టు పార్టీవారు ప్రతిష్ఠ పేరిట జూన్ 5 నిర్ణయాన్ని పట్టుకు కూర్చున్నా, ఇతర పార్టీలవారు, ముఖ్యంగా కృషీకార్ లోక్‌పార్టీవారు ధైర్యంగా, సాహసంతో ప్రవర్తించినందున, రాష్ట్రావతరణకు ముందే రాష్ట్రాన్ని ఎదుర్కొన్న ఒక మహవిపత్తు తొలగిపోయింది. జూన్ 5 నిర్ణయం మారాలని స్పష్టం చేసిన కృషికార్‌లోక్ పార్టీవారు, ఆ నిర్ణయం ఆంధ్ర ప్రజానీక సమిష్టి క్షేమం దృష్ట్యా మారుటకు తోడ్పడిన వీరు అత్యంత అభినందనీయులు.

గుంటూరు – విజయవాడ రాజధాని కావాలని అసెంబ్లీ ఆంధ్ర సభ్యులు నేడు చేసిన నిర్ణయం ఏఒక పార్టీ విజయమూ గాదు, ఏ ఒక ప్రాంత విజయమూగాదు. ఈనిర్ణయం అన్ని ప్రాంతాలవారికి సమానంగానే గర్వకారణం. ఆంధ్రజాతి అంతకూ గర్వకారణం. ఒక ప్రాంతంపైగల ద్వేషంతో ఈ నిర్ణయం జరుగలేదు. ఒక ప్రాంత అభివృద్ధిని నిరోధించాలనే ఉద్దేశంతో ఈ మార్పు జరుగలేదు. ఈ మార్పుకు గుంటూరు, కృష్ణ, గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల వారి కృషి, చిత్తూరు, అనంతవరం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల వారి త్యాగమూ సమంగా తోడ్పడినవి. ఈమార్పువల్ల గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాల వారి బాధ్యత హెచ్చినది. వీరి బాధ్యత హెచ్చుటతో ఇతర జిల్లాలవారి బాధ్యత అంతవరకు తగ్గింది. అంతేకాదు ఆ జిల్లాల వారికి ప్రత్యేక రక్షణ లభించింది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అభివృద్ధిని సాధించవలసిన బాధ్యత ఇతర జిల్లాలపైబడింది.

ఇటు తిరుపతిలో గాని అటు అనంతపురంలో గాని ఆంధ్ర హైకోర్టు సత్వర స్థాపన బాధ్యత ఈ జిల్లాలపై ఉన్నది. తక్షణం ఈ ప్రాంతానికి ఒక విశ్వకళా పరిషత్తును ఏర్పాటు చేయవలసి ఉన్నది. ఈ జిల్లాలలోని అత్యవసర పనులను కూడా కొంతకాలం వాయిదా వేసి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలకు క్షామం నుంచి శాశ్వతరక్షణను కల్పించవలెను. రాజ్యాధికారము ఆ జిల్లాల వారి కిచ్చితిమి గదాయని ఇతర జిల్లాలవారు ఉపేక్షావైఖరిని ప్రదర్శింపరాదు. రాజ్యాధికార నిర్వహణకు వారికి అన్నివిధాలా తోడ్పడాలి. సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టుల నిర్మాణానికేగాక, ఒకటి రెండు కోట్లతో పూర్తికాగల చిన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేయాలి. ఆంధ్రరాష్ట్ర వాటాకు వచ్చిన మూడుకోట్ల ఋణాన్నీ అటు శ్రీకాకుళం, విశాఖజిల్లాలలోనూ, ఇటు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుజిల్లాలలోనూ నీటి వనరులు ఏర్పాటు చేయుటకే వినియోగించాలి. రాజధాని నిర్మాణానికిప్పుడు, పైసా ఖర్చు చేయవలసిన అవసరం లేదు గనుక, ఇందునిమిత్తం కేంద్రప్రభుత్వం ఇవ్వగలమొత్తాన్ని గూడా ఈ ఆరు జిల్లాల్లోనూ నీటివనరుల అభివృద్ధికే వినియోగింపవచ్చును.

కొందరు స్వార్థపరులు ఈ మార్పును ‘‘సర్కారు – రాయలసీమల’’ మధ్య విద్వేషాలను ప్రోత్సహించుటకు వినియోగించుకొందురు. రాష్ట్రావతరణతో ఈ విభేదాలు అంతరించిపోగలవు. ఇట్టి ప్రాంతీయ అభిమాన దురభిమానాలను ప్రోత్సహించువారు విశాలాంధ్రోద్యమమునకు మహాపరాధం చేస్తున్నారని, విశాలాంధ్ర స్థాపనకు తీవ్ర ప్రతిబంధకాలు కల్పిస్తున్నారని ఆంధ్ర ప్రజలందరూ గుర్తించాలి. శతాబ్దంగా ఒకే రాష్ట్రంలో ఉంటూ, ప్రత్యేక రాష్ట్రాన్ని పొందుతున్న వారే ఈ విధంగా ప్రవర్తిస్తే వీరితో తాము ఎలా కలిసిపోగలమనే భావం తెలంగాణా ప్రజానీకంలో కలగనివ్వడం ప్రమాదకరం. ఆంధ్రులందరూ, వారు ఏ ప్రాంతంలోవున్నా ఎక్కడున్నా ఒక్కటేనని, ఈనాడు మనం ఋజువు చేసుకోలేకపోతే మనం విశాలాంధ్రను సాధింపలేము. ఆంధ్రరాష్ట్రం విశాలాంధ్రాభివృద్ధికి సాధనమనే విషయాన్ని గుర్తించి ప్రవర్తించాలి. రాష్ట్ర రాజధాని విషయంలో సముచిత నిర్ణయం చేయగలిగిన మనం, విశాలాంధ్ర రాజధాని విషయంలోనూ సముచిత నిర్ణయానికి రాగలమని హైద్రబాదును సాధింపగలమని, ఇందువల్ల మనం తెలంగాణా సోదరులకు హామీ ఇవ్వకలుగుతున్నాం. ఆంధ్రకు విజయవాడ – గుంటూరులను వదలి కర్నూలును రాజధానిగా వరించిన నాయకులు, విశాలాంధ్రకు హైదరాబాదును వదిలి, ఏ వరంగల్‌నో, గోల్కొండనో రాజధానిగా వరిస్తారేమో అన్న భయం వారికి లేకుండా చేశాం. అన్నింటినీ మించి ఆంధ్రజాతి సజీవజాతి, శక్తివంతమైన జాతి అని నిరూపించుకున్నాం…