ఏపీఎన్జీవోల సభ ఓ హెచ్చరిక, ఓ కనువిప్పు

By GV

తెలంగాణపై ఎప్పుడూ లేని భావ సంచలనం ఈరోజు (7.9.2013) నన్ను అతలాకుతలం చేసింది. ఉదయం నుంచి టీవీల ప్రచార తీరు.. వక్తల ప్రసంగ అంశాలు.. రకరకాల భావోద్వేగాలకు లోనుచేశాయి. ఆధిపత్య అహంభావ ప్రదర్శన.. వక్రీకరణలు.. నటనలు, కపటత్వం లేకుండా ఏదైనా వాదన వినిపిస్తే అది ఎలాంటిదైనా వినడానికి, విశ్లేషించుకోవడానికి వీలుంటుంది. కానీ.. తెలంగాణలోనూ నిష్పాక్షికంగానో మధ్యేవాదంగానో ఉండాలనుకునేవారికి కూడా ఏపీఎన్జీవోల సభ ఓ హెచ్చరికగా చెంపపెట్టుగా కనువిప్పు కలిగించేదిగా స్పష్టమయింది. మనకు మధ్య తరగతి మర్యాదలొద్దు.. తెలంగాణ అమాయకత్వం వద్దు.. మొహమాటాలొద్దు.. అలాగే ఉంటే వంచనా చతురులు మరింతగా ముంచుతారని అర్థమయ్యేలా ముఖం మీద గుద్దినట్లనిపించింది.

సభకు అనుమతించిన తీరు.. సభను నిర్వహించిన తీరు.. పోలీసులు, ప్రభుత్వం, అధికారులు, నిర్వాహకులు, వక్తలు..మీడియా తీరు.. మొత్తంగా అదే ఆధిపత్య అహంభావ ధోరణిని మరోసారి స్పష్టం చేశాయి. తెలంగాణ నిర్బంధానికి.. ఆంధ్రా ఆటవిడుపులకు మధ్య తేడా అందరికీ మరోసారి అవగతమయింది.నిజాం కాలేజీ ముందు విద్యార్థులపై, తెలంగాణ అని నినదించిన పోలీసుపై దాడులు.. కలచివేశాయి. ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోని రీతిలో మీడియా విక్రుత ప్రదర్శన భరించలేక.. చానళ్లను మూసేయాల్సి వచ్చింది.

అనుకున్నదే అయినా.. తెలిసిందే అయినా.. ఎందుకో మనసు కొంత ఆవేదనకు లోనయింది.. ఎక్కడికి పోయి.. ఏం చేద్దాం అనిపించింది.. మిత్రుల ఫోన్లు.. అన్నా.. బ్రిటిష్్ పాలనలో కన్నా ఘోరంగా ఉందికదా పరిస్థితి అని ఆందోళన..
ఒక్క అంశమని కాదు.. పలు రకాలుగా.. ఈ సభ మొత్తంగా.. తెలంగాణలోని మధ్య తరగతి.. మెత్త తరగతి మేధావులను, బుద్ధి జీవులను కలవరపరిచింది. ఇప్పటిదాకా క్రియాశీలంగా ముందుకురానివారిని కూడా మనం చేయాల్సింది ఉంది అనే ఆలోచనకు పురికొల్పింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి.. తెలంగాణ స్వతంత్రతను కోరుకోవాలనుకోవడానికి, ఉద్యమించడానికి కారణాలను గుర్తెరిగిన నిజాయితీపరులైన మేధావులుగానీ, ప్రగతిశీలురుగానీ విభజన అంశం మనసుకు ఎలా అనిపించినా వ్యతిరేకించరు. సీమాంధ్ర ఆధిపత్యం అన్ని రకాలుగా ఇక్కడి ప్రజలను దెబ్బతీసినందునే, దోపిడీ చేస్తూ హేళన చేస్తున్నందునే ప్రజలు ఉద్యమించాల్సి వచ్చింది. ఈ వాస్తవాన్ని తెలుసుకుని వ్యవహరించాల్సిన కొన్ని వర్గాల ప్రజలు.. ప్రత్యేకించి మేధో వర్గానికి చెందినవారుగా భావించేవారిలో కొందరు.. కొంత విచిత్రమనిపించేలా అదే రకం ఆధిపత్య ధోరణితోనే చెలరేగిపోతుండటం తాజా పరిణామం. రకరకాల కారణాలు, ప్రభావాలతో ఇంతకాలం గౌరవించదగిన మేధోవర్గం, బుద్ధిజీవులు, మానవతావాదులు అనుకున్నవారిలోనూ ఇప్పుడు అసలు స్వభావాలు బయటపడుతున్నాయి. అందరినీ నమ్మేది తెలంగాణ.. మోసపోయేది తెలంగాణ.. అన్నట్లు ఈ ప్రక్రియ సాగిపోతోంది. ఈ తీరు చూస్తుంటే ఇప్పటిదాకా మనం గౌరవించిన, అభిమానించిన పెద్దల్లో, మిత్రుల్లో ఎందరు ఎలాంటివారో, అసలు స్వభావం ఎలాంటిదో అనే రాకూడని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మధ్య ఓ ప్రగతిశీల ప్రచురణకర్త, ఓ స్రుజనకారుడు.. ఇలా ఊహించని వర్గం నుంచి ప్రతికూల అభిప్రాయాలు వెలువడ్డాయి.. ఎన్జీవో నేత అయితే చెప్పలేని వర్గాలు ఉన్నాయంటూ.. డాక్టర్లు, లాయర్లు, ఐటీ వర్గాలను ప్రస్తావించారు.. (ఇప్పటికీ.. ఇంకా న్యాయం పక్షాన నిలిచే మేధావులు, ప్రగతిశీలురు, సంఘాలు ఉన్నాయనే విశ్వాసం సన్నగిల్లిపోలేదు. మీడియా మాయాజాలం వాస్తవాలను భిన్నంగా చూపిస్తోంది.)

ఇక.. ఏపీఎన్జీవోల సభలో డాక్టర్ మిత్రా, సత్యవాణిమాట్లాడిన తీరు చూస్తే వీరెలాంటి మేధావులో, ఎంతటి కపటత్వం దాగుందో, ఎలాంటి ముసుగులు వేసుకుని ఎంతలా నటిస్తున్నారో తేలిపోయింది. కొన్ని విశ్వాసాలకో, సిద్ధాంతాలకో, భావజాలాలకో కట్టుబడినవారు చిత్తశుద్ధితో ప్రవర్తించాలి. ఆ విలువల ప్రాతిపదికన వ్యవహరించాలి. కానీ.. సత్యవాణిగారు అసత్యవాణి వినిపించారు. అశోకుడి పోలికలు.. తెలంగాణ ఆడపడుచుల మాటలు.. పౌరాణిక పాత్రల పోలికలు.. అన్నీ అసహజంగా.. ఆధిపత్యాన్ని ప్రదర్శించేవే.డాక్టర్ మిత్రా తీరు మరీ విచిత్రం.. అసహనంతో, అహంభావంతో ఊగిపోయారు. చాలామందికి అప్పటివరకు పెద్దగా తెలియకున్నా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సందర్భంగా పరిచయమయ్యారు. చూడడానికి పెద్దాయనలా గంభీరంగా హుందాగా సౌమ్యంగా మేధస్సు ఉన్నవాడిలా కనిపించారు. సరైన రాజకీయ పార్టీలు లేవని.. ఒక సోషలిస్టు వ్యవస్థకోసం పాటుపడుతున్నారేమో అనిపించింది. అప్పడు ఆ పార్టీ సామాజిక తెలంగాణ వాదాన్ని బలపరిచింది. ఆ తర్వాత చిరంజీవితో విభేదాలొచ్చినప్పడు ఆయన తీరు నచ్చింది. ఒక మేధావి, సోషలిస్టు భావాలున్నవాడు, సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతో ఒక కొత్త రాజకీయ సంస్కతి కోసం ప్రయత్నించాలనుకుంటే సఫలం కాలేదు కదా అనిపించింది. ఈ వ్యవస్థలో మేధావులకు పరిమిత పాత్ర కూడా లభించే పరిస్థితులు లేవుకదా అనిపించింది. అలాంటి ఆయన సభలో మాట్లాడిన తీరు చూస్తే.. ఏ బాపతువారైనా ఆధిపత్యం విషయంలో ఒకటే అనిపించింది..

మొత్తానికి.. ఈ సభ తెలంగాణలోని భిన్నవర్గాలవారిలో కొత్త స్పందనలకు దారితీసేందుకు దోహదపడుతుందనిపించింది..
ఇంకా చాలా అంశాలున్నాయి…
వాస్తవాలు.. వక్రీకరణలు..
మౌలిక అంశాలు.. పరిష్కారాలు..
భావజాలాలు.. భిన్న సామాజిక వర్గాలు.. తీరు…