రెచ్చగొడతారు, రెచ్చిపోవద్దు, రచ్చ చేయొద్దు

ఏపీఎన్జీవోల సభపై మిత్రులు కొందరు ఆవేశపడుతున్నారు. హైదరాబాద్‌లో సభ జరిగితే ఏదో కొంపలు మునుగుతాయన్న ఆందోళన మిత్రుల ఆవేశానికి కారణం కావచ్చు. సభ పెట్టుకోనివ్వండి. స్వయంగా ప్రభుత్వం దగ్గరుండి సభను విజయవంతం చేయనీయండి. హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదని వారిని చెప్పుకోనివ్వండి. వాళ్ల ట్రాప్‌లోకి వెళ్లవద్దు. ఆవేశపడి, ఏదైనా రచ్చ చేస్తే దానిని సాకుగా చూపి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనో, శాశ్వత ఉమ్మడి రాజధాని చేయాలనో వారు వాదించవచ్చు. అటువంటి అవకాశం కోసం వారు ఎదరు చూస్తున్నారు. దయచేసి తెలంగాణవాదులు పంతాలకు, ప్రతిష్ఠలకు పోవద్దు.

ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పాలి. మద్రాసు మాదే అని రుజువు చేయడానికి స్వయంగా ప్రకాశం పంతులు జార్జిటౌను అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా తమిళులు ఇలాగే ఆవేశపడ్డారు. కానీ ఆయనకు డిపాజిట్టు రాలేదు.

5000 మంది పోలీసులు, 200 మంది ఎస్‌ఐలు, అనేకమంది సీఐలు, ఏసీపీలు, ఎస్‌పీలను రక్షణగా పెట్టి, ప్రభుత్వమే అన్ని అనుమతులూ సమకూర్చి పెట్టి ఈ సభను నిర్వహించడానికి తోడ్పాటునందిస్తున్నది. ఐదున్నర దశాబ్దాలుగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న ఆంధ్ర ఉద్యోగ మిత్రులకు సభ పెట్టుకునే ప్రజాస్వామిక హక్కు ఉంది. వాళ్లిప్పుడు సభలు పెట్టి రుజువు చేసేదేమీ లేదు.

ఈ ప్రభుత్వం మనకు హక్కులు లేకుండా చేసి ఉండవచ్చు. వేలాది మంది పోలీసులను పెట్టి మన సభలను అడ్డుకుని ఉండవచ్చు. వందలాది చెక్‌పోస్టులు పెట్టి హైదరాబాద్‌ను దిగ్బంధం చేసి ఉండవచ్చు. మన ప్రాంతంలోనే, మన నగరంలోనే మనలను పరాయిలను చేసి ఉండవచ్చు. హక్కులకోసం పోరాడినవాళ్లం. అవతలివారి హక్కును గౌరవిద్దాం. శాంతిని భగ్నం చేసుకోవద్దు. తెరవెనుక నుంచి సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ విసురుతున్న కుట్రల వలలకు చిక్కవద్దు.